Jowar Idli : "ఇడ్లీ అంటే తెల్లగా తళతళా మెరిసిపోతూ ఉండాలి. ఇంకా.. నోట్లో వేసుకోగానే నమిలే కష్టం కూడా లేకుండా గుటుక్కున గొంతులోకి జారిపోవాలి." ఇలా ఉంటేనే ఇడ్లీని ఎంజాయ్ చేస్తారు చాలా మంది! కానీ, దానివల్ల ఆరోగ్యానికి చాలా నష్టమని ఆరోగ్య నిపుణులు ఎప్పట్నుంచో చెబుతున్నారు. అలాంటి ఇడ్లీలు వేగంగా అరిగిపోయి, గ్లూకోస్ త్వరగా రక్తంలో కలిసి పోతుందని, దాంతో షుగర్ లెవల్స్ ఫాస్ట్‌గా పెరిగిపోతాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే డయాబెటిస్ తో బాధపడుతున్నవారిని ఈ ఇడ్లీలు మరింత ఇబ్బంది పెడతాయి. అందుకే మిల్లెట్ ఇడ్లీలు తెరపైకి వచ్చాయి.
అయితే తెల్ల ఇడ్లీలతో పోలిస్తే మిల్లెట్ ఇడ్లీలు కాస్త గట్టిగా ఉంటాయని, తినడానికి కాస్త ఇబ్బందిగా ఉంటోందనే భావనంతో చాలా మంది పాత పద్ధతిలో తయారయ్యే రైస్ ఇడ్లీలనే తింటున్నారు. ఫలితంగా షుగర్ లెవల్స్ పెరిగి ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికోసమే
"జొన్న ఇడ్లీ" రెసిపీని తీసుకొచ్చాం. కొన్ని టిప్స్ పాటిస్తే జొన్న ఇడ్లీ కూడా వైట్ ఇడ్లీ మాదిరిగానే స్మూత్‌గా, గుల్లగా వస్తుంది. ఇంకా రుచి కూడా అమోఘంగా ఉంటుంది. మరి, ఈ రెసిపినీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- తెల్లని మినపగుళ్లు 1 గ్లాసు
- పొట్టు మినపప్పు 2 స్పూన్లు
- జొన్న రవ్వ రెండున్న నుంచి 3 గ్లాసులు
- మెంతులు 1 స్పూన్
- ఉప్పు తగినంత
రాత్రి అన్నం పడేయొద్దు, ఇలా శృతిలో కలిపేయండి! - చద్దన్నం వద్దన్నవారే లాగిస్తారు!
తయారీ విధానం :

- మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో తెల్లని మినపగుళ్లు, పొట్టు మినపప్పు, మెంతులు కూడా వేసి రెండు సార్లు కడిగిన తర్వాత నానబెట్టాలి.
- సుమారు 4 గంటలపైన నాననివ్వాలి.
- మరో గిన్నెలో జొన్న రవ్వ పోసుకోవాలి. ఈ రవ్వ మార్కెట్లో, ఆన్లైన్లో దొరుకుతుంది. ఉప్మా కోసం వాడేది కాకుండా ఇడ్లీకోసం వాడేది తీసుకోవాలి.
- గ్రైండర్లో మిక్స్ చేసుకునేవారు 3 గ్లాసుల రవ్వ తీసుకోవడం మంచిది. మిక్సీ పట్టేవారైతే రెండున్నర గ్లాసులు సరిపోతుంది.
- ఈ రవ్వలో ఉప్పు వేసి, నీళ్లు పోసి చేత్తో గట్టిగా రుద్దుతూ వాష్ చేసి, 4 గంటలపాటు నానబెట్టాలి.
- నాలుగు గంటల తర్వాత రవ్వను రెండు మూడు సార్లు కడగాలి. ఆ తర్వాత చేతితో నీళ్లను పిండేస్తూ రవ్వను వేరే గిన్నెలో వేసుకోవాలి.
- ఇప్పుడు నానబెట్టిన మినప గుళ్లను కూడా మిక్సీ పట్టుకోవాలి. తగినన్ని నీళ్లు తీసుకొని ఇడ్లీ తయారీ కోసం అవసరమైనంత కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకోవాలి.
- ఈ మినపగుళ్ల పిండిని రవ్వతో కలిపేయాలి. చక్కగా కలుపుకొని రాత్రంతా పులియబెట్టాలి.
- మర్నాడు పొద్దున ఇడ్లీలు వేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చినట్టుగా ఇడ్లీలు వస్తాయి.
- అంటుకోవడం గానీ, లేదా గట్టిగా తయారవడం గానీ ఉండదు. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.

టిప్స్ :
- మినప గుండ్లలో పొట్టు పప్పు కూడా యాడ్ చేస్తే ఇడ్లీలకుు మంచి రుచి వస్తుంది. ఇంకా ఫైబర్ యాడ్ అవుతుంది. ఇడ్లీలు కూడా గుళ్లుగా వస్తాయి.
- పిండిని పులియబెట్టేటప్పుడు ఎండా కాలంలో అయితే చల్లని ప్రదేశంలో ఉంచాలి. చలి, వర్షా కాలంలో అయితే పిండి గిన్నెమీద కాటన్ క్లాత్ కప్పేసి ఉంచితే సరిపోతుంది.
మృగశిర స్పెషల్ - కమ్మని "చేపల పులుసు" - ఈ మసాలా పేస్ట్ వేసి చేస్తే అమోఘమైన రుచి!