జొన్న పిండితో మెత్తని "ఇడ్లీలు" - అప్పటికప్పుడు చేసుకోవచ్చు! - చట్నీ ఏదైనా సూపర్ టేస్ట్!
- రుచికి రుచీ ఆరోగ్యానికి ఆరోగ్యం - ఇంట్లో వాళ్లంతా ఇష్టంగా లాగిస్తారు!

Published : June 26, 2025 at 8:37 AM IST
Soft Jowar Flour Idli: ఆరోగ్యానికి మేలు చేసే జొన్నలను ప్రస్తుతం చాలా మంది తమ డైట్లో చేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఇందులోని పోషకాలు షుగర్, బరువును తగ్గించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, మలబద్ధకాన్ని తగ్గించడం సహా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే జొన్నలతో చేసే వంటలు అంటే చాలా మందికి రొట్టెలు మాత్రమే గుర్తుకువస్తాయి. ఇంకొందరు దోశలు, ఇడ్లీలు వంటివి ప్రిపేర్ చేస్తుంటారు. అయితే ఇడ్లీలు చేయాలంటే జొన్న రవ్వ కావాలని చాలా మంది అనుకుంటారు. కానీ జొన్న పిండితో కూడా సూపర్ సాఫ్ట్‌గా ఉండే ఇడ్లీలు చేసుకోవచ్చు. పైగా పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా జొన్న పిండితో ఇడ్లీలు ఎలా చేయాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- జొన్న పిండి - 1 కప్పు
- బొంబాయి రవ్వ - అర కప్పు
- పెరుగు - 1 కప్పు
- ఉప్పు - సరిపడా
- బేకింగ్ సోడా - పావు టీస్పూన్

తయారీ విధానం:
- ఓ బౌల్లోకి జొన్న పిండి, బొంబాయి రవ్వ, పెరుగు, అర కప్పు వాటర్ పోసి మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మరో పావు కప్పు వాటర్ పోసి బాగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు నాననివ్వాలి.
- 10 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి కలపాలి. అనంతరం రుచికి సరిపడా ఉప్పు, బేకింగ్ సోడా, 3 టేబుల్స్పూన్ల నీళ్లు పోసి పిండిని ఇడ్లీలు వేసుకునేందుకు సరిపడేలా మిక్స్ చేసుకోవాలి.

- స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టి రెండు కప్పుల నీరు పోసి మూత పెట్టి వాటర్ మరిగించుకోవాలి.
- ఈలోపు ఇడ్లీ ప్లేట్స్‌కు నూనె లేదా నెయ్యి అప్లై చేసి ప్రిపేర్ చేసుకున్న జొన్న పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి.
- ఇలా అన్ని ప్లేట్స్‌కు వేసుకుని పక్కన పెట్టాలి. ఇడ్లీ పాత్రలోని నీరు మరుగుతున్నప్పుడు మూత తీసి పిండి వేసుకున్న ఇడ్లీ ప్లేట్స్ పెట్టి మూత ఉంచి హై ఫ్లేమ్‌లో 10 నుంచి 12 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి.

- ఇడ్లీలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఓ 5 నిమిషాలు అలానే వదిలేయాలి. ఆ తర్వాత వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుని నచ్చిన చట్నీతో తింటే సూపర్ టేస్టీగా ఉండే జొన్న పిండి ఇడ్లీ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- పచ్చ జొన్న పిండి అయితే ఇడ్లీలు మెత్తగా రావడంతో పాటు రుచిగా ఉంటాయి.
- బేకింగ్ సోడాను ఇడ్లీలు వేసుకునేముందు మాత్రమే కలుపుకోవాలి.
- అలాగే నీటిని ఎక్కువ తక్కువ కాకుండా ఇడ్లీలు వేసుకునేందుకు సరిపడేలా పోసుకోవాలి.

చింతపండు లేకుండా "మసాలా ఫిష్ కర్రీ" - నీచు వాసనకు తావు లేదు! - హోటల్ టేస్ట్ పక్కా!
అద్దిరిపోయే "పచ్చి టమాటా చట్నీ" - ఒక్కసారి తింటే ఫ్యాన్ అయిపోతారు - అన్నం, టిఫెన్స్లోకి పర్ఫెక్ట్!

