HIV injection : ఎన్నో ఏళ్లుగా మానవాళిని ఆందోళనకు గురిచేస్తున్న హెచ్‌ఐవీ ఇక తలవంచాల్సిన సమయం వచ్చేసిందా? ఎయిడ్స్‌ను సమూలంగా అంతమొందించే ఔషధాలు, టీకాలు, సూది మందులు అందుబాటులోకి రానున్నాయా? అంటే అవుననే తెలుస్తోంది. రెండేళ్ల కిందట ఇజ్రాయెల్‌కు చెందిన టెల్ అవీవ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సరికొత్త ఔషధాన్ని రూపొందించగా, తాజాగా గిలీడ్ సైన్సెస్ మరో ఇంజెక్షన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఇంజెక్షన్ ఏడాదిలో రెండుసార్లు వేసుకోవడం ద్వారా వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట పడనుంది.
బట్టతలకు మందేస్తే "బోడిగుండు" - మీరూ వాళ్లని "ఫాలో" అవుతున్నారా?

నివారణ తప్ప నిర్మూలన లేని ఎయిడ్స్ మహమ్మారికి ఎట్టకేలకు కళ్లెం వేసే పరిస్థితి వచ్చేసింది. హెచ్‌ఐవీ (HIV)ని అదుపు చేసే సూదిమందు సరికొత్తగా అందుబాటులోకి రాగా, దీనిని సంవత్సరంలో రెండుసార్లు తీసుకుంటే సరిపోతుందని పరిశోధకులు చెప్తున్నారు. హెచ్ఐవీ బాధితులు ఇప్పటి వరకు రోజూ ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తోంది. హెచ్ఐవీ ఇంజెక్షన్ ఎవరు అభివృద్ధి చేశారు. దాని ధర, మన దేశంలో ఎపుడు అందుబాటులోకి వస్తుందో తదితర వివరాలివి.
గిలీడ్ సైన్సెస్ ఆవిష్కరణ
"గిలీడ్ సైన్సెస్" హెచ్‌ఐవీ వ్యాధిని అదుపు చేసే ఇంజెక్షన్ ఆవిష్కరించింది. ఈ ఇంజెక్షన్ ఏడాదికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా వ్యాధి విస్తృతిని అడ్డుకోవచ్చు. అంటే హైచ్ఐవీ బాధితులు రోజూ మందులు వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఏడాదికి రెండు సార్లు ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారా వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ట్యాబ్లెట్లకు బదులుగా సూది మందు కనుగొనడం ఆసక్తికర పరిణామమని, వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి వీలుకలుగుతుందని ఔషధ రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఏటా 13 లక్షల హెచ్‌ఐవీ కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఇలాంటి పరిణామం గొప్ప విషయమని పేర్కొంటున్నారు. మల్టీనేషనల్ సంస్థ గిలీడ్ సైన్సెస్ ఆవిష్కరించిన "లెనకాపవిర్" అనే ఈ సూదిమందును "యెజ్టుగో" అనే బ్రాండుపై విక్రయించనున్నారు. తద్వారా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఈ ఇంజెక్షన్ నిరోధిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పెద్దలతో పాటు హెచ్ఐవీ బాధిత పిల్లలపై నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం రుజువైందని గిలీడ్ సైన్సెస్ స్పష్టం చేసింది. వ్యాధి బాధితులు అధికంగా ఉన్నటువంటి ఆఫ్రికా దేశాల్లో ఔషధ పరీక్షలు నిర్వహించగా 99.9% సమర్థత కనిపించినట్లు వెల్లడించింది.
తక్కువ ధరకు లభించేలా
తక్కువ తలసరి ఆదాయం కలిగిన 120 దేశాల్లో లెనకాపవిర్ జనరిక్ ఇంజెక్షన్‌ను ఉత్పత్తి, విక్రయాలకు గిలీడ్ సైన్సెస్ గతేడాదిలో 6 ఫార్మా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీలు ఇంజెక్షన్ అందుబాటులోకి తీసుకురావడానికి సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగా 20 లక్షల డోసుల ఇంజెక్షన్ పంపిణీకి గిలీడ్ సైన్సెస్ సిద్ధమైంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి(UNO)కి చెందిన గ్లోబల్ ఫండ్, యూఎస్ ప్రభుత్వానికి చెందిన పెప్‌ఫార్ కార్యక్రమంతో ఒప్పందాలు కుదుర్చుకుంది.
ఖరీదు ఎక్కువ, అదే అవరోధం!
హెచ్ఐవీ అదుపు చేసే లెనకాపవిర్ జనరిక్ ఇంజెక్షన్ కావాలంటే మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఎంతో అభివృద్ధి చెందిన అమెరికాలో ఒక ఏడాదిలో రెండుసార్లు ఈ ఇంజెక్షన్ చేయించుకునేందుకు 28,218 డాలర్లు వెచ్చించాల్సిందే. అంటే మన కరెన్సీలో సుమారు రూ.24.40 లక్షలు. ఈ ఖర్చును అభివృద్ధి చెందిన, ఇపుడిపుడే అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లోని ప్రజలు భరించలేరనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, ఈ ఇంజెక్షన్ మనదేశంలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ధర విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇంజెక్షన్ ధర తగ్గించేందుకు తమ వంతుగా ప్రయత్నిస్తున్నామని ఆవిష్కర్త 'గిలీడ్ సైన్సెస్' ప్రకటించింది.
ఆందోళన, ఒత్తిడితో సతమతమవుతున్నారా? - మీ అలవాట్లే ఇందుకు కారణమట!
"కళ్లు తిరగడం, కడుపునొప్పి"గా ఉంటోందా? - మీరూ ఈ తప్పు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి!