Instant Rava Sweet at Home : అందరి ఇళ్లలో బొంబాయి రవ్వ కచ్చితంగా ఉంటుంది. ఇక ఇంట్లో రవ్వ ఉందంటే ఉప్మా, దోశ, ఇడ్లీ, ఊతప్పం వంటివి ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటుంటాం. స్వీట్ తినాలనిపించినప్పుడు రవ్వ లడ్డూలు చేసుకుంటుంటారు. అయితే, ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవడానికి కాస్త ఎక్కువ టైమ్ పడుతుంది. కొన్నిసార్లు పర్ఫెక్ట్ కుదరకపోవచ్చు. అలాంటి సమయంలో ఓసారి బొంబాయి రవ్వ, పాలతో సూపర్ టేస్టీ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏమాత్రం వంట రాని వాళ్లు కూడా సింపుల్‌గా చేసుకోవచ్చు. తక్కువ పదార్థాలతో, ఎలాంటి డీప్ ఫ్రై లేకుండానే దీన్ని తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి, ఆ స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

టిప్స్ :
- ఈ రెసిపీ తయారీకి రవ్వ వేయించుకునేటప్పుడు అది మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఎందుకంటే ఈ రవ్వ స్వీట్స్ రుచి అంతా అది వేయించుకునే తీరుపైనే ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి.
- అలాగే, ఇక్కడ స్వీట్ కలర్ఫుల్గా కనిపించడానికి ముందుగానే కుంకుమ పువ్వును పాలలో నానబెట్టుకోవాలి.
- మీకు కుంకుమ పువ్వు అందుబాటులో లేకుంటే యెల్లో ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు.

కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :
- నెయ్యి - 2 టేబుల్‌స్పూన్లు
- బొంబాయి రవ్వ - అర కప్పు
- కాచిన పాలు - ఒక కప్పు
- పంచదార - అర కప్పు
- యాలకుల పొడి - పావుటీస్పూన్
- నెయ్యి - 1 టేబుల్‌స్పూన్
- కుంకుమ పువ్వు - కొద్దిగా(కలర్ కోసం)
పాలు, షుగర్ లేకుండా "రవ్వ లడ్డూ" తయార్ - ఇదే ఈ రెసిపీ సీక్రెట్! - అమ్మా ఇంకో లడ్డూ అంటారు!

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా ఒక చిన్న గిన్నెలో కొద్దిగా పాలు, కుంకుమ పువ్వు తీసుకొని నానబెట్టుకోవాలి. ఇది స్వీట్‌కి మంచి కలర్‌ని తీసుకొస్తుంది.
- ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 1 టీస్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత అందులో బొంబాయి రవ్వను వేసి లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి.
- రవ్వ చక్కగా వేగాక దానిలో కాచిన పాలను కొద్దికొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి.
- అనంతరం లో ఫ్లేమ్ మీద రవ్వ మిశ్రమం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి.
- ఆవిధంగా ఉడికించుకున్నాక ఆ మిశ్రమంలో చక్కెర, యాలకుల పొడి వేసుకొని పంచదార రవ్వ మిశ్రమంలో పూర్తిగా కరిగే వరకు లో ఫ్లేమ్ మీద కలుపుతూ కుక్ చేసుకోవాలి.
- అలా ఉడికించుకునేటప్పుడు మధ్యలో 1 టేబుల్‌స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుతూ రవ్వ మిశ్రమం పాన్ అంచుల నుంచి సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి.
- రవ్వ మిశ్రమాన్ని ఆవిధంగా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి.
- అది చల్లారాక ఒకసారి కలిపి పెద్ద సైజ్‌లో ఒక ముద్ద, చిన్న సైజ్‌లో మరో ముద్ద చేసుకోవాలి.
- ఇప్పుడు తక్కువ సైజ్ రవ్వ ముద్దలో స్వీట్‌కి మంచి కలర్ రావడానికి ముందుగానే పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వుని వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.

- ఆ తర్వాత చేతికి కాస్త నెయ్యిని రాసుకొని కుంకుమ పువ్వు కలిపిన పిండి ముద్దలో నుంచి కొద్దికొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
- అనంతరం పెద్ద సైజ్ రవ్వ ముద్దలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని చిన్న అప్పంలా చేసుకోవాలి.
- ఆపై దాని మధ్యలో ముందుగా చేసిన యెల్లో కలర్ రవ్వ ఉండ పెట్టి నెమ్మదిగా క్లోజ్ చేయాలి.
- పూర్తిగా క్లోజ్ చేశాక రౌండ్ షేప్ వచ్చేలా చేతితో నెమ్మదిగా రోల్ చేసుకోవాలి. మిగిలిన పిండిని ఇదేవిధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత ప్రిపేర్ చేసుకున్న లడ్డూలను సగానికి కట్ చేసుకుంటే లోపల పసుపు కలర్, పైన తెలుపు రంగులో అద్దిరిపోయే "రవ్వ స్వీట్స్" మీ ముందు ఉంటాయి.
- తక్కువ పదార్థాలతో, ఎలాంటి డీప్ ఫ్రై లేకుండానే ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ తింటుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది.
- మరి, ఇంకెందుకు ఆలస్యం నచ్చితే మీరూ ఓసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ సరికొత్త స్వీట్ టేస్ట్‌ని ఎంజాయ్ చేస్తారు!

చూస్తేనే నోరూరిపోయే "మామిడి మురబ్బా" - అన్నం, చపాతీల్లోకి కేక - ఏకంగా ఏడాది నిల్వ!