Ragi Sangati in Pressure Cooker : 'రాగి సంగటి - నాటుకోడి పులుసు' ఎవర్గ్రీన్ కాంబినేషన్. దీని టేస్ట్ గురించి మాటల్లో వర్ణించడం కష్టం. అందుకే అమ్మమ్మలు, నానమ్మలు తినే ఈ సంగటిని నేటి జనరేషన్ కూడా రుచి చూసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో తయారు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే చాలా మందికి రాగి సంగటిని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవడం రాదు. పిండి సరిగ్గా ఉడకక ఎన్నో తిప్పలు పడుతుంటారు. అయితే అలాంటి వారి కోసం కుక్కర్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునేలా అద్భుతమైన రాగి సంగటి రెసిపీని తీసుకొచ్చాం. ఇది సూపర్ టేస్టీగా ఉండి తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తింటారు. పిల్లలు సైతం అస్సలు వద్దనరు. మరి, ఈ టేస్టీ అండ్ హెల్దీ రాగి సంగటిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:
- బియ్యం - 1 గ్లాస్
- రాగి పిండి - 2 గ్లాసులు
- వాటర్ - 8 గ్లాసులు
- నెయ్యి - తగినంత

తయారీ విధానం:
- ప్రెషర్ కుక్కర్లోకి బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి 8 గ్లాసుల నీరు పోసి మూత పెట్టి సుమారు 15 నిమిషాలు నానబెట్టుకోవాలి.
- బియ్యం నానిన తర్వాత కుక్కర్‌ను నేరుగా స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్‌లో సుమారు 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.

- కుక్కర్ ఆవిరి పోయిన తర్వాత మూత తీసి రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నాన్ని కాస్త మెత్తగా మెదుపుకోవాలి.
- అన్నాన్ని మెదుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్‌లో పెట్టి రాగి పిండి వేసుకోవాలి.
- రాగి పిండిని ఒకటే దగ్గర కాకుండా అన్నం మీద సమానంగా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి.

- రాగి పిండి కాస్త మగ్గిన తర్వాత గరిటెతో ఉండలు లేకుండా అన్నం, పిండి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
- సంగటిని బాగా కలిపిన తర్వాత 3 టేబుల్స్పూన్ల నెయ్యి వేసి మరికొద్దిసేపు కలుపుకుని ఉడికించాలి.
- చివరగా సంగటిపైన కొన్ని నీళ్లను చిలకరించి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో మరో 3 నిమిషాలు మగ్గించాలి.
- ఆ తర్వాత సంగటిని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు కాస్త వెడల్పుగా, గుంటగా ఉన్న గిన్నె తీసుకుని లోపల భాగంలో నెయ్యి అప్లై చేసుకోవాలి.

- ఆ గిన్నెలోకి రాగి మిశ్రమాన్ని కొద్దిగా వేసుకుని గిన్నెను రౌండ్‌గా తిప్పుతుంటే సంగటి గుండ్రంగా వస్తుంది.
- ఇలా మిగిలిన పిండి మొత్తాన్ని ఇలానే చేసుకోవాలి. ఓ ప్లేట్లోకి రాగి సంగటి ముద్దను ఉంచి నచ్చిన కూరతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన రాగి సంగటి తయార్. నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి.

చిట్కాలు:
- ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో పైన చెప్పిన కొలతల ప్రకారం నీళ్లు, రాగిపిండిని తీసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ మొత్తంలో చేయాలంటే పైన చెప్పిన పదార్థాలను పెంచి తీసుకోవాలి.
- బియ్యం నానబెట్టకుండా కడిగి నేరుగా పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవచ్చు. కాకపోతే ఆ సమయంలో 8 కప్పుల నీరు కాకుండా మరో కప్పు కలిపి మొత్తం తొమ్మిది కప్పుల వాటర్ పోసి ఉడికించుకోవాలి.
- సంగటి రుచి మొత్తం కూడా అన్నం, రాగి పిండిని కలిపే విధానంలోనే ఉంటుంది. కాబట్టి ఉండలు లేకుండా మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
అమ్మమ్మల కాలం నాటి "తునకం స్వీట్" - పాకం పట్టాల్సిన పనిలేకుండా చాలా సింపుల్ - టేస్ట్ అదుర్స్!