ఇడ్లీ, దోశల్లోకి రుచికరమైన "కొబ్బరి చట్నీ" - ఇలా చేస్తే పక్కా హోటల్ టేస్ట్!
- పర్ఫెక్ట్ కొలతలతో 'కొబ్బరి చట్నీ' - అన్ని టిఫెన్స్లోకి అద్దిరిపోతుంది!

Published : September 1, 2025 at 11:52 AM IST
Perfect Kobbari Chutney Recipe : మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంత రుచికరమైన టిఫెన్ చేసుకున్నా అందులోకి సరైన చట్నీ ఉన్నప్పుడే సంతృప్తిగా తిన్నామన్నా ఫీలింగ్ కలుగుతుంది. ఈ క్రమంలోనే ఎక్కువ మంది చేసుకునే వాటిల్లో పల్లీ చట్నీతో పాటు కొబ్బరి చట్నీ ముందు వరుసలో ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన రెసిపీనే అయినా కొన్నిసార్లు అంత రుచికరంగా రాదు. అలాంటి వారు ఓసారి ఈ కొలతలతో "కొబ్బరి చట్నీని" చేసి చూడండి. పైగా గణేశ్ నవరాత్రులు కొనసాగుతున్న వేళ ఇంట్లో పూజకు వినియోగించిన కొబ్బరి చిప్పలు మిగిలిపోయి ఉంటాయి. వాటితో ఇలా మార్నింగ్ టిఫెన్స్లోకి ఓసారి చట్నీని చేయండి. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, వడ, బోండా, ఊతప్పం ఇలా ఏ టిఫెన్లోకైనా చాలా రుచికరంగా ఉంటుంది. పైగా దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ! మరి, లేట్ చేయకుండా పర్ఫెక్ట్ రుచితో నోరూరించే ఈ కొబ్బరి చట్నీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

అవసరమైన ఇంగ్రీడియంట్స్ :
- కొబ్బరి ముక్కలు - రెండు చిన్న కప్పులు
- నూనె - రెండు టేబుల్‌స్పూన్లు
- పచ్చిమిర్చి - 12(తగినన్ని)
- ఎండుమిర్చి - నాలుగు
- చిన్న సైజ్ ఉల్లిపాయలు - రెండు
- పుట్నాల పప్పు - నాలుగు టేబుల్‌స్పూన్లు
- జీడిపప్పు పలుకులు - 15 నుంచి 20
- చింతపండు - కొద్దిగా
అన్నం వార్చిన గంజితో సూపర్ టేస్టీ "అట్లు" - అప్పటికప్పుడు నిమిషాల్లోనే చేసుకోవచ్చు!

తయారీ విధానం :
- ఈ చట్నీ తయారీ కోసం ముందుగా ప్రధాన ఇంగ్రీడియంట్ అయిన పచ్చికొబ్బరిని రెండు చిన్న కప్పుల పరిమాణంలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి.
- అలాగే, ముందుగానే ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ లైట్‌గా హీట్ అయ్యాక పచ్చిమిర్చిలను ముక్కలుగా తుంపి వేసుకోవాలి.
- అలాగే, అందులోనే ఎండుమిర్చిని కూడా వేసి కాసేపు కలుపుతూ వేయించాలి. అవి కొద్దిగా వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ ముక్కలు జత చేసి లో ఫ్లేమ్‌లో ఆనియన్స్ కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి.

- ఉల్లిపాయలు చక్కగా వేగి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయనుకున్నాక పుట్నాల పప్పుని వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆపై ఆ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
- అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారిన పచ్చిమిర్చి మిశ్రమం, ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నని పచ్చికొబ్బరి ముక్కలు, జీడిపప్పు పలుకులు, రుచికి తగినంత ఉప్పు, రెండు రెక్కల చింతపండు వేసుకొని ముందుగా వాటర్ లేకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత తగినన్ని నీళ్లను పోసుకొని ఒకసారి కలిపి మరోసారి మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి. ఆపై దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచాలి. ఇప్పుడు అందులోకి పోపుని రెడీ చేసుకోవాలి.
అచ్చం టిఫెన్ సెంటర్ రుచితో "బోండాలు" - మైదా, వంటసోడా లేకుండానే!

పోపు కోసం :
- నూనె - ఒకట్రెండు టేబుల్‌స్పూన్లు
- పోపు దినుసులు - రెండు టీస్పూన్లు
- ఎండుమిర్చి - నాలుగు
- వెల్లుల్లి రెబ్బలు - నాలుగు
- కరివేపాకు - కొద్దిగా

- తాలింపు తయారీకి స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని నూనె వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని వేయించాలి.
- అవి లైట్‌గా వేగాక ఎండుమిర్చి ముక్కలు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి పోపుని చక్కగా వేయించి స్టవ్ కట్టేయాలి.
- అనంతరం ఆ తాలింపుని ముందుగా రెడీ చేసుకున్న పచ్చడిలో వేసుకొని మిక్స్ చేసుకుంటే చాలు. అంతే, పర్ఫెక్ట్ రుచితో నోరూరించే "కొబ్బరి చట్నీ" రెడీ అవుతుంది!
చిట్కాలు :
- ఈ చట్నీలో ఉల్లిపాయలు వేసుకోవడం ద్వారా రెసిపీకి అదనపు రుచి వస్తుంది. అలాగే, ఆనియన్స్ మంచిగా వేయించుకోవాలి.
- జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకోవడం కూడా కొబ్బరి చట్నీకి సూపర్ టేస్ట్‌ని తీసుకొస్తుంది.
దుకాణంలో దొరికే బ్రెడ్‌తో "కమ్మని పూరీలు" - నూనె పీల్చకుండానే పొంగుతాయి!

