Instant Poornam Boorelu Making Process : ఇంట్లో పూజలు, వ్రతాలు చేసేటప్పుడు నైవేద్యంగా ఎక్కువ మంది ప్రిపేర్ చేసుకునే స్వీట్ రెసిపీలలో ఒకటి పూర్ణం బూరెలు. అలాగే, పండగలు, శుభకార్యాల సమయంలోనూ వీటిని చేసుకుని ఇష్టంగా ఆరగిస్తుంటారు. కానీ, కొందరికి పూర్ణాలు పర్ఫెక్ట్గా చేయడం రాదు. కొన్నిసార్లు ట్రై చేసినా ఆయిల్లో వేసినప్పుడు పూర్ణం బయటకి రావడమో, సరైన టేస్ట్ రాకపోవడమో జరుగుతుంటుంది. అలాంటి వారికోసమే ఒక సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే, గోదారోళ్ల స్పెషల్ "ఇన్స్టంట్ పూర్ణం బూరెలు". వీటినే "పాల ముంజలు" అని కూడా పిలుస్తారు. పచ్చికొబ్బరి, బెల్లం, నెయ్యితో చేసే ఇవి గోదావరి జిల్లాల్లో చాలా ఫేమస్. రుచి కూడా చాలా బాగుంటాయి. ఈ టిప్స్ పాటిస్తూ చేశారంటే పూర్ణం బయటకు రాకుండా పర్ఫెక్ట్ టేస్ట్‌తో అదుర్స్ అనిపిస్తాయి. మరి, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
పూర్ణం కోసం తీసుకోవాల్సినవి :
- ముప్పావు కప్పు - బెల్లం తురుము
- రెండు కప్పులు - పచ్చికొబ్బరి తురుము
- యాలకులు - 2(దంచుకోవాలి)
- అరటీస్పూన్ - నెయ్యి

ఇన్స్టంట్ పూర్ణం బూరెలు తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా లోపలి స్టఫింగ్(పూర్ణాన్ని) ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం మొదటగా పచ్చికొబ్బరిని రెండు కప్పుల పరిమాణంలో సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద సాన్ పాన్ పెట్టి బెల్లం తురుము వేసుకోవాలి. ఆపై మూడు టేబుల్స్పూన్ల వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి.
- బెల్లం పూర్తిగా కరిగాక ఒకట్రెండు నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద మరో పాన్ పెట్టుకొని అందులో కరిగిన బెల్లం సిరప్‌ని వడకట్టి పోసుకోవాలి. ఆపై మీడియం ఫ్లేమ్ మీద ముదురు తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకునేటప్పుడు మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
- బెల్లం సిరప్ దగ్గర పడి, ముదురు తీగ పాకం వచ్చిందనుకున్నాక అందులో ముందుగా రెడీ చేసుకున్న పచ్చికొబ్బరి తురుముని వేసుకొని పాకంలో చక్కగా కలిసేలా కలుపుకోవాలి.
- ఆ మిశ్రమంలోని వాటర్ ఇగిరిపోయి పూర్ణం దగ్గర పడి అంటే లడ్డూ చేయడానికి వీలుగా వచ్చే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇందుకోసం కనీసం 10 నిమిషాలైనా టైమ్ పట్టొచ్చు.
- ఆ తర్వాత అందులో యాలకుల పొడి, నెయ్యి వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలపాలి.
- పూర్ణం మిశ్రమం చక్కగా ఉడికినట్లు ఎలా తెలుసుకోవాలంటే చేతితో కొద్దిగా తీసుకొని ప్రెస్ చేస్తే గట్టిగా, లడ్డూలా రావాలి.
- ఆవిధంగా వచ్చాక స్టవ్ చేసుకొని స్టఫింగ్‌ని కొద్దిగా చల్లార్చుకోవాలి. అది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతిలోకి కొద్దికొద్దిగా పూర్ణాన్ని తీసుకుంటూ మీకు కావాల్సిన సైజ్‌లో చిన్న చిన్న బాల్స్ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో ఉంచాలి.
- ఇప్పుడు ఇన్స్టంట్ పూర్ణం బూరెలకు(పాల ముంజలు) కావాల్సిన పై పిండిని ప్రిపేర్ చేసుకోవాలి.
బొప్పాయిని నేరుగా తినడమే కాదు - ఇలా "లడ్డూలు" చేసుకోండి! - ఒకటి తింటే వాటి ప్రేమలో పడిపోవాల్సిందే!
పిండి తయారీ కోసం :
- ఒక కప్పు - పాలు
- రెండు టీస్పూన్లు - పంచదార
- ఒక కప్పు - బొంబాయి రవ్వ
- నెయ్యి - అరటీస్పూన్
- ఇందుకోసం స్టవ్ మీద ఒక గిన్నెలో పాలు, ఒకటిన్నర కప్పుల వాటర్ పోసి మధ్యమధ్యలో కలుపుతూ ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి.
- ఆ తర్వాత అందులో పంచదార వేసి కలిపి లో ఫ్లేమ్‌లో స్టవ్‌ను అడ్జస్ట్ చేసి బొంబాయి రవ్వను కొద్దికొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి.
- ఆపై రెండు చిటికెళ్ల ఉప్పు, కొద్దిగా యాలకుల పొడి, నెయ్యి వేసి స్పూన్‌తో మాష్ చేస్తూ మొత్తం కలిసేలా బాగా కలపాలి. ఇలా చేయడం ద్వారా పాలముంజలు నూనెలో వేసినప్పుడు పగలకుండా చక్కగా వస్తాయి.
- ఆ తర్వాత కాసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి మూతపెట్టి ఆ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి.
- అది కాస్త చల్లారిన తర్వాత మూత తీసి గరిటెతో మాష్ చేస్తూ రెండు నిమిషాల పాటు స్మూత్ టెక్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి.
- పిండి మిశ్రమం చల్లారాక చేతులకు నెయ్యి అప్లై చేసుకొని పెద్ద సైజ్ నిమ్మకాయ మాదిరిగా ఉండలుగా చేసుకోవాలి. అంటే, పిండి ఉండ పూర్ణం ఉండ కంటే డబుల్ ఉండాలి.

- అనంతరం ఒక ఉండను చేతిలోకి తీసుకొని చిన్న అప్పం మాదిరిగా చేసుకోవాలి. ఆపై దానిమీద ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణం ఉండ పెట్టి నెమ్మదిగా క్లోజ్ చేయాలి. పూర్తిగా క్లోజ్ చేశాక ఒకసారి రౌండ్ షేప్ వచ్చేలా చేతితో నెమ్మదిగా రోల్ చేసుకోవాలి. మిగిలిన పిండిని ఇదేవిధంగా ప్రిపేర్ చేసుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు స్టవ్‌పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసి ముందుగా ప్రిపేర్ చేసిన పూర్ణాలు వేసి నిమిషం పాటు కదపకుండా అలా వదిలేయాలి.
- ఆ తర్వాత మధ్యమధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నిదానంగా తిప్పుతూ వేయించుకోవాలి.
- ఆవిధంగా వేయించుకున్నాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, సూపర్ టేస్టీగా ఉండే గోదారోళ్ల స్పెషల్ "పూర్ణం బూరెలు(పాల ముంజలు)" రెడీ!
- ఇవి వేడిగా తిన్నప్పుడు పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండి తింటుంటే ఎంతో రుచికరంగా అనిపిస్తాయి.

టిప్స్ :
- ఇక్కడ స్టఫింగ్ కోసం కొబ్బరి పూర్ణాన్ని ప్రిపేర్ చేస్తున్నాం. అదే, ఒకవేళ మీరు కావాలనుకుంటే శనగపప్పు లేదా పెసరపప్పుతో చేసినా పూర్ణాన్ని అయినా వాడుకోవచ్చు.
- పూర్ణం తయారీలో నెయ్యి వేయడం మంచి ఫ్లేవర్‌ని ఇస్తుంది. ఒకవేళ మీరు వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు.
- పై పిండి అనేది మరీ లూజ్‌గా, గట్టిగా కాకుండా మీడియం సాఫ్ట్నెస్తో ఉండాలి. పూర్ణం ఉండ సైజ్ కంటే పిండి ఉండ పరిమాణం రెట్టింపుగా ఉండాలి.