How to Make Pachimirchi Pachadi: కూర, పప్పు, రసం, పులిహోర- ఇలా ఎందులోకైనా పచ్చిమిర్చి ఉండాల్సిందే. అంతేకాకుండా ఇడ్లీ, దోశ, వడ వంటి బ్రేక్‌ఫాస్ట్‌కు కాంబినేషన్‌గా పచ్చిమిర్చితో చేసిన పల్లీ చట్నీ కంపల్సరీ. అందుకే మార్కెట్ల్కు వెళ్లినప్పుడు మెజార్టీ జనాలు ఎక్కువ మొత్తంలో వీటిని తీసుకొచ్చి యూజ్ చేస్తుంటారు. అయితే పచ్చిమిర్చిని ఎప్పుడూ ఉపయోగించే విధంగా కాకుండా ఓసారి ఇలా పచ్చడి చేయండి. అద్దిరిపోతుంది.
ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ పచ్చడి చేసుకుంటే ఎంతో తృప్తిగా తినచ్చు. పైగా దీనిని తయారు చేయడానికి ఎక్కువ టైమ్ కూడా పట్టదు. కేవలం ఇంట్లో లభించే పదార్థాలతోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో కొద్దిగా పచ్చడి, నెయ్యి వేసుకుని ఒక్క ముద్ద తిన్నా మైమరచిపోవాల్సిందే. మరి లేట్ చేయకుండా ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:
- చింతపండు - నిమ్మకాయ సైజ్
- పచ్చిమిర్చి - 200 గ్రాములు
- నూనె - 2 టీ స్పూన్లు
- మెంతులు - అర టీ స్పూన్లు
- ధనియాలు - 2 టీ స్పూన్లు
- జీలకర్ర - అర టీ స్పూన్
- నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు
- వెల్లుల్లి రెబ్బలు - 5
- ఉప్పు - రుచికి సరిపడా
- ఉల్లిపాయ - 1

తాలింపు కోసం:
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - అర టీ స్పూన్
- జీలకర్ర - అర టీ స్పూన్
- మినప్పప్పు - అర టీ స్పూన్
- పచ్చిశనగపప్పు - అర టీ స్పూన్
- ఇంగువ - పావు టీ స్పూన్
- ఎండుమిర్చి - 2
- కరివేపాకు - 2 రెమ్మలు
- పసుపు - పావు టీ స్పూన్
తయారీ విధానం:
- ఓ బౌల్లోకి చింతపండు తీసుకుని మునిగేంతవరకు నీళ్లు పోసి నాననివ్వాలి.
- ఈ లోపు పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా తుడిచి తొడమలు తీసేసి సగానికి కట్ చేసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత మెంతులు వేసి ఎర్రగా వేయించుకోవాలి.
- అవి వేగిన తర్వాత జీలకర్ర, ధనియాలు, నువ్వులు వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించాలి.
- ఈ దినుసులు వేగిన అనంతరం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో మధ్యమధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి.
- పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. అనంతరం మిక్సీజార్‌లోకి పచ్చిమిర్చి మిశ్రమం వేసుకోవాలి.

- అందులోకి నానబెట్టిన చింతపండు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఓసారి పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచాలి.
- తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి చిటపటలాడించాలి.
- ఆ తర్వాత ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమం వేసి కలుపుకోవాలి.
- తాలింపులో పచ్చడిని బాగా కలుపుకున్న తర్వాత ఓ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ పచ్చమిర్చి పచ్చడి రెడీ.

చిట్కాలు:
- లైట్ గ్రీన్ కలర్ ఉండి లావుగా ఉండే పచ్చిమిర్చి అయితే పచ్చడికి బాగుంటాయి. సన్నగా ఉండి గ్రీన్ కలర్‌వి అయితే కారం ఎక్కువ ఉంటుంది.
- నూనెలో మెంతులు ఎర్రగా వేయించుకోవాలి. అవి సరిగా వేగకపోతే పచ్చడి చేదు వచ్చే అవకాశం ఉంటుంది.
- పచ్చడి మరింత రుచికరంగా ఉండాలంటే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు.
"వంకాయ తక్కాళి" రోటి పచ్చడి - ఒక్కసారి తింటే మీ ఫేవరెట్ లిస్టులో చేరిపోతుంది!
పాల్వంచ టిఫెన్ సెంటర్ "పల్లీ చట్నీ" - చట్నీ కోసమే అక్కడ టిఫెన్ తింటారు! - ఇలా ప్రిపేర్ చేసుకోండి!