రాయలసీమ స్పెషల్ "పచ్చిమిర్చి పప్పు" - చింతపండు లేకుండానే పుల్లగా, కారంగా భలే రుచి!
పచ్చిమిర్చి, టమాటా కాంబోలో అద్దిరిపోయే రెసిపీ - ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తింటారు!

Published : September 9, 2025 at 12:39 PM IST
Green Chilli Dal Curry in Rayalaseema Style : పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే వాటిల్లో పప్పు కర్రీ ఒకటి. దీన్ని ఒక్కొక్కరు ఒక్కోవిధంగా రెడీ చేసుకుంటుంటారు. నార్మల్‌గా చాలా మంది టమాటా, దోసకాయ, గోంగూర, పాలకూర వంటి వాటితో పప్పుని ఎక్కువగా చేస్తుంటారు. అయితే, పప్పు ఎప్పుడూ ఒకేలా తినాలంటే ఎవరికైనా బోరింగ్ ఫీల్ కలుగుతుంది. అందుకే, మీకోసం ఇప్పటివరకు ట్రై చేయని ఒక కొత్త రెసిపీని తీసుకొచ్చాం. అదే, రాయలసీమ స్టైల్ "పచ్చిమిర్చి పప్పు". ఈ రెసిపీ రెగ్యులర్‌గా చేసుకునే వాటికి కొంచెం భిన్నంగా ఉండి మంచి రుచికరంగా ఉంటుంది. చింతపండు లేకుండానే పుల్లగా, కారంగా నోరూరించే ఈ కర్రీ అన్నం, చపాతీ, రోటీల్లోకి అద్దిరిపోతుంది! ఇంటిల్లిపాదీ చాలా ఇష్టంగా తింటారు. మరి, పచ్చిమిర్చి, టమాటా కాంబినేషన్లో ఘుమఘుమలాడే ఈ పప్పు కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- కందిపప్పు - ఒక కప్పు
- పచ్చిమిర్చి - 20(రుచికి తగినన్ని)
- ఉల్లిపాయలు - నాలుగు(పెద్ద సైజ్‌వి)
- టమాటాలు - ఆరు
- ధనియాలు - రెండు టీస్పూన్లు
- జీలకర్ర - రెండు టీస్పూన్లు
- పసుపు - ఒక చెంచా
శాకాహారుల మాంసంతో కమ్మని "కర్రీ" - ఎన్నడూ తినని రుచిని ఎంజాయ్ చేస్తారు!
తయారీ విధానం :
- కమ్మగా నోరూరించే ఈ పప్పు కర్రీ తయారీకి ముందుగా ఒక గిన్నెలో కందిపప్పుని తీసుకొని శుభ్రంగా కడగాలి. తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోసి అరగంట పాటు నాననివ్వాలి.
- పప్పు నానేలోపు రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయలను ఒక్కోదాన్ని నాలుగు ముక్కలుగా చేసుకోవాలి. అలాగే, టమాటాలను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి.
- అదేవిధంగా, మీరు తినే కారాన్ని బట్టి తగినన్ని పచ్చిమిర్చిని తొడిమలు తీసి శుభ్రంగా కడిగి ముక్కలుగా తుంపి పెట్టుకోవాలి.

- ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకొని అందులో బాగా నానిన కందిపప్పు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి.
- ఆపై అందులో ఒక లీటర్ నీళ్లు పోసి ఒకసారి కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్‌లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
- పప్పు మిశ్రమం చక్కగా ఉడికిందనుకున్నాక కుక్కర్లోని ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి పప్పుగుత్తితో మెత్తగా మెదుపుకొని పక్కనుంచాలి. ఇప్పుడు అందులోకి తాలింపుని రెడీ చేసుకోవాలి.

తాలింపు కోసం :
- నూనె - నాలుగు టేబుల్‌స్పూన్లు
- శనగపప్పు - రెండు టేబుల్‌స్పూన్లు
- మినపప్పు - రెండు టీస్పూన్లు
- జీలకర్ర - రెండు టీస్పూన్లు
- ఆవాలు - రెండు టీస్పూన్లు
- ఎండుమిర్చి - నాలుగు
- ఇంగువ - అరటీస్పూన్
- చిన్న ఉల్లిపాయలు - రెండు
- కరివేపాకు - రెండు రెబ్బలు
- కొత్తిమీర తరుగు - పిడికెడు

- పోపు కోసం స్టవ్ మీద కడాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి తుంపలు వేసి వేయించాలి.
- అవి వేగిన తర్వాత ఇంగువ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత సన్నని ఉల్లిపాయ చీలికలు వేసి కాసేపు మగ్గించాలి.
- ఆనియన్స్ మగ్గిన తర్వాత కరివేపాకు వేసి వేయించాలి. ఇక చివర్లో కాడలతో సహా కొత్తిమీర తరుగు జత చేసి అర నిమిషం పాటు కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- అనంతరం చక్కగా వేగిన ఆ తాలింపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పులో వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుంటే చాలు. అంతే, రాయలసీమ స్టైల్లో స్పైసీ స్పైసీగా, కమ్మగా ఘుమఘుమలాడే "పచ్చిమిర్చి పప్పు" రెడీ అవుతుంది!
పెళ్లిళ్లలో చేసే కమ్మని "టమాటా పప్పు" ఇంట్లోనే! - ఘుమఘుమలాడిపోద్ది!
ఎన్నడూ చేయని నయా స్టైల్ "వంకాయ కూర" - పల్లీ పొడితో ఇలా చేశారంటే టేస్ట్ అద్భుతం!

