Summer Special Mango Coconut Pachadi: ప్రస్తుతం మార్కెట్లో పచ్చి మామిడికాయలు విరివిగా లభిస్తున్నాయి. ఇక మామిడికాయలు అనగానే అమ్మలు, అమ్మమ్మలకు రకరకాల వంటలు గుర్తుకువస్తాయి. రోటీ పచ్చడి, పులిహోర, చారు, పచ్చిపులుసు ఇలా ఒక్కటేమిటి ఎన్ని రకాలుగా వీలుంటే అన్నీ ప్రయత్నిస్తారు. అయితే ఎప్పుడూ అవే కాకుండా ఈసారికి మామిడికాయ కొబ్బరి పచ్చడి చేసుకోండి. రుచి సూపర్‌గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి, కొంచెం నెయ్యి వేసుకుని తింటే అమృతమే. పైగా అతి తక్కువ పదార్థాలతో, నిమిషాల్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ వంటకం ఎలా చేయాలో ఓ లుక్కేయండి.

కావాల్సిన పదార్థాలు:
- మామిడికాయ ముక్కలు - అర కప్పు
- పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు
- పచ్చిమిర్చి - 7
- జీలకర్ర - అర టీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 7
- ఉప్పు - రుచికి సరిపడా
- కొబ్బరి ముక్కలు - 200 గ్రాములు
- కొత్తిమీర - 1 కట్ట
తాలింపు కోసం:
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - అర టీ స్పూన్
- మినప్పప్పు - అర టీ స్పూన్
- పచ్చిశనగపప్పు - అర టీ స్పూన్
- ఎండుమిర్చి - 3
- జీలకర్ర - అర టీ స్పూన్
- ఇంగువ - చిటికెడు
- అల్లం తరుగు - 1 టీ స్పూన్
- కరివేపాకు - 2 రెమ్మలు
- పసుపు - అర టీ స్పూన్

తయారీ విధానం:
- మీడియం సైజ్‌లో ఉన్న పచ్చిమామిడికాయ తీసుకుని శుభ్రంగా కడగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని కొలత ప్రకారం ఓ గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచండి.
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పల్లీలు వేసి లో ఫ్లేమ్‌లో వేయించుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.
- మిక్సీజార్‌లోకి పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
- అందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు, కాడలతో సహా కొత్తిమీర, కొద్దిగా నీళ్లు పోసి మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చివరగా తరిగిన అర కప్పు మామిడి ముక్కలు వేసుకుని రుబ్బుకోవాలి.
- ఇప్పుడు ఈ పచ్చడికి పోపు సిద్ధం చేసుకోవాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి.
- ఆయిల్ హీటెక్కిన తర్వాత ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి.
- తాలింపు వేగిన తర్వాత జీలకర్ర, ఇంగువ, అల్లం తరుగు, కరివేపాకు వేసి మరికొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి.
- చివరగా పసుపు వేసుకుని కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ తాలింపు మిశ్రమాన్ని పచ్చడిలో కలుపుకుంటే సరి. ఎంతో రుచికరంగా ఉండే మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
టిప్స్:
- మామిడికాయ ముక్కలు పుల్లగా ఉండేలా చూసుకోవాలి. పచ్చడి మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత పులుపు సరిపోలేదనిపిస్తే ముక్కలను గ్రైండ్ చేసుకుని పచ్చడిలో కలుపుకుంటే సరి.
- ఈ పచ్చడిలో పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. అయితే ఎండుమిర్చి వేసుకుంటే పల్లీలలతో పాటు వేయించి తీసుకోవాలి.
- పచ్చడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే రెండు మూడు రోజుల వరకు తాజాగా ఉంటుంది.
వెడ్డింగ్ స్పెషల్ "మామిడికాయ తురుము పచ్చడి" - పదే పది నిమిషాల్లో రెడీ - రుచి అద్భుతం!
నోరూరించే పుల్లపుల్లని మామిడికాయ పకోడీలు - ఇలా చేస్తే చిటికెలో ప్లేట్లు ఖాళీ! - Mango Pakoda Recipe