దాబా స్టైల్ "బెండకాయ కర్రీ" - జిగురు లేకుండా భలే కమ్మగా!
- సరికొత్త రుచిలో అద్దిరిపోతుంది - నచ్చనివాళ్లూ ఇష్టంగా తింటారు!

Published : September 12, 2025 at 3:22 PM IST
Punjabi Style Bhindi Masala Fry : పిల్లల నుంచి పెద్దల వరకు అంతగా ఇష్టపడని కూరగాయల్లో ఒకటి బెండకాయ. బంకగా, సప్పగా ఉంటుందని చాలా మంది దీన్ని పక్కన పెడుతుంటారు. అలాంటి వారు కూడా ఇష్టంగా తినే ఒక సూపర్ రెసిపీ ఉంది. అదే, పంజాబీ దాబా స్టైల్లో కమ్మని "బెండకాయ మసాలా కర్రీ". ఇలా చేశారంటే అస్సలు జిగురు లేకుండా కర్రీ చాలా రుచికరంగా ఉంటుంది. ఇది అన్నంతో పాటు చపాతీ, రోటీ, పుల్కా ఇలా దేనిలోకైనా అద్దిరిపోయే టేస్ట్‌నిస్తుంది. బ్యాచిలర్స్ కూడా ఈ రెసిపీని చాలా సులభంగా రెడీ చేసుకోవచ్చు. మరి, అందుకు అవసరమైన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- బెండకాయలు - అరకిలో
- నూనె - తగినంత
- జీలకర్ర - రెండు టీస్పూన్లు
- ఆవాలు - ఒక టీస్పూన్
- ఉల్లిపాయలు - నాలుగు
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - రెండు టీస్పూన్లు
- ధనియాల పొడి - రెండు టీస్పూన్లు
- ఉప్పు - రుచికి తగినంత
- కారం - రెండు టేబుల్‌స్పూన్లు(తగినంత)
- వేయించిన జీలకర్ర పొడి - రెండు టీస్పూన్లు
- గరంమసాలా - ఒక టీస్పూన్
- పసుపు - కొద్దిగా
- టమాటాలు - నాలుగు
చల్లని వేళ కరకరలాడే "మొక్కజొన్న గారెలు" - ఈ సీక్రెట్ టిప్‌తో సూపర్ టేస్ట్!

తయారీ విధానం :
- పంజాబీ దాబా స్టైల్లో నోరూరించే ఈ కర్రీ కోసం ముందుగా తాజా లేత బెండకాయలను తీసుకోవాలి. ఆపై వాటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- అలాగని, బెండకాయ ముక్కలను మరీ చిన్నగా కట్ చేసుకోవద్దు. కనీసం ఒకటిన్నర అంగుళం పొడువు ఉండేలా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
- అలాగే, రెసిపీలోకి అవసరమైన ఉల్లిపాయలను వీలైనంత సన్నగా కట్ చేసుకుని పక్కనుంచాలి. టమాటాలను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి.

- ఇప్పుడు స్టవ్ మీద కడాయి లేదా పాన్‌లో నాలుగైదు టేబుల్స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసి హై ఫ్లేమ్ మీద కలుపుతూ నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి.
- ఇలా హై ఫ్లేమ్‌లో బెండకాయ ముక్కలను వేయించడం ద్వారా అందులోని జిగురు తగ్గి కర్రీ మంచి రుచికరంగా వస్తుంది.
- బెండకాయ ముక్కలు మంచిగా వేగి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచాలి.

- అనంతరం అదే పాన్‌లో ఆరు టేబుల్స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. అవి వేగాక సన్నని ఉల్లిపాయ తరుగు యాడ్ చేసి లో టూ మీడియం ఫ్లేమ్‌లో ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
- ఉల్లిపాయలు రంగు మారుతున్న క్రమంలోనే కరివేపాకు వేసి వేయించాలి.
- ఆ తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, కారం, వేయించిన జీలకర్ర పొడి, గరంమసాలా వేసి మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుతూ వేయించాలి.
- అవన్నీ నూనెలో మంచిగా వేగి ఆయిల్ పైకి తేలాలి. అప్పుడే కూరకు మంచి ఫ్లేవర్ వస్తుందని గుర్తుంచుకోవాలి.
"మిర్చీ బజ్జీలు" బండి మీద అమ్మే టేస్ట్ రావట్లేదా? - "పిండి" ఇలా కలిపితే సూపర్ వస్తాయి!

- ఆవిధంగా వేయించుకున్నాక అందులో మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ జత చేసి అంతా బాగా కలిసేలా కలపాలి.
- తర్వాత స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మధ్యమధ్యలో కలుపుతూ ఆ మిశ్రమం నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. అందుకోసం ఏడెనిమిది నిమిషాల టైమ్ పట్టొచ్చు.
- అనంతరం ఆ మిశ్రమంలో ముందుగా వేయించి పక్కనుంచిన బెండకాయ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్‌లో నాలుగైదు నిమిషాల పాటు కలుపుతూ మగ్గించుకోవాలి. బెండకాయ ముక్కలు నూనెలో చక్కగా మగ్గాలి. అప్పుడే పులుపు, కారాలు బెండకాయలకు చక్కగా పడుతాయి.
- బెండకాయ మంచిగా మగ్గి ఆయిల్ తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దింపేసుకుంటే చాలు. అంతే, పంజాబీ దాబా స్టైల్లో ఘుమఘుమలాడే "బెండకాయ మసాలా" కర్రీ రెడీ అవుతుంది!

చిట్కాలు :
- ఈ రెసిపీ కోసం లేతగా ఉండే బెండకాయలు తీసుకోవాలి. అలాగే, మసాలాలను ఆయిల్ తేలే వరకు వేయించుకోవాలి.
- ఈ రెసిపీలో వీలైనంత వరకు వాటర్ వేయకుండా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే, ఈ కర్రీ మొత్తం నూనెలోనే మగ్గాలని గుర్తుంచుకోవాలి. అప్పుడే అసలైన పంజాబీ దాబా స్టైల్ రుచిని ఎంజాయ్ చేస్తారు.
ఘుమాయించే "చికెన్ కర్రీ" - చల్లని వేళ వేడివేడి అన్నంలోకి అదుర్స్!

