Delicious Sweet with Moong Dal : పోషకాలు పుష్కలంగా ఉండే పెసరపప్పుతో వివిధ రకాల వంటలు ప్రిపేర్ చేసుకుంటుంటాం. అందులో భాగంగానే ఎక్కువ మంది పెసరట్లు, కిచిడీ, పప్పుచారు వంటివి తయారు చేసుకుంటుంటారు. అయితే, అవి మాత్రమే కాదు పెసరపప్పుతో సింపుల్‌గా చేసుకునే ఒక కమ్మని "స్వీట్ రెసిపీ" ఉంది. బియ్యప్పిండి కలయికలో తయారయ్యే ఈ తీపి వంటకం సాఫ్ట్‌గా, జ్యూసీ జ్యూసీగా ఉండి నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతుంది. నోరూరించే ఈ వంటకం పిల్లలతో పాటు పెద్దల వరకు అందరికీ నచ్చేస్తుంది. మరి, ఈ సింపుల్ అండ్ సూపర్ టేస్టీ స్వీట్ కోసం కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

టిప్స్ :
- ఇక్కడ కొలతల కోసం పెసరపప్పు తీసుకున్న కప్పునే మిగతా ఇంగ్రీడియంట్స్ కొలవడానికి వాడుకోవాలి.
- ఈ రెసిపీలో మీరు కావాలనుకుంటే ఒకటిన్నర కప్పులు పాలనే తీసుకోవచ్చు.
- మీరు ఇక్కడ బియ్యప్పిండికి బదులుగా బొంబాయి రవ్వను అయినా వాడుకోవచ్చు.
- ఇక్కడ బియ్యప్పిండిని యాడ్ చేసుకున్నాక పిండి గట్టిగా అనిపిస్తే మళ్లీ ఉడికించుకోవాల్సిన అవసం లేదు. అలాకాకుండా స్టిక్కీగా ఉంటే మాత్రం కాసేపు కుక్ చేసుకోవాలి.
- అలాగే, పాకం అనేది మరీ పల్చగా ఉంటే స్వీట్స్ అనేవి అందులో వేసినప్పుడు మెత్తగా అయిపోతాయని గుర్తుంచుకోవాలి.
- పిండిలో నెయ్యి యాడ్ చేసుకోవడం ద్వారా స్వీట్‌కి మంచి టేస్ట్, ఫ్లేవర్ వస్తుంది.

కావాల్సిన పదార్థాలు :
- పెసరపప్పు - అర కప్పు
- పాలు - ఒక కప్పు
- బియ్యప్పిండి - అర కప్పు
- చక్కెర - ఒకటిన్నర కప్పులు
- యాలకులు - రెండు
- కుంకుమ పువ్వు - చిటికెడు
- యాలకుల పొడి - అరటీస్పూన్
- నూనె - వేయించడానికి సరిపడా
ఇడ్లీ పాత్రలో చేసుకునే కమ్మనైన "పాల తిన్నెలు" - ఈ పాతకాలపు స్వీట్ ఒక్కసారైనా టేస్ట్ చేయాల్సిందే!

తయారీ విధానం :
- ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ తయారీ కోసం ముందుగా కుక్కర్లో పెసరపప్పుని తీసుకొని లో ఫ్లేమ్‌లో మూడు నాలుగు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి.
- పెసరపప్పు చక్కగా వేగి కాస్త రంగు మారాక దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఒకట్రెండు సార్లు శుభ్రంగా కడగాలి.
- ఆపై దాన్ని మళ్లీ కుక్కర్లోకి తీసుకొని అందులో చిక్కటి పాలు, అర కప్పు నీళ్లు యాడ్ చేసుకొని కలిపి మూతపెట్టి రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.

- అనంతరం కుక్కర్లోని ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి పప్పు మెత్తగా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి.
- పప్పు చక్కగా ఉడికినట్లయితే దాన్ని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.
- తర్వాత ఈ పేస్ట్‌ని పెసరపప్పు ఉడికించిన కుక్కర్లోకి తీసుకోవాలి. ఆపై అందులో బియ్యప్పిండిని వేసుకొని మిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలిపితే చపాతీ ముద్ద కన్సిస్టెన్సీ రావాలి.
- అలాకాకుండా ఒకవేళ పిండి అనేది చేతి వేళ్లతో పట్టుకున్నప్పుడు లైట్‌గా స్టిక్ అవుతున్నట్లయితే మాత్రం మళ్లీ కుక్కర్‌ని స్టవ్ మీద ఉంచి సన్నని సెగ మీద రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి.
- చపాతీ ముద్ద కన్సిస్టెన్సీ వచ్చాక కుక్కర్‌ని దింపి పక్కనుంచి చల్లార్చుకోవాలి.

- అది చల్లారేలోపు పాకం ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద మరో పాన్ పెట్టుకొని చక్కెర, 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. అలాగే, అందులో కచ్చాపచ్చాగా దంచిన యాలకులు, కుంకుమ పువ్వు వేసి పంచదార కరిగే వరకు కలుపుతూ మరిగించుకోవాలి.
- చక్కెర పూర్తిగా కరిగి తర్వాత మరో ఐదారు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి.
- గులాబ్ జామూన్ పాకం మాదిరిగా దీని కోసం అలాంటి పాకాన్ని రెడీ చేసుకోవాలి. తీగ పాకం రావాల్సిన పనిలేదు కాస్త జిగురుగా, స్టిక్కీగా వస్తే సరిపోతుంది.
- సరైన కన్సిస్టెన్సీలో పాకం వచ్చాక మూత పెట్టి, స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

- ఇప్పుడు కుక్కర్లో చల్లారి గోరువెచ్చగా మారిన పెసరపప్పు మిశ్రమాన్ని తీసుకొని అందులో నెయ్యి, యాలకుల పొడి వేసి ఆ మిశ్రమం మొత్తాన్ని మెత్తని పిండి ముద్దలా వచ్చేలా ఒకసారి బాగా కలపాలి.
- అనంతరం చేతులకు కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో చిన్న నిమ్మకాయ సైజంత పరిమాణంలో తీసుకొని ముందు ఉండలా చేసుకోవాలి.
- ఆ తర్వాత అప్పం మాదిరిగా లైట్ వత్తి మధ్యలో చిటికెన వేలుతో వడలా అరభాగం వరకు హోల్ చేసుకోవాలి.

- ఆపై టూత్ పిక్ లేదా చెంచాతో స్టార్ డిజైన్ వచ్చేలా(ఫొటోలో చూపిస్తున్న విధంగా) వత్తుకోవాలి.
- అలా పిండి మొత్తాన్ని ఆ షేప్‌లో ఒక్కొక్కటిగా చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా నెమ్మదిగా పాన్‌లో సరిపడా వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి.
- అలా వేయించుకున్నాక వాటిని జాలి గరిటెతో తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోరువెచ్చని చక్కెర పాకంలో వేసి 20 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆలోపు మిగతావాటిని వేయించి పాకంలోకి తీసుకోవాలి.
- అలా అన్నింటిని పాకంలోకి తీసుకున్న అరగంట పాటు ఉంచి ఆపై సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, సూపర్ టేస్టీ అండ్ జ్యూసీగా ఉండే "పెసరపప్పు స్వీట్" రెడీ!

నోరూరించే పాతకాలపు కమ్మని స్వీట్ "నీరొత్తులు" - చుక్క నూనె, నెయ్యి, మైదా పిండి అవసరం లేదు!
బియ్యప్పిండితో "బెల్లం గవ్వలు" - పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు - వారం రోజులు నిల్వ!