కరకరలాడే "పాలకూర సగ్గుబియ్యం వడలు" - తక్కువ నూనెతో ఎక్కువ రుచి!
- ఆకుకూరలు, సగ్గుబియ్యం కాంబోలో సూపర్ స్నాక్ - పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు!

Published : August 25, 2025 at 1:54 PM IST
Palak Sabudana Vada Recipe : ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, పోషకాలు పుష్కలంగా ఉండే ఆకుకూరల్లో ఒకటైన పాలకూర, మెంతికూరను కొంతమంది తినడానికి ఇష్టపడరు. పిల్లలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. అలాంటి వారూ ఇష్టంగా తినేలా సింపుల్‌గా చేసుకునే ఒక సూపర్ స్నాక్ రెసిపీ ఉంది. అదే, నోరూరించే "సగ్గుబియ్యం పాలకూర వడలు". కొన్నిచోట్ల వీటినే గారెలు అని కూడా పిలుస్తుంటారు. ఇవి రెగ్యులర్‌గా చేసుకునే స్నాక్ రెసిపీలకు మించిన టేస్ట్‌తో భలే కమ్మగా ఉంటాయి. ఆకుకూరలు, సబుదానా, పల్లీల కాంబినేషన్లో రెడీ అయ్యే ఈ వడలను పిల్లలైతే ఒకటికి రెండు ఇష్టంగా తింటారు. అలాగే, ఇవి నూనెను కూడా తక్కువగానే పీల్చుకుంటాయి! మరి, ఈ రుచికరమైన పాలకూర వడలను ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
అవసరమైన పదార్థాలు :
- పెద్ద సగ్గుబియ్యం - ఒక కప్పు
- బంగాళదుంపలు - రెండు(పెద్ద సైజ్‌వి)
- జీలకర్ర - ఒక చెంచా
- పల్లీల పొడి - అర కప్పు
- బియ్యప్పిండి - రెండు టేబుల్‌స్పూన్లు
- అల్లం - చిన్న ముక్క
- ఉప్పు - రుచికి తగినంత
- పాలకూర తరుగు - అర కప్పు
- కొత్తిమీర తరుగు - పావు కప్పు
- మెంతికూర తరుగు - పావు కప్పు
- పుదీనా - పావు కప్పు
- పచ్చిమిర్చి - మూడ్నాలుగు
- నూనె - వేయించడానికి తగినంత
వినాయకుడికి ఇష్టమైన "పాల తాలికలు" - పాలు, తాలికలు విరగకుండా కమ్మగా!

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో ఆలుగడ్డలు, తగినన్ని వాటర్ పోసుకొని సాఫ్ట్‌గా ఉడికించుకోవాలి. అవి చక్కగా ఉడికిన తర్వాత పొట్టు తీసి మెత్తని ముద్దలా మాష్ చేసుకోవాలి.
- అవి ఉడికేలోపు ఒక చిన్న గిన్నెలో సగ్గుబియ్యం, కప్పు వాటర్ తీసుకొని నానబెట్టుకోవాలి.
- ఇవి నానేలోపు రెసిపీలోకి అవసరమైన పరిమాణంలో పాలకూర, మెంతికూర, పుదీనా, కొత్తిమీర తరుగుని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు పల్లీల పొడిని సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద పాన్‌లో పల్లీలను వేసి చక్కగా వేయించాలి. అవి వేగాక పొట్టు తొలగించుకొని మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచాలి.
గణపతి మెచ్చే "బెల్లం ఉండ్రాళ్లు" - తక్కువ పదార్థాలతోనే రుచికరంగా!

- అనంతరం అదే మిక్సీ జార్లో ముందుగా తరిగి పెట్టుకున్న పాలకూర, మెంతికూర తరుగు, పుదీనా, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వేసుకొని కచ్చాపచ్చాగా, పేస్ట్ మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి. ఆపై దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి.
- తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న పాలకూర మిశ్రమంలో ముందుగా ఉడికించి మాష్ చేసుకున్న బంగాళదుంపల ముద్ద, నానబెట్టుకున్న సగ్గుబియ్యం, బియ్యప్పిండి, జీలకర్ర, ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి, రుచికి తగినంత ఉప్పు ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
- ఇక్కడ, పిండి మిశ్రమం అనేది మరీ లూజుగా కాకుండా గారెలు లేదా వడలకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి.

- అనంతరం స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేయించడానికి తగినంత పోసుకొని వేడి చేసుకోవాలి.
- ఆయిల్ వేడయ్యాక చేతికి కాస్త నూనె రాసుకుంటూ ముందుగా కలిపి పెట్టిన పిండి మిశ్రమంలో నుంచి కొద్దికొద్దిగా పిండిని తీసుకుంటూ గారెలు/వడల్లా చేసుకుంటూ కాగుతున్న నూనెలో నెమ్మదిగా వేసుకోవాలి.
- పాన్‌లో వేయించడానికి సరిపడా వేసుకున్నాక స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఎర్రగా వేయించుకుని బయటకు తీసుకుంటే చాలు. అంతే, సగ్గుబియ్యం ఆకుకూరల కాంబినేషన్లో కమ్మగా కరకరలాడే "గారెలు/వడలు" మీ ముందు ఉంటాయి!


