ETV Bharat / offbeat

ఈ కొలతలతో "పులిహోర" చేస్తే - గుడిలో ప్రసాదంలా కమ్మగా ఉంటుంది!

టెంపుల్ స్టైల్ పులిహోర రెసిపీ - వినాయక చవితి వేళ ఈజీగా చేసుకోండిలా!

Prasadam Pulihora Recipe
Prasadam Pulihora Recipe (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : August 27, 2025 at 2:49 PM IST

3 Min Read
Choose ETV Bharat

Prasadam Pulihora Recipe in Telugu : దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు మొదలయ్యాయి. గల్లీ నుంచి దిల్లీ దాకా వివిధ రూపాల్లో బొజ్జగణపయ్యలు కొలువుదీరుతున్నారు. ఈ క్రమంలోనే స్వామి వారికి నివేదించడానికి చవితి మొదలుకొని నిమజ్జనం వరకు నవరాత్రుల్లో రకరకాల నైవేద్యాలు ప్రిపేర్ చేసి విఘ్నేశ్వరుడికి నివేదిస్తారు. అందులో భాగంగానే మెజార్టీ పీపుల్ ప్రసాదంగా పులిహోరను ప్రిపేర్ చేస్తుంటారు. కానీ, కొన్నిసార్లు ఎంత బాగా చేసినా టేస్ట్​లో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అందుకే, మీకోసం వినాయక చవితి వేళ అద్దిరిపోయే "పులిహోర" రెసిపీని తీసుకొచ్చాం. ఈ కొలతలతో చేశారంటే అచ్చం గుడిలో పెట్టే ప్రసాదంలా చాలా రుచికరంగా వస్తుంది. మొదటిసారి చేసే వారైనా ఇలా చేస్తే పర్ఫెక్ట్ రుచితో భలే కమ్మగా కుదురుతుంది. ఇంటిల్లిపాదీ చాలా ఇష్టంగా తింటారు. మరి, సూపర్ టేస్టీగా ఉండే ప్రసాదం పులిహోరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

Prasadam Pulihora Recipe
Chinthapandu (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • రైస్ - అరకిలో
  • చింతపండు - 100 గ్రాములు
  • పసుపు - రెండు టీస్పూన్లు
  • ఉప్పు - రుచికి తగినంత
  • కరివేపాకు - నాలుగు రెబ్బలు
  • చీల్చిన పచ్చిమిర్చి - ఐదారు
  • ఆవాలు - మూడ్నాలుగు టేబుల్‌స్పూన్లు
  • అల్లం - చిన్నముక్క
  • ఎండుమిర్చి - నాలుగు
  • బెల్లంపొడి - రెండు టీస్పూన్లు
  • నూనె - తగినంత

రవ్వ, బెల్లంతో కమ్మని "ఉండ్రాళ్లు" - అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు!

Prasadam Pulihora Recipe
Peanuts (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా అన్నాన్ని కాస్త పలుగ్గా వండుకోవాలి. అన్నం ఉడికేలోపు ఒక గిన్నెలో చింతపండుని తీసుకొని శుభ్రంగా కడగాలి. ఆపై అందులో వేడినీళ్లు పోసి నానబెట్టుకోవాలి.
  • అనంతరం పలుగ్గా ఉడికించుకున్న అన్నంను వేడిగా ఉన్నప్పుడే ఒక వెడల్పాటి బేషన్​లోకి తీసుకొని దాని మీద పసుపు, ఉప్పు వేసుకోవాలి.
  • అలాగే, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాక కొంచెం నూనె పోసి అన్నానికి పట్టేలా పైపైన కలిపి అన్నంను కాస్త చల్లారనివ్వాలి.
  • అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో ఆవాలు, అల్లం, ఎండుమిర్చిని వేసి కొద్దిగా ఉప్పు వేసి మెత్తని పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో ఉప్పు వేసుకోవడం వల్ల వగరు రాకుండా ఉంటుంది.
Prasadam Pulihora Recipe
Karivepaku (Getty Images)
  • ఇప్పుడు స్టవ్‌ మీద కడాయి పెట్టుకొని తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి.
  • అవి వేగిన తర్వాత అందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన పులుసుని యాడ్ చేసుకొని అది గుజ్జుగా అయ్యేంతవరకు మరిగించాలి. దీంట్లోనే కొద్దిగా బెల్లం పొడి వేస్తే పులిహోర మరీ పుల్లగా ఉండకుండా మంచి రుచికరంగా వస్తుంది.
  • పులుసు చక్కగా మరిగి దగ్గరగా అయిన తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాల పేస్టు మిశ్రమాన్ని వేసి ఒకసారి బాగా కలిపి ఉడికించాలి.
  • తర్వాత చల్లారిన అన్నాన్ని యాడ్ చేసుకొని అంతా కలిసేలా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి.
  • అనంతరం ఈ మిశ్రమానికి మళ్లీ రెండో తాలింపుని సిద్ధం చేసుకోవాలి. దీన్ని యాడ్ చేయడం ద్వారానే పులిహోరకు అదనపు రుచి వస్తుంది.

గణపతికి "మోతీచూర్​ లడ్డూ" - శనగపిండి అవసరమే లేదు!

Prasadam Pulihora Recipe
Spices (Getty Images)

రెండో తాలింపు కోసం :

  • ఆయిల్ - తగినంత
  • పల్లీలు - అర కప్పు
  • ఆవాలు - కొద్దిగా
  • మినప్పప్పు - రెండు టేబుల్​స్పూన్లు
  • శనగపప్పు - రెండు టేబుల్​స్పూన్లు
  • ఎండుమిర్చి - ఏడెనిమిది
  • కరివేపాకు - నాలుగు రెమ్మలు
  • బెల్లంపొడి - 2 చిటికెళ్లు
  • ఇంగువ - కొద్దిగా
Prasadam Pulihora Recipe
Prasadam Pulihora Recipe (Eenadu)
  • ఇందుకోసం స్టవ్ మీద ఒక కడాయిలో నూనె వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత ఆవాలు వేసి అవి చిటపటలాడాక పల్లీలు, శనగపప్పు, మినపప్పు యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి.
  • అవన్నీ మంచిగా వేగాక ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయాలి. చివర్లో ఇంగువ, కొద్దిగా బెల్లంపొడిని కూడా వేసి వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • అనంతరం చక్కగా వేగిన తాలింపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పులిహోర మిశ్రమంలో వేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసుకుంటే చాలు. అంతే, గుడిలో ప్రసాదంలా నోరూరించే కమ్మని "పులిహోర" రెడీ అయిపోతుంది!

వినాయక చవితి స్పెషల్ : తుమ్మికూరతో కమ్మని "పప్పు" - సింపుల్​గా చేసుకోండిలా!