Summer Special Vanilla Milkshake: ఎండాకాలం వచ్చిందంటే చాలు పిల్లలు ఐస్‌క్రీమ్‌ని ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఐస్ బండి కనపడితే చాలు కొనిచ్చే వరకు మారాం చేస్తుంటారు. ఇక ఐస్‌క్రీమ్‌లో కూడా బోలెడు ఫ్లేవర్లు ఉన్నాయి. మరీ ముఖ్యంగా వెనీలా ఐస్ అంటే పిల్లలకు చాలా ఇష్టం. కేవలం చిన్నారులు మాత్రమే కాదు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఎండాకాలంలో ఎప్పుడూ వెనీలా ఐస్‌క్రీమ్ కాకుండా ఓసారి వెనీలా మిల్క్‌షేక్ ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మండే ఎండల్లో ఒక్క గ్లాసు ఇది తాగారంటే అమృతమే. పైగా ఫుల్ చిల్ అవ్వొచ్చు. మరి లేట్ చేయకుండా వెనీలా మిల్క్‌షేక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:
- చిక్కటి పాలు - 1 లీటర్
- పంచదార - ముప్పావు కప్పు
- పాల పొడి - 4 టేబుల్‌స్పూన్లు
- విప్పింగ్ క్రీమ్ పౌడర్ - 2 టేబుల్‌స్పూన్లు
- శాంతన్ గమ్ పౌడర్ - 1 టీస్పూన్
- ఐస్‌క్యూబ్స్ - 10
- వెనీలా ఎక్స్ట్రాక్ట్ - 1 టీస్పూన్
- వెనీలా ఐస్‌క్రీమ్ - 4 స్కూప్స్
- డ్రైఫ్రూట్స్ పలుకులు - కొద్దిగా

తయారీ విధానం:
- స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టి చిక్కటి పాలు పోసి కలుపుతూ మరిగించాలి.
- పాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఓ గిన్నెలోకి పోసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
- ఇలా చల్లారిన పాలను ఫ్రీజర్‌లో సుమారు 3 గంటల పాటు ఉంచాలి.

- ఆ తర్వాత మిక్సీజార్‌లోకి పంచదార, పాల పొడి, విప్పింగ్ క్రీమ్ పౌడర్, శాంతన్ గమ్ వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మిల్క్‌షేక్ పౌడర్ రెడీ అయినట్లే.

- పాలు చల్లారిన తర్వాత మిక్సీజార్‌లోకి ఐస్‌క్యూబ్స్, గ్రైండ్ చేసిన మిల్క్‌షేక్ పౌడర్, వెనీలా ఎక్స్ట్రాక్ట్, ఫ్రీజర్‌లో ఉంచిన పాలు, వెనీలా ఐస్‌క్రీమ్ వేసి హై ఫ్లేమ్‌లో సుమారు ఓ నిమిషం పాటు బ్లెండ్ చేయాలి.
- ఇలా బ్లెండ్ చేసిన మిల్క్‌ను ఓ గ్లాసులోకి పోసుకుని పైన డ్రైఫ్రూట్స్ పలుకులతో గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీ వెనీలా మిల్క్ షేక్ ఇంట్లోనే రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- మిల్క్‌షేక్ పౌడర్ అనేది చాలా మెత్తగా ఉండాలి. ఏ మాత్రం రవ్వగా ఉన్నా టేస్ట్ బాగోదు. మెత్తగా ఉండటం కోసం కావాలనుకుంటే జల్లెడ పట్టుకోవచ్చు.
- పాలను బ్లెండ్ చేసేటప్పుడు వెనీలా ఐస్‌క్రీమ్ అనేది ఆప్షనల్. లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు.
- ఈ మిల్క్‌షేక్‌ను ప్రిపేర్ చేసుకునేందుకు నార్మల్ మిక్సీజార్లు కాకుండా జ్యూస్‌లు పట్టే జార్లు వాడితే టేస్ట్ మరింత బాగుంటుంది.
- డ్రైఫ్రూట్స్ పలుకులు బదులు స్ప్రింకిల్స్ యూజ్ చేసుకుంటే సరి.

పాతకాలం నాటి " పాల పూరీలు" - కమ్మగా ఉండే వీటిని ఎన్ని తిన్నా బోర్ కొట్టదు!
మీరు "వైట్ ఫారెస్ట్ పుడ్డింగ్" తినలేదా? - మధ్యాహ్నపు ఎండల్లో నోట్లో వేసుకుంటే - కూల్‌కూల్‌గా ఆహా!