Sajja Kudumulu Making Process : సజ్జలు ఆరోగ్యకరమైన చిరుధాన్యాలలో ఒకటి. చూడటానికి చిన్న జొన్నల్లా కనిపిస్తాయి కానీ వీటి రుచి వేరు. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు, ఫాస్ఫరస్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. బియ్యం, గోధుమల కన్నా సజ్జల్లో ఐరన్ దండిగా ఉంటుంది! ఈ క్రమంలోనే చాలా మంది సజ్జలతో రొట్టెలు, జావ, దోశ, కిచిడీ వంటి ఎక్కువగా చేసుకుంటుంటారు.
అవి మాత్రమే కాదు సజ్జలతో ప్రిపేర్ చేసుకునే ఒక అద్భుతమైన స్వీట్ రెసిపీ ఉంది. అదే, "సజ్జ కుడుములు". అమ్మమ్మల కాలం నాటి ఈ వంటకం ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. టేస్ట్ కూడా భలే గొప్పగా ఉంటుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి, ఒంట్లో రక్తం బాగా తక్కువ ఉన్నవారికి, ఆడవాళ్లకు ఇది ఎంతగానో సహాయపడుతుందంటున్నారు నిపుణులు. దీనిలో ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వెయిట్ లాస్, రక్తహీనత సమస్యను తగ్గించడానికి చాలా బాగా తోడ్పడతాయి. మరి, సూపర్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

తీసుకోవాల్సిన పదార్థాలు :
- సజ్జలు - 2 కప్పులు
- బెల్లం తురుము - 1 కప్పు
- ఎండుకొబ్బరి ముక్కలు - పావు కప్పు(సన్నగా కట్ చేసుకోవాలి)
- యాలకులు - ఐదారు(మెత్తని పొడిగా చేసుకోవాలి)
- నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్
నవరత్నాలాంటి పోషకాలను అందించే హెల్దీ "లడ్డూ" - పిల్లలకు రోజుకొకటి ఇచ్చారంటే బలంగా తయారవుతారు!

తయారీ విధానమిలా :
- ఇందుకోసం ముందుగా ఒక బౌల్లో సజ్జలను తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి.
- ఆ తర్వాత అందులో తగినన్ని వాటర్ పోసుకొని సుమారు 8 గంటల పాటు నానబెట్టుకోవాలి.
- ఆవిధంగా సజ్జలను నానబెట్టుకున్నాక వాటర్‌ని వడకట్టేసి జల్లిగిన్నెలో వేసి పది నిమిషాల పాటు అలా ఉంచాలి. ఇలా చేయడం ద్వారా అందులో ఉన్న అదనపు వాటర్ బయటకు వచ్చేస్తుంది.
- అనంతరం ఆ సజ్జలను పొడి క్లాత్‌పై పలుచగా పరచి బాగా ఆరనివ్వాలి. అంటే, సజ్జలు చక్కగా ఆరి పొడిపొడిగా అవ్వాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని కొన్ని సజ్జలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా మొత్తం సజ్జలను మిక్సీ పట్టుకోవాలి.
- అయితే, పిండి అనేది మరీ మెత్తగా అవ్వదు. కొంచెం బరకగానే ఉంటుందని గుర్తుంచుకోవాలి.
- ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.

- అనంతరం స్టౌ మీద ఒక పాన్ పెట్టుకొని బెల్లం తురుము వేసుకోవాలి. ఆపై మూడు టేబుల్స్పూన్ల వరకు వాటర్ పోసుకొని బెల్లం పూర్తిగా కరిగే వరకు బాయిల్ చేసుకోవాలి.
- బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఎండుకొబ్బరి ముక్కలు, యాలకుల పొడి, నెయ్యి వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న సజ్జ పిండిని కొద్దికొద్దిగా వేసుకొని మెుత్తం చక్కగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి.
- సజ్జ పిండి మిశ్రమం పాన్ అంచుల నుంచి సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకున్నాక స్టౌ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి.
- ఆ మిశ్రమం పూర్తిగా చల్లారాక మరోసారి బాగా కలిపి ఒక ముద్దలాగా చేసుకోవాలి.
- అనంతరం చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకొని కొద్దికొద్దిగా పిండిని తీసుకుంటూ కుడుముల మాదిరిగా చేసుకోవాలి.
- ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. ఆపై వాటిల్లో మీరు ప్రిపేర్ చేసుకున్న కుడుములను చక్కగా సెట్ చేసుకోవాలి.
- అనంతరం ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ తీసుకొని మరిగించుకోవాలి. వాటర్ కాస్త మరిగిన తర్వాత మూత తీసి కుడుములు ఉన్న ఇడ్లీ ప్లేట్స్ పెట్టి ఇడ్లీల మాదిరిగా మంచిగా ఉడికించుకోవాలి.
- అవి చక్కగా ఉడికిన తర్వాత వెంటనే తీయకుండా కాసేపు ఉంచి ఆ తర్వాత తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, టేస్టీ అండ్ హెల్దీ "సజ్జ కుడుములు" రెడీ!
- ఇవి బయటపెడితే ఒకట్రెండు రోజులు తాజాగా ఉంటాయి. అదే ఫ్రిడ్జ్‌లో ఉంచితే వారం పాటు స్టోర్ చేసుకోవచ్చు.

టిప్స్ :
- నానబెట్టిన సజ్జలలోని తడి ఆరి పోవడానికి ఫ్యాన్ కింద ఉంచవచ్చు. కానీ, ఎండలో మాత్రం పెట్టకూడదు.
- ఇక్కడ బెల్లాన్ని సజ్జలు తీసుకున్న కప్పుతో ఒక కప్పు తీసుకోవాలి.
- బెల్లాన్ని పాకం వచ్చే వరకు మరిగించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది.
- ఇక్కడ ఎండుకొబ్బరి లేనివారు పచ్చికొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవచ్చు. అలాగే, మీరు కావాలనుకుంటే చెప్పినదాని కంటే కాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు.
- అలాగే, మీరు కాస్త ఎక్కువ తీపి తినే వాళ్లయితే బెల్లాన్ని కాస్త పెంచుకొని వేసుకోవచ్చు. కానీ, ఇవి లైట్ స్వీట్‌తోనే బాగుంటాయని గుర్తుంచుకోవాలి.
నో షుగర్, నో మిల్క్‌పౌడర్ - నిమిషాల్లో సూపర్ టేస్టీ " కుల్పీ" - పైగా ఆరోగ్యం బోనస్!
శ్రీరామనవమి స్పెషల్ "రవ్వ పాయసం" - ఈ కొలతలతో చేస్తే వెన్నలా కరిగిపోతుంది!