Summer Special Saggubiyyam Sharbat: తెలుగువారి ఇళ్లల్లో సగ్గుబియ్యానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎండాకాలం వచ్చిందంటే చాలా మంది వీటితో చేసిన జావను తాగుతుంటారు. అలాగే వడియాలు, పాయసం, కిచిడి ఇలా ఎన్నో రకాల వంటలు చేసుకుంటారు. అయితే కేవలం ఇవి మాత్రమే కాకుండా సగ్గుబియ్యంతో అద్దిరిపోయే షర్బత్ కూడా చేసుకోవచ్చు. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. పైగా చాలా సింపిల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు.
సగ్గుబియ్యంలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాలు పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది శరీరాన్ని చల్లబరిచే గుణాలను కలిగి ఉంటుంది. వేసవిలో సగ్గుబియ్యం జావ లేదా ఇతర రూపాల్లో తీసుకోవడం వల్ల శరీరం వేడిని తట్టుకోవడానికి సహాయపడుతుంది. డీహైడ్రేషన్ సమస్య కూడా తగ్గుతుంది. మరి లేట్ చేయకుండా సగ్గుబియ్యం షర్బత్ ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

కావలసిన పదార్థాలు:
- నీళ్లు - 400 మిల్లీలీటర్లు
- స్ట్రాబెర్రీ జెల్లీ క్రిస్టల్స్ - 1 ప్యాకెట్
- సగ్గుబియ్యం - 1 కప్పు
- పాలు - 1 లీటర్
- పంచదార - 1 / 4 కప్పు
- రోజ్ సిరప్ - పావు కప్పు
- తరిగిన పిస్తాపప్పులు - కొద్దిగా

తయారుచేసే విధానం:
- ముందుగా ఓ గిన్నెలోకి సగ్గుబియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోసి సుమారు గంటసేపు నానబెట్టాలి. అలాగే పాలను మరిగించి చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో 400 ml నీళ్లు పోసి స్ట్రాబెర్రీ జెల్లీ క్రిస్టల్స్ వేసుకుని కలుపుకోవాలి. క్రిస్టల్స్ నీటిలో పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
- ఆ తర్వాత ఈ లిక్విడ్‌ను ఏదైనా ట్రేలో వేసి సుమారు 20 నుంచి 30 నిమిషాలు అలానే ఉంచాలి.
- జెల్లీ రెడీ అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుని ఓ బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచాలి.

- ఇప్పుడు సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అరలీటర్ నీళ్లు పోసుకుని వేడి చేసుకోవాలి.
- నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకుని మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి.
- సగ్గుబియ్యం ఉడికిన తర్వాత జల్లెడలో పోసి వడకట్టాలి. ఆపై వెంటనే చల్లటి నీళ్లు పోస్తే సాబుదానా విడివిడిగా ఉంటాయి.
- ఇప్పుడు ఓ గిన్నెలోకి కాచి చల్లార్చి ఫ్రిజ్‌లో ఉంచిన పాలు పోసుకోవాలి. ఆపై అందులోకి పంచదార, రోజ్ సిరప్ వేసి బాగా కలపాలి.
- పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఉడికించిన సగ్గుబియ్యం వేసి కలిపి మరోసారి కలిపి సుమారు 2 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. రాత్రంతా ఉంచినా మంచిదే.
- రెండు గంటల తరువాత పాలల్లో జెల్లీ ముక్కలు, తరిగిన పిస్తా పప్పులు వేసి కలపాలి. అంతే ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం షర్బత్ రెడీ. ఈ షర్బత్‌ను ఒక గ్లాసులో పోసి, పైన జెల్లీ ముక్కలు, తరిగిన పిస్తాపప్పులు వేసి గార్నిష్ చేసుకుని తాగితే సరి.

చిట్కాలు:
- మీరు కావాలంటే సబ్జా గింజలను కూడా నానబెట్టి ఈ షర్బత్‌లో కలుపుకోవచ్చు. అవి కూడా శరీరాన్ని చల్లబరుస్తాయి.
- స్ట్రాబెర్రీ జెల్లీ క్రిస్టల్స్ బదులు ఇతర ఫ్లేవర్లు కలిగిన జెల్లీని కూడా వాడుకోవచ్చు.
- పంచదార బదులు పటిక బెల్లం కలుపుకుంటే మంచిది.
- అవసరమనుకుంటే ఓ రెండు చుక్కల నిమ్మరసం కలుపుకుని తాగితే రుచి అద్దిరిపోతుంది.

"మామిడికాయ పచ్చడితో కమ్మటి పప్పు" - వేడివేడి అన్నంలోకి అదుర్స్ - ఒక్కసారైనా టేస్ట్ చేయాల్సిందే!
Delicious "ద్రాక్ష లాలీపాప్స్" - నిమిషాల్లో రెడీ- ఒక్కసారి ఇంట్లో చేశారంటే పిల్లలు బయట కొనరు!