IPL Betting : మండుటెండల్లో సాయంత్రానికల్లా ప్రారంభమయ్యే ఐపీఎల్ మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాయి. మొబైళ్లలో అరచేతిలో వీక్షించే అవకాశం ఉండడంతో క్రీడాభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నారు. బంతి బంతికీ గెలుపు ఓటములు ఊగిసలాడుతూ ఉత్కంఠ రేపుతున్న ఈ వినోదం వెనుక మరో బెట్టింగ్ విష క్రీడ పొంచి ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
"భార్య పక్కనే ఉన్నా అదే ధ్యాస!" - మానవ సంబంధాలను దెబ్బతీస్తున్న "ఫబ్బింగ్"
శ్రీకాకుళం టు చిత్తూరు
శ్రీకాకుళం మొదలుకుని చిత్తూరు వరకు, గుంటూరు, విజయవాడల్లోనూ క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. శ్రీకాకుళం నగరం ఇందిరానగర్ కాలనీలోని ఓ యువకుడి ఇంట్లో నిత్యం క్రికెట్ బెట్టింగ్ జరుగుతుండగా ఎవరికీ అనుమానం రాకుండా మరికొందరు సెల్‌ఫోన్లలో ఆడుతున్నారు. కొందరు పందెంరాయుళ్లు అదే ఇంట్లోనే తిష్ఠ వేయగా గార వీధిలోనూ కొందరు ఇదే పంథా అనుసరిస్తున్నారు. ఎల్‌బీఎస్ కాలనీలో ఓ ఇంట్లో కొందరు బెట్టింగ్ లైవ్ నిర్వహిస్తూ బుకీలుగా వ్యవహరిస్తున్నారు.
బెట్టింగ్ వ్యసనం చాలా మందిని అప్పుల పాలు చేస్తూ యువకుల భవిష్యత్తు నాశనం చేస్తోంది. కొందరు ఆస్తులు విక్రయిస్తుండగా, కుటుంబ సభ్యుల నుంచి విడిపోయి మరికొందరు వ్యసనాలకు బానిసవుతున్నారు. కొంతమంది ఏకంగా ఊరు వదిలి వెళ్లిపోతుండాగా సొమ్ము పోగొట్టుకున్న వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
సీరియస్‌గా తీసుకోండి
IPL మ్యాచ్‌ల నేపథ్యంలో నెట్టింట ఓ వీడియో వైరల్‌గా మారింది. పొలంలో పనిచేసుకుంటున్న తండ్రి దగ్గరికి వచ్చిన కొడుకు "నాన్నా నీకు ఇంక ఈ శ్రమ అవసరం లేదు" అని అంటాడు. దాంతో ఆ తండ్రి కొడుకును ఉద్దేశించి 'ఏరా, ఏదైనా జాబ్ సంపాదించావా?' అని అడుగుతాడు. దాంతో ఆ కొడుకు 'ఐపీఎల్ బెట్టింగ్ పెట్టా నాన్నా, ఉన్న పొలం కూడా రాసిచ్చేసా' అని చెప్పడంతో షాక్ అవ్వడం తండ్రి వంతు అవుతుంది. ఇది కామెడీగా ఉన్నా సీరియస్‌గా తీసుకోవాలని పోలీసులు చెప్తున్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల నమోదైన కేసులను ఉదహరిస్తున్నారు.
బెట్టింగ్ వ్యసనానికి బానిసైన యువకుల్ని ఎంచుకుంటున్న బుకీలు వారిని సంప్రదించి రెచ్చగొడుతున్నారు. ఓడిపోతే ఆస్తులు, ప్రామిసరీ నోట్లు రాయించుకుంటున్నారని, ఇతర జిల్లాలకు చెందిన బుకీలతో చేతులు కలిపి ముఠాలు ఏర్పాటు చేసుకుని ఆడిస్తున్నారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పాత బుకీలపై నిఘా ఉన్న నేపథ్యంలో కొత్త వారిని రంగంలోకి దించుతున్నారు. పోలీసులు కొత్త వ్యక్తుల సమాచారం సేకరించేలోగా స్థావరాలు మార్చుతూ దందా సాగిస్తున్నాన్నారు. బెట్టింగ్ సమాచారం ఉంటే 112 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం పంచుకోవాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. - ఎస్పీ, కేవీ మహేశ్వర్‌రెడ్డి
ఆస్తి పత్రాలు, కార్లు
శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖులు కొందరు యాప్‌ల్లో బెట్టింగ్ ఆడుతున్నారని పోలీసులు వెల్లడిస్తున్నారు. చిక్కకుండా రహస్య స్థలాల్లో బెట్టింగ్ సాగిస్తూ రూ.లక్షల్లో పందేలు కాస్తున్నట్లుగా తెలుస్తోంది. బంతి బంతికీ కొంత మొత్తం ముందుగానే డిపాజిట్ చేసి ప్రతి ఓవర్‌కు ఎన్ని పరుగులు చేస్తారు? ఎంత స్కోర్ సాధిస్తారనే విషయాలపై బెట్టింగ్ కొనసాగిస్తున్నారు. ఆట ముగిసిన మరుసటి రోజు గెలిచిన వారికి నగదు ఇవ్వలేకపోతే బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇంటి పత్రాలు స్వాధీనం చేసుకుంటున్నారు.
ఈటింగ్, ప్లేయింగ్
పోలీసులకు చిక్కకుండా బెట్టింగ్ రాయుళ్లు కోడ్ భాషను ఉపయోగిస్తున్నారు. గెలిచే అవకాశం ఉన్న జట్టుపై బెట్టింగ్ కాస్తే ఈటింగ్ అని, గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న జట్టును ప్లేయింగ్ అని అంటున్నారు. బుకీల వద్ద నమోదు చేసుకున్న నంబరు నుంచి మాత్రమే ఫోన్ చేయాల్సి ఉంటుంది. లావాదేవీలన్నీ నేరుగా కాకుండా మధ్యవర్తుల ద్వారా నిర్వహిస్తూ ఏ మాత్రం అనుమానం వచ్చినా ఫోన్ నంబరు మార్చేస్తున్నారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా బంతి బంతికీ బెట్టింగ్ కొనసాగుతోంది.
"షుగర్ పేషెంట్లు రాత్రిళ్లు ఇవి తిని చూడండి - ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు చక్కని నిద్ర"
ఆరుబయట పండ్లరసాలు తాగితే గొంతు నొప్పిగా ఉంటోందా? - అయితే, "అదే కారణం" కావచ్చంటున్న వైద్యులు!