Tourists Safe Guidelines : విహార యాత్రకు వెళ్లడమంటే ప్రతి ఒక్కరికీ ఎంతో సరదా. కొత్త ప్రాంతాలను తనివి తీరూ చూస్తూ అక్కడి అందాలను ఆస్వాదిస్తుంటారు. ఆనందం వ్యక్తం చేస్తుంటారు. అయితే దొంగలు, మోసగాళ్లు కూడా టూరిస్టు ముసుగులోనే ఉంటారు. గుట్టు చప్పుడు కాకుండా దోపిడీ చేస్తుంటారు. ఇందుకోసం కొన్ని ట్రిక్స్ పాటిస్తుంటారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
దొంగలు పోలీసు వేషాలు వేయడం అందరికీ తెలిసిందే. టూరిస్టు ప్లేసుల్లో ఇలాంటి వారు కనిపించే అవకాశం ఉంది. ఇక్కడి చట్టాల్ని మీరు ఉల్లంఘించారని, ఫైన్ చెల్లిస్తారా? జైలుకు వెళ్తారా? అని బెదిరిస్తారు. దీంతో భయపడిపోయే టూరిస్టులు డబ్బులు ఇచ్చేస్తుంటారు. కానీ ఇలాంటి టైమ్‌లో టెన్షన్ పడకుండా కూల్‌గా ఉండాలి. పోలీసు ఐడీ కార్డు చూపించాలని అడగాలి. అంతేకాకుండా ఫైన్ కట్టాలంటే చలానా ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇవ్వకుండా డబ్బులు డిమాండ్ చేస్తే దొంగ బ్యాచ్ అని అనుమానించాలి. వెంటనే లోకల్ పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించాలి.

కొంత మంది టూరిస్టుల్లా వచ్చి మాట కలుపుతారు. ఎంతో మర్యాదగా, నమ్మకస్తుల్లా మాట్లాడుతారు. ఒకరు మీతో మాట్లాడుతూ ఉంటే మిగిలినవారు మీ వస్తువులను చోరీ చేసే పనిలో ఉంటారు. అందువల్ల కొత్త ప్రాంతంలో ఎవరైనా కొత్తవారు మాటలు కలుపుతుంటే అలర్ట్ గా ఉండాలి. జాగ్రత్త పడాలి.
తెలియని ప్రాంతాలను చూసేందుకు వెళ్లినప్పుడు ఓ గైడ్‌ను నియమించుకుంటూ ఉంటారు. అయితే కొందరు దొంగలు తాము గైడ్స్‌గా చెప్పుకుంటారు. తప్పుడు దారిలో తీసుకెళ్లి డబ్బులు అధికంగా వసూలు చేస్తారు. తాము చెప్పిన దారిలోకి వెళ్లేలా టూరిస్టు ప్లేసుల గురించి తప్పుడు సమాచారం ఇస్తారు. అందువల్ల పర్యటనకు ముందే లైసెన్సు ఉన్న గైడ్‌ను ఏర్పాటు చేసుకోవడం మంచిది.
ప్రముఖ ప్రాంతాల్లో ఇప్పుడు వై-ఫై సేవలను ఉచితంగానే అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు నకిలీ వై-ఫైని అందుబాటులో ఉంచుతున్నాయి. ఆ సేవలను పర్యాటకులు వినియోగించుకుంటే వారి ల్యాప్‌టాప్, మొబైల్ నుంచి కీలక సమాచారాన్ని కాజేస్తున్నారు. కాబట్టి.. ఛాన్స్ ఉన్నంత వరకు పబ్లిక్ వై-ఫైకి దూరంగా ఉండడమే మంచిదని చెబుతున్నారు.
బార్లు, రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు కి"లేడీ"లు తారసపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టూరిస్టు బాయ్స్‌తో మాటల కలుపుతూ క్లోజ్‌గా మూవ్ అవుతుంటారు. ఆల్కహాల్ తాగడానికి పిలుస్తారు, భారీగా బిల్ చేసి వెళ్లిపోతారు. అంతేకాదు మద్యం మత్తులో ఉన్నప్పుడు వస్తువులు, నగదు దోచుకొని పారిపోతారు. అందుకే, తెలియనివారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.
అన్ని ప్రాంతాల్లోనూ ఇదేవిధమైన మోసాలు ఉంటాయని చెప్పలేం. వేర్వేరు చోట్ల వేర్వేరు తీరుగా మోసం చేసే అవకాశం ఉంటుంది. అందుకే టూరిస్టులు తగిన జాగ్రత్తలు పాటించాలి. డబ్బులను చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. దీనికోసం యాంటీ-థెఫ్ట్ బ్యాగ్స్ ఉపయోగించొచ్చు. పాస్‌పోర్ట్, ఐడెంటిటీ కార్డులు, క్రెడిట్, డెబిట్ కార్డుల ఫొటోలను మొబైల్లో ఉండేలా చూసుకోండి. మెయిల్స్‌లో స్టోర్ చేసుకుంటే మంచిది. వాటి డూప్లికేట్ కాపీలు ఉంటే మరీ మంచిది. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించడానికి స్థానిక ఎమర్జెన్సీ నంబర్లను ముందే తెలుసోకవడం మంచిది. తెలియని వ్యక్తులతో మాటలు నమ్మొద్దని గుర్తు పెట్టుకోవాలి.