Snack Recipe for Kids : పిల్లలకు స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి. ఈ క్రమంలోనే బడి నుంచి వచ్చాక సాయంత్రం టైమ్‌లో తినడానికి స్నాక్స్ అడుగుతుంటారు. అప్పుడు చాలా మంది అమ్మలు స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైమ్ పడుతుందని బయట దుకాణంలో ఏదో ఒకటి కొనిస్తుంటారు. అలాకాకుండా మీరే ఇంట్లో క్విక్ అండ్ ఈజీగా చేసి పెట్టే ఒక సూపర్ స్నాక్ రెసిపీని తీసుకొచ్చాం. అదే, టేస్టీ అండ్ క్రిస్పీ "సొరకాయ బజ్జీలు". వీటినే 'సొరకాయ పకోడీలు' అని కూడా పిలుస్తుంటారు.
ఈ రెసిపీ కోసం ముందుగానే పిండిని సిద్ధం చేసుకొని ఫ్రిడ్జ్‌లో ఉంచారంటే కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో కమ్మగా, కరకరలాడే బజ్జీలను చేసి ఇవ్వొచ్చు. ఇలా చేసి ఇచ్చారంటే ఆరోగ్యానికి మేలు చేసే సొరకాయ అంటే నచ్చని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి రుచిలో మిర్చీ బజ్జీలకు ఏమాత్రం తీసిపోవు! అలాగే, రెగ్యులర్ స్నాక్స్ తిని బోర్ కొట్టినవారికి సరికొత్త టేస్ట్‌ని అందిస్తాయి. మరి, లేట్ చేయకుండా సొరకాయతో కరకరలాడే బజ్జీలను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :
- లేత సొరకాయ - ఒకటి
- ముప్పావు కప్పు - శనగపిండి
- రుచికి తగినంత - ఉప్పు
- బియ్యప్పిండి - పావుకప్పు కంటే కొద్దిగా ఎక్కువ
- సన్నని కొత్తిమీర తరుగు - కొద్దిగా
- కారం - అరటీస్పూన్(రుచికి తగినంత)
- పసుపు - పావుచెంచా
- అరటీస్పూన్ - ధనియాల పొడి
- ఒకటీస్పూన్ - అల్లంవెల్లుల్లి పేస్ట్
- కొద్దిగా - సన్నని కరివేపాకు తరుగు
- అరటీస్పూన్ - వాము
- వేయించడానికి సరిపడా - ఆయిల్
జొన్నపిండితో రొట్టెలు కాదు - ఇలా కరకరలాడే "చెక్కలు" చేసుకోండి! - నూనె తక్కువ, రుచి ఎక్కువ!

సొరకాయ బజ్జీ తయారీ విధానం :
- ఈ స్నాక్ రెసిపీ కోసం ముందుగా లేత సొరకాయను తీసుకొని శుభ్రంగా కడిగి రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి. అయితే, ఇక్కడ ఒకభాగం మాత్రమే తీసుకుంటున్నాం.
- అదే, మీరు ఎక్కువ క్వాంటిటీలో బజ్జీలు కావాలనుకుంటే మొత్తం సొరకాయను వాడుకోవచ్చు. అలాగే, మిగతా ఇంగ్రీడియంట్స్ని కాస్త పెంచి తీసుకోవాలి.
- ఇప్పుడు తీసుకున్న సగభాగం సొరకాయను చాకు లేదా పీలర్ సహాయంతో పైన పొట్టును తొలగించుకోవాలి. ఆ తర్వాత దాన్ని మరీ ఆలూ చిప్స్ అంత సన్నగా కాకుండా కాస్త మందంగానే ఉండేలా రౌండ్‌గా చిన్న చిన్న స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి.

- తర్వాత కట్ చేసుకున్న ముక్కలన్నింటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆపై అందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఒకటీస్పూన్ ఉప్పు వేసి పక్కనుంచాలి. ఇలా చేయడం ద్వారా మిగతా ప్రాసెస్ కంప్లీట్ అయ్యే లోపు సొరకాయ ముక్కలు రంగు మారకుండా ఉంటాయి.
- అనంతరం పిండిని సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, బియ్యప్పిండి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నని కొత్తిమీర తరుగు, రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్, సన్నని కరివేపాకు తరుగు, వాము ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఆపై అవసరానికి సరిపడా నీటిని కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా కొంచం జారుడుగా ఉండేలా పిండిని కలుపుకోవాలి. అంటే, పిండి కన్సిస్టెన్సీ అనేది సొరకాయ ముక్కలను అందులో డిప్ చేస్తే చక్కగా కోట్ అయ్యేలా ఉండాలి.

- అనంతరం స్టవ్ మీద పాన్ పెట్టుకొని వేయించడానికి తగినంత నూనె పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉప్పు నీళ్లలో వేసి ఉంచిన సొరకాయ ముక్కలను తీసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమంలో డిప్ చేసి రెండు వైపులా పిండిని కోట్ చేసుకొని కాగుతున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి.
- పాన్‌లో ఫ్రీగా ఫ్రై చేసుకునేటట్లుగా సరిపడా సొరకాయ ముక్కలను వేసుకున్న తర్వాత వెంటనే టర్న్ చేయకుండా ఒక నిమిషం పాటు అలాగే ఉంచి ఆపై చిల్లుల గరిటెతో రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
- అలా వేయించుకున్న వాటిని టిష్యూ పేపర్ పరచిన ప్లేట్లోకి తీసుకొని కాసేపు అలాగే ఉంచి ఆపై వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే "సొరకాయ బజ్జీలు" మీ ముందు ఉంటాయి!

టిప్స్ :
- ఇక్కడ సొరకాయను ముదిరినది కాకుండా లేతగా ఉండే దాన్ని తీసుకోవాలి. అప్పుడే బజ్జీలు మంచి రుచికరంగా వస్తాయి.
- ఈ రెసిపీలో బియ్యప్పిండిని యాడ్ చేసుకోవడం ద్వారా బజ్జీలపై లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది.
- ఆయిల్ వేడయిన తర్వాత మాత్రమే బజ్జీలను వేసి వేయించుకోవాలి. లేదంటే అవి నూనెను ఎక్కువగా పీల్చేస్తాయి.
- అలాగే, వాటిని వేయించుకునేటప్పుడు స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. అప్పుడు అవి లోపలి వరకు చక్కగా కాలి క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి.
ఇడ్లీలు మిగిలిపోతే ఇలా "స్నాక్స్" చేసి పెట్టండి - పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు!