Summer Special Saunf Sharbat in Telugu : ఎండల్లో చల్లని పానీయాలు ఎంతో హాయినిస్తాయి. ఈ క్రమంలో మెజార్టీ పీపుల్ వేసవి తాపం నుంచి రిలీఫ్ పొందేందుకు, డీహైడ్రేషన్ బారిన పడకుండా మజ్జిగ, నిమ్మరసం, చెరుకు రసం వంటివి తాగుతుంటారు. అలాగే, మరికొందరు షర్బత్‌లు ప్రిపేర్ చేసుకొని సేవిస్తుంటారు. అయితే, మనందరికీ షర్బత్ పేరు వినగానే చిన్నప్పుడు అమ్మమ్మలు చేసి పెట్టే నిమ్మకాయ షర్బత్ ముందుగా గుర్తొస్తుంది.
అలాకాకుండా ఓసారి ఇలా "సోంపు షర్బత్" చేసుకొని తాగి చూడండి. ఇది చాలా రుచికరంగా ఉండడమే కాకుండా పొట్టకు హాయినిస్తుంది. వేసవిలో ఒంట్లో వేడిని తగ్గించడంలో ఈ డ్రింక్ చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు, ఈ షర్బత్ కోసం "సోంపు స్క్వాష్‌ని" ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే రెండు నెలల పాటు తాజాగా ఉంటుంది! మీకు తాగాలనిపించినప్పుడు క్షణాల్లో డ్రింక్ ప్రిపేర్ చేసుకొని కూల్‌కూల్‌గా తాగేయొచ్చు. మరి, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఈ టిప్స్ తెలుసుకోవాలి :
- ఇందుకోసం నార్మల్ సోంపునే తీసుకోవాలి. మార్కెట్లో వేయించినవి దొరుకుతుంటాయి. కానీ, వాటిని తీసుకోవద్దు.
- ఈ రెసిపీ కోసం పటిక బెల్లం చిప్స్ వాడొద్దని గుర్తుంచుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో పటిక బెల్లాన్ని మిష్రి అని కూడా అంటుంటారు.
- పటిక బెల్లాన్ని మరిగించుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
- నిమ్మ ఉప్పునే 'సిట్రిక్ యాసిడ్' అని కూడా అంటారు. అది మార్కెట్లో లభిస్తుంది. ఇది వేయకపోతే పాకం గడ్డ కడుతుంది.
- తీగ పాకం పర్ఫెక్ట్గా వచ్చిందని తెలుసుకోవడానికి చిన్న టిప్ ఉంది. అదేంటంటే చక్కగా మరిగిందనుకున్నాక గరిటెను మిశ్రమంలో కలిపి తీసి వెనుక వైపు వేలుతో నిలువుగా గీసినప్పుడు గీత అంటకపోతే పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం చేసుకోవాలి. ముదురు తీగ పాకం ఇందుకు సెట్ అవ్వదని గుర్తుంచుకోవాలి.

కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :
- సోంపు - 1 కప్పు
- పటిక బెల్లం ముక్కలు - అరకిలో
- యాలకుల గింజల పొడి - అరటీస్పూన్
- నిమ్మ ఉప్పు - చిటికెడు
- నానబెట్టిన సబ్జా గింజలు - తగినన్ని
మండే ఎండల్లో చల్లచల్లగా "పుచ్చకాయ షర్బత్" - ఒక్క గ్లాసు తాగారంటే ఫుల్లుగా కూల్ అయిపోతారు!

తయారు చేసుకోండిలా :
- ముందుగా ఒక చిన్న గిన్నెలో సోంపుని తీసుకొని బాగా కడగాలి. తర్వాత అందులో 750ఎంఎల్ వరకు వాటర్ పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు నానబెట్టుకున్న సోంపు వాటర్‌ని మరో బౌల్లోకి వడకట్టుకోవాలి.
- ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వడకట్టిన సోంపుని వేసుకోవాలి. ఆపై సోంపు నానబెట్టుకున్న నీటిని వేసుకొని మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి.
- అనంతరం ఒక గిన్నెపై జాలీగంటెలో శుభ్రమైన పల్చని క్లాత్ ఉంచి దానిలో మిక్సీ పట్టుకున్న సోంపు పేస్ట్‌ని వేసి బాగా పిండితే అందులోని సారమంతా దిగిపోతుంది.
- సోంపు పేస్ట్‌లోని సారాన్నంతా బాగా పిండుకున్నాక ఆ పిప్పిని పడేయాలి.
- ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టుకొని వడకట్టిన సోంపు సారాన్ని పోసుకోవాలి. ఆపై అందులో పటిక బెల్లం ముక్కలు వేసుకొని కలుపుతూ లేత తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి.

- ఇలా మరిగించుకునేటప్పుడు మిశ్రమం పైన మురికిలా ఒక తేట వస్తుంది. దాన్ని గరిటెతో తీసేస్తుండాలి. అప్పుడే పాకం చక్కగా వస్తుంది.
- అది మరిగి కాస్త చిక్కగా మారిందనుకున్నాక యాలకుల గింజల పొడి వేసుకొని కలిపి మరికాసేపు మరిగించుకోవాలి.
- మిశ్రమం మరిగి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రావడానికి 20 నిమిషాల సమయం పట్టొచ్చు.
- సోంపు మిశ్రమం చక్కగా మరిగి లేత తీగ పాకం వచ్చిందనుకున్నాక చివర్లో నిమ్మ ఉప్పు వేసుకొని కలిపి దింపేసుకోవాలి.
- ఆ తర్వాత పాకాన్ని పూర్తిగా చల్లార్చుకుంటే సోంపు షర్బత్‌కి కావాల్సిన స్క్వాష్ రెడీ అయినట్లే. అనంతరం దీన్ని ఏదైనా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నారంటే కనీసం రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది!

సోంపు షర్బత్ ఎలా చేసుకోవాలంటే?
- పైన చెప్పిన విధంగా సోంపు స్క్వాష్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారంటే షర్బత్ చేసుకోవడం చాలా తేలిక. ఐదే ఐదు నిమిషాల్లో ఈజీగా సోంపు షర్బత్ చేసుకోవచ్చు.
- ఇందుకోసం గాజు గ్లాసులో రెండు టేబుల్స్పూన్ల సోంపు స్క్వాష్ తీసుకోవాలి. ఆపై అందులో 1 టేబుల్‌స్పూన్ నానబెట్టిన సబ్జా గింజలు, చల్లని నీరు పోసుకొని కలుపుకోవాలి.
- చివర్లో ఐస్‌ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలు. ఒకవేళ మీకు నచ్చితే కలర్ఫుల్గా కనిపించడానికి కొద్దిగా గ్రీన్ కలర్ కూడా వేసుకోవచ్చు. అంతే, మండుటెండల్లో కూల్‌కూల్‌గా పొట్టకు హాయినిచ్చే "సోంపు షర్బత్" రెడీ!

పచ్చిమామిడితో "చల్లని డ్రింక్" - మండుటెండల్లో గొంతులోకి దిగుతుంటే ఆ కిక్కే వేరు!
మండే ఎండల్లో ఒంటికి చలువ చేసే "రాగి అంబలి" - నోటికి రుచిగా, పొట్టకి హాయిగా!