ఈ స్టఫ్ఫింగ్ రెడీ చేసుకుంటే చాలు - "పూర్ణాలు, బొబ్బట్లు" రెండూ కుక్ చేసుకోవచ్చు!
- పూర్ణాలు, బొబ్బట్లు చేయడానికి ఇక ఎక్కువ టైమ్ అవసరం లేదు - ఒకే పనితో రెండు స్వీట్లు రెడీ!

Published : August 6, 2025 at 1:36 PM IST
|Updated : August 6, 2025 at 1:51 PM IST
Poornam and Bobbatlu with One Stuffing: మహిళలకు అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణం. ఈ నెలలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఆడపడుచులందరూ "వరలక్ష్మీ వ్రతం" చేసుకుంటారు. ఆయురారోగ్యాలు, సిరిసంపదలు అందించమని అమ్మవారిని నిండు మనసుతో కోరుతూ రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. అందులో పూర్ణం బూరెలు తప్పనిసరి. ఇక కొద్దిమంది బొబ్బట్లను కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. కానీ ఈ రెండూ చేయాలంటే కాస్త టైమ్ పడుతుంది. ఎందుకంటే రెండింటికి పూర్ణం స్టఫ్ఫింగ్తో పాటు కోటింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ఇకపై ఆ టెన్షన్ లేకుండా శనగపప్పు, బెల్లం మిశ్రమంతో పూర్ణాలు, బొబ్బట్లను చేసుకోవచ్చు. ఒక్కసారి స్టఫ్పింగ్ ప్రిపేర్ చేసుకుంటే చాలా తక్కువ సమయంలో వీటిని తయారు చేసుకోవచ్చు. మరి ఆ ప్రాసెస్ ఏంటో ఈ స్టోరీలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
స్టఫ్ఫింగ్ కోసం:
- పచ్చి శనగపప్పు - 2 కప్పులు
- పసుపు - చిటికెడు
- నెయ్యి - తగినంత
- ఉప్పు - చిటికెడు
- బెల్లం - 2 కప్పులు
- నీళ్లు - తగినన్ని
- యాలకుల పొడి - 1 టీ స్పూన్

స్టఫ్పింగ్ తయారీ విధానం:
- ఓ గిన్నెలోకి శనగపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి సరిపడా వాటర్ పోసి సుమారు 2 గంటల పాటు నానబెట్టాలి.
- పప్పు నానిన తర్వాత మరోసారి కడిగి నీళ్లు లేకుండా పూర్తిగా ఒంపేసి కుక్కర్లోకి తీసుకోవాలి. ఆపై అందులోకి రెండు కప్పుల నీళ్లు, పసుపు, ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసుకుని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్‌లో మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
- పప్పు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. కుక్కర్ ఆవిరి పోయిన తర్వాత మూత తీసి పప్పును జల్లెడలో వేసుకుని పక్కకు పెట్టుకోవాలి. నీళ్లు పోయిన తర్వాత పప్పును మిక్సీ జార్‌లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి బెల్లం తురుము, కొన్ని నీళ్లు పోసి కరిగించుకోవాలి.
- బెల్లం కరిగిన తర్వాత అందులోకి గ్రైండ్ చేసుకున్న పప్పు వేసుకుని బాగా కలిపి ఉడికించుకోవాలి.
- పప్పు దగ్గరపడి పాన్‌కు అంటుకోకుండా సెపరేట్ అయినప్పుడు యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. దీంతో స్టఫ్పింగ్ రెడీ అయినట్లే. ఈ స్టఫ్పింగ్తో పూర్ణాలు, బొబ్బట్లు చేసుకోవాలి.

పూర్ణాల కోసం:
- మినప్పప్పు - 1 కప్పు
- బియ్యం - 2 కప్పులు
- ఉప్పు - సరిపడా
- పంచదార - 1 టేబుల్‌స్పూన్
తయారీ విధానం:
- మిక్సింగ్ బౌల్లోకి బియ్యం, మినప్పప్పు వేసి రెండుమూడు సార్లు శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోసి సుమారు 3 గంటల పాటు నానబెట్టాలి.
- నానిన బియ్యం, పప్పును మరోసారి కడిగి మిక్సీజార్‌లో వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇలా గ్రైండ్ చేసుకున్న దోశ పిండిని ఓ గిన్నెలోకి తీసుకుని ఉప్పు, పంచదార వేసి కలిపి ఓ అరగంట పక్కన ఉంచాలి.
- ఈలోపు ప్రిపేర్ చేసుకున్న స్టఫ్పింగ్ను రెండు భాగాలుగా చేసుకోవాలి. అందులో సగభాగం పూర్ణాలు చేసుకోవడానికి ఉపయోగించాలి. అందుకోసం మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి.

- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్‌ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత పూర్ణం ఉండను దోశ పిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసుకోవాలి.
- కడాయికి సరిపడే విధంగా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఇలా రెండు వైపులా వేయించుకున్న తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. మిగిలిన ఉండలను కూడా ఇలానే పిండిలో ముంచి నూనెలో వేసి డీప్‌ఫ్రై చేసుకోవాలి. అంతే పూర్ణం బూరెలు రెడీ.

బొబ్బట్ల కోసం:
- మైదా - 2 కప్పులు
- ఉప్పు - చిటికెడు
- నెయ్యి - తగినంత
- నూనె- కొద్దిగా
తయారీ విధానం:
- మిక్సింగ్ బౌల్లోకి మైదా, ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసి కలపాలి. నెయ్యి మొత్తం పిండిలో కలిసిన తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ సాఫ్ట్‌గా చపాతీ ముద్దలా మిక్స్ చేసుకోవాలి.
- పిండిని బాగా కలుపుకున్న తర్వాత నూనె యాడ్ చేసుకుని మరోసారి కలిపి మూత పెట్టి సుమారు 2 గంటల పాటు పక్కన ఉంచాలి.
- మిగిలిన స్టఫ్పింగ్ను కొద్దిగా తీసుకుని ఉండలుగా చేసుకోవాలి. అలాగే ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని మరోసారి కలిపి మీడియం సైజ్‌లో ఉండలుగా చేసుకోవాలి.
- ఓ ఉండ తీసుకుని దానిని కొంచెం చేతితోనే స్ప్రెడ్ చేసి, దాని మధ్యలో శనగపప్పు మిశ్రమాన్ని పెట్టి అంచులు క్లోజ్ చేయాలి. ఉండలన్నింటిని ఇలానే చేసుకోవాలి.

- స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టి హీట్ చేసుకోవాలి. ఈలోపు చపాతీ పీట మీద ఓ బటర్ పేపర్ ఉంచి స్టఫ్పింగ్ చేసుకున్న ఒక ఉండను ఉంచి లైట్‌గా ప్రెస్ చేయాలి. అనంతరం దానిపైన మరో బటర్ పేపర్ ఉంచి చపాతీ కర్రతో లైట్‌గా బొబ్బట్లుగా వత్తుకోవాలి.
- పాన్ హీటెక్కిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న భక్ష్యాలను ఉంచి ఓ వైపు 10 సెకన్ల పాటు కాల్చుకోవాలి.
- రెండో వైపుకు తిప్పుకుని మరో 10 సెకన్లు కాల్చుకున్న తర్వాత మధ్యమధ్యలో నెయ్యి అప్లై చేసుకుంటూ రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి.
- ఇలా చేసుకున్న వాటిని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన ఉండలన్నింటినీ ఈ పద్ధతిలో చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు రెడీ. చూశారుగా ఒక్క స్టఫ్పింగ్ ప్రిపేర్ చేసుకుంటే రెండు రకాల(పూర్ణాలు, బొబ్బట్లు) ప్రసాదాలు చేసి వరలక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చు.

చిట్కాలు:
- పూర్ణాలు, భక్ష్యాలు చేసుకునేందుకు స్టఫ్పింగ్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే శనగపప్పు, బెల్లాన్ని కొంచెం ఎక్కువగానే చేసుకోవాలి. శనగపప్పు, బెల్లం సమాన కొలతలుగా తీసుకోవాలి. అప్పుడే అవి టేస్టీగా వస్తాయి.
- కావాలనుకుంటే స్టఫ్పింగ్ను వ్రతానికి ముందు రోజే ప్రిపేర్ చేసుకుని చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టి, వ్రతం రోజు తీసి పూర్ణాలు, బొబ్బట్లు చేసుకుంటే సరిపోతుంది.
కరకరలాడే "ఆలూ వడలు" - ఇన్‌స్టంట్‌గా చేసుకోవచ్చు - నూనె పీల్చకుండా వస్తాయి!
వరలక్ష్మీ వ్రతం వేళ కరకరలాడే " మినప మసాలా గారెలు" - నూనె పీల్చకుండా టేస్టీగా వస్తాయి!

