పెసరట్టు వేసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ! - ఇంట్లో ఈ పొడి ఉంటే చాలు - తినాలనిపించినప్పుడు వేడివేడిగా సిద్ధం!
-ఈ పొడితో ఎంతో సమయం ఆదా! - ఎప్పుడు తినాలనిపించినా ప్లేట్లో వేడివేడి పెసరట్టు రెడీ!

Published : June 2, 2025 at 1:24 PM IST
Pesarattu Premix Making Process : తెలుగువాళ్లకి ఇష్టమైన టిఫెన్లలో పెసరట్టు ముందుంటుంది. పెసరట్టు ఉప్మా కాంబినేషన్ ఎవర్గ్రీన్. వేడివేడి పెసరట్టులను నచ్చిన చట్నీతో తింటే దిల్ ఖుష్ అవ్వాల్సిందే. అయితే ఈ పెసరట్టు వేసుకోవాలంటే ముందురోజు రాత్రే పెసరపప్పు నానబెట్టి, మార్నాడు రుబ్బి దోశలుగా పోసుకోవాలి. ఇదంతా చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. అయితే ఇకపై ఆ అవసరం లేకుండా చాలా సింపుల్‌గా కేవలం నిమిషాల్లో పెసరట్టు వేసుకోవచ్చు. అందుకోసం మీకు టైమ్ ఉన్నప్పుడు ఈ ఒక్క పొడిని ప్రిపేర్ చేసుకుంటే చాలు. ఈ పొడిని ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారంటే కనీసం 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. దీనితో వేసుకునే పెసరట్టు రుచి కూడా చాలా బాగుంటుంది. మరి, ఈ ఇన్స్టంట్ పెసరట్టు మిక్స్‌కు కావాల్సిన పదార్థాలు, ప్రిపరేషన్ ఏంటో ఈ స్టోరీలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- పొట్టు పెసర్లు- 4 కప్పులు
- బియ్యం - అర కప్పు
- శొంఠి - 10 గ్రాములు
- మిరియాలు - ముప్పావు టేబుల్‌స్పూన్
- జీలకర్ర - 1 టేబుల్‌స్పూన్
- ఎండుమిర్చి - 4
- కరివేపాకు - గుప్పెడు
- ఇంగువ - 1 టీస్పూన్
- పసుపు - పావు టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం:
- ఓ గిన్నెలోకి పెసర్లు, బియ్యం వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, నీరు పోయేంతవరకు వడకట్టాలి.
- ఆ తర్వాత ఓ కాటన్ క్లాత్ మీద ఈ పెసర్లు వేసి పల్చగా అనుకుని ఫ్యాన్ కింద తడి ఆరేవరకు ఎండబెట్టాలి.
- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఎండబెట్టుకున్న పెసర్ల మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ లో ఫ్లేమ్‌లో కరకరలాడే వరకు వేయించుకోని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మిశ్రమం మొత్తం వేయించుకుని చల్లారనివ్వాలి.
- ఈలోపు అదే కడాయిలోకి శొంఠి, మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్‌లో మంచి వాసన వచ్చే వరకు వేయించి ఓ ప్లేట్లోకి తీసుకోవాలి.

- అలాగే ఇందులోకి కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును వేసి కలుపుతూ క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.
- శొంఠి మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీజార్‌లోకి వేసుకోవాలి. ఆపై అందులోకి ఇంగువ, పసుపు, ఉప్పు వేసి ఓ సారి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత వేయించిన పెసర్ల మిశ్రమం కొద్దిగా వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. మిగిలిన పెసర్ల మిశ్రమాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి.
- ఈ పొడి మొత్తం బాగా కలిసేలా కలుపుకుని చల్లారిన తర్వాత తడి, గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసుకుంటే పెసరట్టు ప్రీమిక్స్ రెడీ. ఈ పొడిని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే నెలల పాటు నిల్వ ఉంటుంది.

- ఈ పొడితో దోశలు ఎలా వేసుకోవాలంటే, ఓ గిన్నెలోకి ఒక కప్పు పెసరట్టు పొడిని తీసుకోవాలి.
- ఆ పొడిలోకి ఒక కప్పు నీటిని కొద్దికొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలిపి మూత పెట్టి ఓ అరగంట సేపు పక్కన పెట్టాలి.
- పిండి నానిన తర్వాత మరోసారి కలిపి నీళ్లు ఏమైనా తక్కువైతే మరికొన్ని పోసుకుని దోశలు పోసుకునేందుకు అనువుగా కలుపుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దోశ పెనం పెట్టి హీట్ చేసుకోవాలి. పెనం వేడెక్కిన తర్వాత రెండు చుక్కల ఆయిల్ వేసుకుని నీట్‌గా తుడిచేసి పిండిని పోసుకుని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి.

- ఆ తర్వాత లైట్‌గా ఆయిల్ అప్లై చేసి ఓ వైపు ఎర్రగా కాలనివ్వాలి. ఆ తర్వాత మరోవైపుకు తిప్పి ఇంకో నిమిషం కాల్చుకుని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మీకు కావాల్సినన్నీ అట్లు పోసుకుని నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే పెసరట్టు రెడీ. నచ్చితే మీరూ ఈ పొడిని ప్రిపేర్ చేసుకుని దోశలు పోసుకోండి.

చిట్కాలు:
- పెసర్లు కడిగిన తర్వాత నైట్ మొత్తం ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే ఉదయానికి మంచిగా ఆరిపోతాయి. ఒకవేళ అలా వద్దనుకుంటే ఉదయాన్నే కడిగి ఎండలో మూడు నాలుగు గంటలు పూర్తిగా తడి ఆరేలా ఎండబెట్టుకుంటే సరి.
- ఇవి ఎండిన తర్వాత లో ఫ్లేమ్‌లోనే కలుపుతూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టి వేయిస్తే పప్పు లోపలి వరకు ఉడకక పిండి తొందరగా పాడవుతుంది.
- దోశలు పోసుకునేటప్పుడు పిండిని కలిపి కనీసం అరగంట సేపు నానబెట్టాలి. వీలుంటే రెండు గంటలు నానబెట్టినా దోశలు సాఫ్ట్‌గా వస్తాయి.
- కావాలంటే పెసరట్టు మీద లైట్‌గా ఆనియన్స్, కారం పొడి వేసుకుని కూడా కారం పెసర దోశలు వేసుకోవచ్చు.
"సేమియా పూర్ణం బూరెలు" - శనగపప్పు, మినప్పప్పు అవసరం లేదు - మంచి షేప్‌తో రుచిగా వస్తాయి!
"చింతచిగురు నిల్వ పచ్చడి" - ఈ కొలతలు, టిప్స్ పాటిస్తే సంవత్సరం వరకు పాడవదు - రుచి సూపర్ అంతే!

