దోశ పిండితో "పునుగులు" - ఇలా చేస్తే పావుగంటలో రెడీ - నూనె కూడా పీల్చవు!
- పులిసిన దోశ పిండితో క్రిస్పీ అండ్ టేస్టీ పునుగులు - సింపుల్‌గా చేసుకోండిలా!

Published : June 17, 2025 at 3:20 PM IST
Punugulu with Dosa Batter in Telugu : దోశ పిండి మెజార్టీ ప్రజల ఇళ్లల్లో తప్పకుండా ఉంటుంది. చాలా మంది మహిళలు టైమ్ ఉండదనో, పదే పదే చేయడానికి ఓపిక లేకనో వారానికి సరిపడే విధంగా పిండిని ప్రిపేర్ చేసుకుంటారు. ఇక ఆ రోజుకు ఎంత కావాలో అంత పిండి తీసుకుని మిగిలినది ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకుంటారు. అయితే, కొన్నిసార్లు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసినా పిండి పులిసిపోతుంటుంది. దీంతో ఏం చేయాలో తెలియక చాలా మంది పడేస్తుంటారు. మీరు కూడా అలానే చేస్తున్నారా? అయితే దోశ పిండి బాగా పులిసిపోతే పడేయకుండా ఇలా "పునుగులు" చేసుకోండి. క్రిస్పీగా, టేస్టీగా భలేగా వస్తాయి! పిల్లలైతే వీటిని చాలా ఇష్టంగా తింటారు. పైగా వీటి తయారీకి ఎక్కువ కష్టపడాల్సిన పనిలేదు. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానమేంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:
- దోశ పిండి - 1 కప్పు
- ఉల్లిపాయ - 1
- జీలకర్ర - అర టీస్పూన్
- పచ్చిమిర్చి - 2
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఉప్పు - సరిపడా
- క్యారెట్ - 1
- మైదా పిండి - 1 టేబుల్‌స్పూన్
- బియ్యప్పిండి - 1 టేబుల్‌స్పూన్
- బేకింగ్ సోడా - పావు టీస్పూన్

తయారీ విధానం:
- పునుగులు వేసుకునేందుకు అవసరమైన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను సన్నగా కట్ చేసుకోవాలి.
- అలాగే క్యారెట్‌పై ఉండే పొట్టు తీసేసి వీలైనంత సన్నగా తురుముకోవాలి.
- ఓ మిక్సింగ్ బౌల్లోకి పులిసిన దోశ పిండిని తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్, కొత్తిమీర తరుగు వేసుకోవాలి.
- ఆ తర్వాత జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే ఒకవేళ మీరు పిండిలో ఇంతకుముందే ఉప్పు వేస్తే దానికి తగ్గట్లుగా వేసుకోవాలి.
- పిండిని బాగా కలుపుకున్న తర్వాత బేకింగ్ సోడా, మైదా పిండి, బియ్యప్పిండి వేసి పునుగులు వేసుకునేందుకు సరిపడేలా కలుపుకోవాలి. పిండి ఏమైనా లూజ్ అనిపిస్తే మరికొంచెం మైదా కలుపుకోవచ్చు.

- ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పావుగంట సేపు పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల పొడులన్నీ దోశ పిండిలో కలిసి పునుగులు క్రిస్పీగా వస్తాయి.
- పిండి నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత దోశ పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ పునుగులుగా వేసుకోవాలి.
- కడాయికి సరిపడా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి వెంటనే కలపకుండా ఓ నిమిషం తర్వాత గరిటెతో అటు ఇటూ కలుపుతూ వేయించుకోవాలి.

- పునుగులు చక్కగా వేగి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన పిండితో ఇలానే పునుగులు వేసుకుని కాల్చుకోవాలి.
- ఇలా ప్రిపేర్ చేసుకున్న పునుగులను ఓ ప్లేట్లోకి తీసుకుని నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే దోశ పిండితో పునుగులు రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- బాగా పులిసిన పిండి అయితే పునుగులు చాలా టేస్టీగా వస్తాయి. మీ దగ్గర పులిసిన పిండి లేకపోతే నార్మల్ దోశ పిండితో కూడా పునుగులు చేసుకోవచ్చు.
- నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే పునుగులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కాగకముందే వేస్తే నూనెను పీల్చుకుంటాయి.
- దోశ పిండి పునుగులు వేసుకునేందుకు సరిపడేలా ఉండాలి. లేదంటే మరికొంచెం మైదా పిండి కలుపుకోవచ్చు. మైదా ప్లేస్‌లో గోధుమపిండి కూడా కలుపుకోవచ్చు.
చూస్తేనే తినాలనిపించే కరకరలాడే "క్యాబేజీ పకోడీ" - ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాదీ సూపర్ అనాల్సిందే!
బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఈ పాతకాలపు హెల్దీ "టిఫెన్" చేసుకోండి - బరువు, షుగర్ కంట్రోల్‌కు బెస్ట్ ఆప్షన్!

