Summer Special Choco Bar Ice Cream: పిల్లలకు సమ్మర్ సెలవులు వచ్చేశాయి. దాదాపు రెండు నెలల పాటు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. అయితే వేసవిలో పిల్లలు ఎక్కువగా తినే ఐటమ్ అంటే ఐస్‌క్రీమ్. మండే ఎండల్లో కూల్‌కూల్ ఐస్‌క్రీమ్ తింటుంటే ఆ ఫీలింగ్ వేరే లెవల్. అయితే ఇందులో కూడా ఎన్నో రకాల ఫ్లేవర్లు ఉన్నాయి. ముఖ్యంగా చాకోబార్ ఐస్ అంటే పిల్లలకు ఎక్కడలేని ఇష్టం. పైన చాక్లెట్ లోపల క్రిమీగా ఉండే దీనిని తినేందుకు ఎంతగానో ఆసక్తి చూపిస్తుంటారు. అయితే బయట లభించే చాకోబార్ ఐస్‌క్రీమ్‌లో ప్రిజర్వేటివ్స్ కలిపే అవకాశం ఉంటుంది. అలా కలిపిన వాటిని తింటే లేనిపోని ఆరోగ్య సమస్యలు. ఇకపై అలా జరగకూడదంటే ఇంట్లోనే చాకోబార్ ఐస్‌క్రీమ్ చేసుకోవచ్చు. అది కూడా ఫ్రెష్‌క్రీమ్ లేకుండానే. మరి లేట్ చేయకుండా ఈ ఐస్‌క్రీమ్‌ను ఎలా ప్రిపేర్ చేయాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.

కావాల్సిన పదార్థాలు:
- చిక్కటి పాలు - అర లీటర్
- కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్‌స్పూన్లు
- పంచదార - 3 టేబుల్‌స్పూన్లు
- పాలపొడి - 2 టేబుల్‌స్పూన్లు
- చాక్లెట్ - పావు కప్పు
- పాల మీగడ - 3 టేబుల్‌స్పూన్లు
- వెనీలా ఎసెన్స్ - పావు టీస్పూన్

తయారీ విధానం:
- ఓ గిన్నెలోకి పాలను తీసుకోవాలి. అందులో నుంచి పావు కప్పు పాలను తీసి పక్కన ఉంచాలి.
- మిగిలిన పాలు ఉన్న గిన్నెను స్టవ్ మీద పెట్టి మరిగించాలి.
- ఈ లోపు మరో గిన్నెలోకి కార్న్‌ఫ్లోర్, పక్కకు తీసిన పాలను పోసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టాలి.
- పాలు మరుగుతున్నప్పుడు పంచదార, పాలపొడి వేసి ఈ రెండు పాలలో కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి.
- పంచదార కరిగిన తర్వాత కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించాలి.
- మిశ్రమం కాస్త దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
- ఈలోపు స్టవ్ మీద ఓ బౌల్ పెట్టి అందులో నీళ్లు పోసి మరిగించాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు గిన్నె మీద స్టీల్ లేదా గాజు బౌల్ ఉంచి చాక్లెట్ ముక్కలు వేసి కరిగించాలి. చాక్లెట్ పూర్తిగా కరిగిన తర్వాత తీసి పక్కన ఉంచాలి.

- ఐస్‌క్రీమ్ ప్రిపరేషన్‌కు పేపర్ కప్స్ తీసుకోవాలి. ముందుగా పేపర్ కప్స్ లోపల భాగంలో కరిగించిన చాక్లెట్‌ను లేయర్‌గా అప్లై చేసుకోవాలి. ఇలా అన్ని కప్స్‌లో చాక్లెట్ సిరప్ పోయాలి.
- ఆ తర్వాత వీటిని ఓ 5 నిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల చాక్లెట్ గట్టిపడుతుంది.
- పూర్తిగా చల్లారిన పాల మిశ్రమాన్ని మిక్సీజార్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి పాల మీగడ, వెనీలా ఎసెన్స్ వేసి మూడు నిమిషాల పాటు మధ్యమధ్యలో ఆపుతూ బ్లెండ్ చేసుకోవాలి.
- ఇలా బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఓ బౌల్లోకి తీసుకోవాలి.

- ఫ్రిజ్‌లో ఉంచిన పేపర్ కప్స్‌ను బయటికి తీసి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పోసుకోవాలి. ఇలా గ్లాసులన్నింటిలో పోసిన తర్వాత వాటిని సిల్వర్ ఫాయిల్‌తో క్లోజ్ చేసి మధ్యలో చిన్నగా గాటు పెట్టి ఐస్‌క్రీమ్ పుల్లలు పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఈ పేపర్ కప్స్‌ను ఫ్రీజర్‌లో సుమారు 8 గంటలు లేదా రాత్రంతా ఉంచాలి. ఆ తర్వాత బయటికి తీసి డీమౌల్డ్ చేసుకుంటే పిల్లలు ఎంతగానో నచ్చే చాకో బార్ ఐస్‌క్రీమ్ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

టిప్స్:
- కార్న్‌ఫ్లోర్ బదులు మైదా పిండిని కూడా కలుపుకోవచ్చు. ఇలా కార్న్‌ఫ్లోర్ లేదా మైదా కలపడం వల్ల పాల మిశ్రమం థిక్‌గా వస్తుంది.
- ఈ ఐస్‌క్రీమ్ తయారీలో పాలపొడి అనేది కేవలం ఆప్షనల్. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు.
- పేపర్ కప్స్ బదులు స్టీల్ గ్లాసులు కూడా ఉపయోగించవచ్చు.
- ఒకవేళ కప్స్‌లో పోసిన తర్వాత పాల మిశ్రమం మిగిలిపోతే వాటిని కుల్ఫీ మౌల్డ్స్‌లో పోసుకుని కుల్ఫీలు తయారు చేసుకోవచ్చు.
పుల్లగా, తియ్యగా "సబ్జా క్యాండీ ఐస్‌క్రీమ్" - నిమిషాల్లో రెడీ - మండే ఎండల్లో చిల్ అవ్వొచ్చు!
మండే ఎండల్లో మజానిచ్చే "జామకాయ ఐస్‌క్రీమ్" - తక్కువ సమయంలోనే అద్దిరిపోయే రుచి!