Super Tasty Sweet Potato Kulfi: చూడటానికి రెడ్, పింక్ కలర్లో, కొద్దిగా మట్టితో ఉండే చిలగడదుంప, టేస్ట్‌లో మాత్రం అద్భుతంగా ఉంటుంది. పచ్చిగా తిన్నా లేదా ఉడకబెట్టి తిన్నా ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇదిలా ఉంటే చిలగడదుంపతో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. హాల్వా, గులాబ్జామున్ ఇలా ఎన్నో ప్రిపేర్ చేసుకోవచ్చు. కేవలం ఇవి మాత్రమే కాకుండా స్వీట్ పొటాటోతో ఫుల్ టేస్టీ కుల్ఫీ చేసుకుని తినొచ్చు.
సాధారణంగా కుల్ఫీ చేయాలంటే చక్కెర, క్రీమ్, మిల్క్‌పౌడర్ లాంటి పదార్థాలు కావాలి. అయితే ఇవేమి లేకుండా కేవలం చిలగడదుంపలతో కుల్ఫీ చేసుకోవచ్చు. టేస్ట్ అద్దిరిపోతుంది. ఎలాగూ సమ్మర్ వచ్చేసింది కాబట్టి పిల్లల కోసం బయట నుంచి తీసుకొచ్చే బదులు ఇంట్లోనే చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా స్వీట్ పొటాటో కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:
- చిలగడదుంపలు - 250 గ్రాములు
- జీడిపప్పు - 15
- బాదం పప్పు - 15
- పాలు - 1 కప్పు
- బెల్లం తురుము - 1/3 కప్పు
- యాలకులు - 4
- డ్రైఫ్రూట్స్ పలుకులు - కొద్దిగా

తయారీ విధానం:
- పాలను మరిగించి చల్లారిన తర్వాత ఓ అరగంట సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి.
- చిలగడదుంపలను నీటిలో అర్ధగంట నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల వాటికి ఉండే మట్టి పోతుంది. ఆ తర్వాత వాటిని శుభ్రంగా కడిగి ఉడికించుకోవాలి.
- ఈలోపు మరోగిన్నెలో బాదంపప్పులు, జీడిపప్పులను తీసుకుని అందులో వేడినీరు పోసి గంట సేపు నానబెట్టాలి.
- బాదం నానిన తర్వాత పొట్టు తీసి పక్కన ఉంచాలి. ఉడికించిన చిలగడదుంపల పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఇలా అన్ని పదార్థాలు రెడీగా ఉన్న తర్వాత మిక్సీజార్‌లో స్వీట్ పొటాటో ముక్కలు, నానబెట్టి పొట్టు తీసిన బాదం, జీడిపప్పులు, యాలకులు, కొన్ని పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

- పాలను ఓకేసారి మొత్తం పోయకుండా కొద్దికొద్దిగా పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి.
- ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లం తురుము వేసుకోవాలి. ఇక్కడ బెల్లం తురుమును స్వీట్ పొటాటో తీపిని బట్టి వేసుకోవాలి. ముందే ఎక్కువ మొత్తంలో వేసుకోకుండా గ్రైండ్ చేసిన తర్వాత టేస్ట్ చూసి సరిపోకపోతే మరికొంచెం వేసుకోవచ్చు.
- మొత్తం మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కుల్ఫీ మిక్స్ రెడీ అయినట్లే. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న బౌల్స్ లేదా గ్లాసులలో పోసుకోవాలి.
- ఆపై డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి మూత పెట్టి ఫ్రీజర్‌లో 6 గంటలు లేదా వీలైతే రాత్రంతా ఉంచాలి. ఆ తర్వాత వీటిని తీసి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ పొటాటో కుల్పీ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

టిప్స్:
- మరింత రుచికరంగా ఉండటానికి కుంకుమపువ్వు లేదా రోజ్ వాటర్ వంటివి యాడ్ చేసుకోవచ్చు.
- స్వీట్ పొటాటో కుల్ఫీ మరింత రుచిగా ఉండాలంటే, పాలతో పాటు కొద్దిగా పాల పొడి లేదా కండెన్స్‌డ్ మిల్క్ వేసుకోవచ్చు.
- కుల్ఫీ మిశ్రమాన్ని చిన్న మట్టి కుండలలో పోసుకుని ఫ్రీజర్ పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే మట్టి కుండలు వాడితే ముందుగా వాటిని కడిగి ఓ గంట సేపు నీటిలో నానబెట్టి ఆ తర్వాత యూజ్ చేయాలి.

మూడే మూడు ఉల్లిపాయలతో క్రంచీ "వడలు" - సాయంత్రానికి బెస్ట్ స్నాక్ - నిమిషాల్లో రెడీ!
మండే ఎండల్లో మజానిచ్చే "జామకాయ ఐస్‌క్రీమ్" - తక్కువ సమయంలోనే అద్దిరిపోయే రుచి!