PAMBAN BRIDGE : భారతీయ రైల్వే చారిత్రక, కీలక ప్రాజెక్టులను పూర్తి చేస్తోంది. ఇప్పటికే అమృత్ భారత్ పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్ల్ ఆధునీకరణ చేపట్టడం తెలిసిందే. తాజాగా ఐఫిల్ టవర్ కంటే ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన, అదే దారిలోని దాదాపు 97 కి.మీ. సొరంగాల నిర్మాణం పూర్తి చేయగా, నేడు పాంబన్ రైల్వే బ్రిడ్జి సైతం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. పాంబన్ కొత్త రైలు వంతెనలో అత్యంత ప్రధానమైంది వర్టికల్ లిఫ్ట్. ఇది అనేక సాంకేతికతల సమాహారం. బ్రిడ్జి లోని కొంత భాగం నిలువునా పైకి లేచేలా లిఫ్టు ఏర్పాటు చేసిన దేశపు తొలి వర్టికల్ బ్రిడ్జి.

పాంబన్ వర్టికల్ లిఫ్టు స్పాన్ నిర్మాణానికి విజయనగరం జిల్లాకు చెందిన ఇంజినీర్ వెంకట చక్రధర్ పర్యవేక్షకుడిగా పనిచేశారు. నిర్మాణంలో ఎక్కడా తేడా రాకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.
దేశంలోనే అతి చిన్న రైలు ఏమిటో తెలుసా? - కేవలం మూడు బోగీలతో ప్రయాణం!
పాంబన్ వర్టికల్ సీ లిఫ్ట్ బ్రిడ్జ్ ప్రత్యేకతలు ఇవే :
- వంతెన రెండు వైపులా నిలువు స్తంభాలుంటాయి. వాటికి ఇరు పక్కల 310, 320 టన్నుల బరువున్న దూలాలు వేలాడుతుంటాయి.
- రెండు దూలాల బరువు 625 టన్నులు.
- కేవలం 35 టన్నుల బరువు ఎత్తడానికి మాత్రమే విద్యుత్ అవసరం. మిగతా భారాన్ని కౌంటర్ వెయిట్లు నియంత్రిస్తాయి.
- ఇదంతా ఓ గదిలో ఏర్పాటు చేసిన రిమోట్ కంట్రోల్ ద్వారా సింగిల్ క్లిక్‌తో నడుస్తుంది.
- వంతెన మొత్తాన్ని స్కాడా సెన్సర్లతో అనుసంధానించారు. గంటకు 58 కిలోమీటర్ల వేగానికి మించి గాలులు వీస్తే స్కాడా దానంతట అదే ఈ మార్గాన్ని ఆపేస్తుంది.
- గాలి వేగాన్ని కొలిచేందుకు దిమ్మెలు, టవర్లపై యంత్రాలు ఏర్పాటు చేశారు. పడవలు, నౌకలు ఓడలు వంతెనను దాటాల్సి వచ్చినప్పుడు సిబ్బంది దిమ్మెలపైన ఉన్న గదుల్లోకి వెళ్లి రిమోట్ ద్వారా వంతెనను లిఫ్ట్ చేస్తారు.
- ఇందులో వర్టికల్ బ్రిడ్జి సాంకేతికతను స్పెయిన్ నుంచి తీసుకోగా మిగిలినవన్నీ దేశీయంగా తయారైనవే.
- 73 మీటర్ల పొడవుండే వంతెన భాగాన్ని ఆటోమేటిక్ ఎలక్ట్రో మెకానిజం నావిగేషన్ విభాగం 17 మీటర్ల పైకి ఎత్తుతుంది.
- 660 టన్నులు, 72.5 మీటర్ల పొడవున్న ఈ లిఫ్టును తీరం నుంచి అక్కడికి తరలించడానికి 5 నెలలు పట్టింది.
- సముద్రంలో వంతెన వంపుగా ఉండటంతో లాంచింగ్ గర్డర్లు, బేరింగుల సాయంతో పట్టాలపైకి ఎక్కించారు.
- రోజూ కొంతదూరం కదిలించి అతి కష్టం మీద ఏర్పాటు చేశారు.
పాంబన్ బ్రిడ్జి నిర్మాణంలో రోజూ వందలాది మంది కార్మికులు పనిచేశారు. పాత రైల్వే వంతెనపై రైలు గంటకు10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేది. అయితే కొత్త వంతెనపై గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వంతెన లిఫ్టు దాటేలా నిర్మించాం. పాత వంతెనపై సింగిల్ ట్రాక్ ఉండగా కొత్త వంతెనపై భవిష్యత్తులో డబుల్ ట్రాక్ నూ నిర్మించేలా ఏర్పాట్లు చేశాం. పాత వంతెనపై బ్రిడ్జిలోని భాగాన్ని ఏటవాలుగా పైకి ఎత్తి దించేందుకు గంటన్నర సమయం పట్టేది. దేశంలో ఏ బ్రిడ్జికీ లేని విధంగా అధునాతన వర్టికల్ లిఫ్ట్ ఏర్పాటు వల్ల స్విచ్ నొక్కితే చాలు కొత్త బ్రిడ్జి భాగాన్ని అది కేవలం 5 నిమిషాల్లో పైకి తీసుకెళ్లి మరో 5 నిమిషాల్లో తిరిగి యథాస్థానానికి తీసుకువస్తుంది. గతంలో లిఫ్ట్ ఎత్తేందుకు 16 మంది శ్రామికులు పనిచేశారు. కొత్త బ్రిడ్జి లిఫ్టు ఎత్తడానికి ఒక్కరు చాలు. - వెంకట చక్రధర్, ఇంజినీర్, వంతెన ఇన్ చార్జి
కొత్తగా నిర్మించిన పంబన్ బ్రిడ్జిపై ఇటీవల హైస్పీడ్ ట్రయల్ రన్ నిర్వహించారు. 2.10 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన పై నుంచి రైలు విజయవంతంగా దూసుకెళ్తూ రాకపోకలు సాగించింది. వంతెన నిర్మాణం విజయవంతంగా పూర్తి కావడం భారతీయ రైల్వేల సాంకేతిక ప్రతిభకు నిదర్శనంగా నిలిచేదే.
మీ 'పప్పీ'ని వదల్లేకున్నారా? - మీతో పాటే ట్రైన్లో తీసుకెళ్లొచ్చు!
'మనకూ ఓ బుల్లెట్ రైలు కావాల్సిందే' - ఎంపీలతో చంద్రబాబు కీలక భేటీ