Palak Pakodi Recipe in Telugu : స్నాక్స్ అనగానే ఎక్కువ మందికి వెంటనే గుర్తుకొచ్చేది అప్పటికప్పుడు చేసుకునే ఉల్లిపాయ పకోడీ. స్వీట్ షాపుల్లో ఉల్లిపాయ పకోడీతో పాటు పాలకూర పకోడీ కూడా నోరూరిస్తుంది. కాస్త వాము, ధనియాలు వేసి చేసే పాలకూర పకోడీ రుచి ఎంతో ఆకట్టుకుంటుంది. స్వీట్ షాపుల్లో మాదిరి రుచి రావాలంటే సరిగ్గా ఇదే పద్ధతిలో చేసుకుంటే సరిపోతుంది. ఈ రోజు క్రిస్పీ పాలకూర పకోడీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
మీరెపుడైనా "బంగాళాదుంపల కర్రీ" ఇలా చేశారా? - అన్నం మొత్తం తినేసి వేళ్లు నాకేస్తారు!

కావల్సిన పదార్థాలు :
- పాలకూర - పెద్ద కట్ట
- ఉల్లిగడ్డలు - 2
- అల్లం - 1 ఇంచు
- పచ్చిమిర్చి - 2
- వాము - 1 టీ స్పూన్
- ధనియాలు - 1 టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - చిటికెడు
- కారం - 1 టీ స్పూన్
- ఇంగువ - అర టీ స్పూన్
- బియ్యం పిండి - పావు కప్పు
- శనగపిండి - 1 కప్పు
- వేడి నూనె - 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం :
- పాలకూర పకోడీ తయారీ కోసం ముందుగా పాలకూర తరిగి పెట్టుకోవాలి. పిండి కలపడానికి వీలుగా వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. అందులో తరిగిన పాలకూర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చితో పాటు వాము, ధనియాలు, ఉప్పు, పసుపు, కారం, ఇంగువ, బియ్యప్పిండి, శనగపిండి వేసి అంతా ఒకసారి బాగా కలపాలి.

- ఆ తర్వాత పిండి మిశ్రమంలోకి వేడి నూనె పోసుకుని మరోసారి స్పూన్‌తో కలుపుకోవాలి. చివరగా కొద్దిగా నీళ్లు చిలకరించుకుని వేడి నూనె పోసి పిండిని మరోసారి కలపాలి

- ఇపుడు ఒక కడాయిలో పకోడీ వేయించడానికి సరిపడా నూనె పోసి మంట హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. పిండి ముద్ద చేతుల్లోకి తీసుకుని చిన్న చిన్నగా పకోడీలు వేసుకోవాలి. పకోడీ లోపలి వరకు వేగేలా వెంటనే మంట తగ్గించి పెట్టుకోవాలి. పకోడీలు రంగు మారే వరకు వేయించుకుని పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత వాయి కోసం మంట పెంచుకుని నూనె వేడెక్కగానే పకోడీలు వేసుకోవాలి. ఇలా వేయించిన పకోడీలను టమోటా కెచప్ లేదా కొత్తిమీర, పుదీనా చట్నీలోకి తింటే చాలాబాగుంటుంది. ఎలాంటి చట్నీ లేకుండా కూడా పాలకూర పకోడీ తినేయొచ్చు.

మృదువైన "రాగి ఇడ్లీలు" - ఈ టిప్స్, కొలతలు పాటిస్తూ చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి!
మనం మర్చిపోయిన "దేశీ కూరగాయ" - ఈ కర్రీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!