Summer Special Coconut Ice Cream: ఎండాకాలం వచ్చిందంటే పిల్లలు ఇష్టంగా తినే ఆహారాల్లో ఐస్‌క్రీమ్ ముందు వరుసలో ఉంటుంది. స్వీట్‌గా, వెన్నలా కరిగిపోయే ఐస్‌ను పిల్లలు చాలా ఇష్టపడతారు. అయితే అడుగుతున్నారు కదా అని చాలా మంది పేరెంట్స్ పార్లర్స్, షాప్స్ నుంచి కొనుగోలు చేసి తెస్తుంటారు. అవి ఆరోగ్యానికి అంత హెల్దీ కావు. కాబట్టి పిల్లల కోసం కొంచెం కష్టమైనా సరే ఇంట్లో చేసుకోవడం చాలా మంచిది. అందుకోసమే అద్దిరిపోయే టేస్టీ అండ్ హెల్దీ కోకోనట్ ఐస్‌క్రీమ్ రెసిపీ తీసుకొచ్చాం. దీనిని చాలా సింపిల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కేవలం అరగంటలో రెడీ అయ్యే ఈ ఐస్ టేస్ట్ వేరె లెవల్ ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే పిల్లలు మళ్లీ మళ్లీ చేయమని అడుగుతుంటారు. సో, లేట్ చేయకుండా ఈ రెసిపీపై ఓ లుక్కేయండి.

కావాల్సిన పదార్థాలు:
- కొబ్బరి ముక్కలు - 1 కప్పు
- పాలు - 2 కప్పులు
- కార్న్‌ఫ్లోర్ - 1 టేబుల్ స్పూన్
- కండెన్స్డె మిల్క్ - 1/3 కప్పు(85ml)
- వెనీలా ఎసెన్స్ - 1 టీ స్పూన్
- సన్నగా తరిగిన డ్రైఫ్రూట్స్ - కొద్దిగా

తయారీ విధానం:
- ముందుగా చిక్కటి పాలను మరిగించి పూర్తిగా చల్లార్చుకోవాలి.
- కొబ్బరిని టెంక నుంచి సెపరేట్ చేసిన తర్వాత గోధుమ రంగులో ఉండే పొట్టు మొత్తాన్ని తీసేయాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 1 కప్పు కొలతగా తీసుకోవాలి.
- మిక్సీజార్‌లోకి కొబ్బరి ముక్కలు వేసి ఓసారి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకుని వీలైనంత మెత్తగా రుబ్బుకోవాలి.
- ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఓ బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచాలి.
- మరో పాన్‌లో పాలు పోసుకోవాలి. ఆపై అందులోకి కార్న్‌ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి.
- ఈ పాన్ ను స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్‌లో చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి. కార్న్‌ఫ్లోర్ మిశ్రమం థిక్‌గా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించాలి.
- ఆ తర్వాత అందులోకి కండెన్సెడ్ మిల్క్, వెనీలా ఎసెన్స్ వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి.
- పాల మిశ్రమం కంప్లీట్‌గా కూల్ అయిన తర్వాత మిక్సీజార్‌లోకి వేసుకుని స్మూత్‌గా బ్లెండ్ చేసుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని కొబ్బరి పాలలో కలుపుకోవాలి. ఆ తర్వాత లైట్‌గా తరిగిన డ్రైఫ్రూట్స్ వేసుకుని మిక్స్ చేసుకుని ఐస్‌క్రీమ్ మౌల్డ్స్‌లో పోసుకోవాలి.
- ఆ మౌల్డ్స్‌ను అల్యూమినియం ఫాయిల్‌తో క్లోజ్ చేసి ఐస్‌క్రీమ్ స్టిక్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత దానిని ఫ్రీజర్‌లో సుమారు 8 నుంచి 10 గంటలు ఉంచాలి.
- ఒకవేళ మీ దగ్గర మౌల్డ్స్ లేకపోతే గ్లాస్‌లలో పోసి ఫాయిల్ చుట్టేస్తే సరి.
- 10 గంటల తర్వాత ఫ్రీజర్ నుంచి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొబ్బరి ఐస్‌క్రీమ్ రెడీ. నచ్చితే మీరూ ఓసారి పిల్లల కోసం ట్రై చేయండి.
టిప్స్:
- కండెన్స్డ్ మిల్క్ బదులు పంచదార కూడా వాడవచ్చు. అయితే పంచదారను కార్న్‌ఫ్లోర్ మిశ్రమం ఉడుకుతున్నప్పుడు వేసుకుని కలిపి కుక్ చేసుకోవాలి.
- వెనీలా ఎసెన్స్ బదులు యాలకుల గింజల పొడి కూడా వాడుకోవచ్చు.
- కార్న్‌ఫ్లోర్ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే బ్లెండ్ చేసుకోవాలి.