ETV Bharat / offbeat

పక్కా కొలతలతో "ఉల్లిపాయ నిల్వ పచ్చడి" - ఇలా పెడితే టేస్ట్​ అదుర్స్​ - ఆరు నెలలు నిల్వ!

-టమాటా, మామిడికాయ నిల్వ పచ్చళ్లు రొటీన్​ -ఇలా ఉల్లిపాయతో పెడితే రుచి అదుర్స్​

How to Make Onion Nilva Pachadi
How to Make Onion Nilva Pachadi (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 2, 2025 at 9:10 AM IST

3 Min Read
Choose ETV Bharat

How to Make Onion Nilva Pachadi: ఉల్లిపాయ ప్రతీ వంటగదిలో ఉండే పదార్థం. కూర ఏదైనా ఉల్లి పడితే ఆ రుచే వేరు. అందుకే మార్కెట్​ వెళ్లినప్పుడు కేజీల కొద్దీ వీటిని తీసుకొస్తుంటారు. ఇక ఉల్లిపాయలను అన్ని కూరల్లో వేస్తాము కానీ ప్రత్యేకించి వంటలు అనగానే చాలా మందికి పకోడి, పచ్చడి, ఫ్రై అంటూ గుర్తుకువస్తాయి. అయితే ఇవి మాత్రమే కాకుండా ఉల్లితో నిల్వ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. ఏంటీ నమ్మలేకున్నారా? నిజమేనండీ, ఆనియన్స్​తో అద్దిరిపోయే నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు. ఈ కొలతలతో పెడితే సుమారు 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యితో తింటే కిర్రాక్​. మరి లేట్​ చేయకుండా ఈ పచ్చడి ఎలా ప్రిపేర్​ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

  • ఉల్లిపాయలు - అర కేజీ
  • చింతపండు - 50 గ్రాములు
  • మెంతులు - అర టీ స్పూన్​
  • ఆవాలు - 1 టేబుల్​ స్పూన్​
  • నూనె - 2 టేబుల్​ స్పూన్లు
  • పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు - పావు కప్పు(25 గ్రాములు)
  • కారం - 50 గ్రాములు
  • ఉప్పు - 40 గ్రాములు

తాలింపు కోసం:

  • నువ్వుల నూనె - ముప్పావు కప్పు
  • పచ్చి శనగపప్పు - 1 టీ స్పూన్​
  • మినపప్పు - 1 టీ స్పూన్​
  • ఆవాలు - 1 టీ స్పూన్​
  • ఎండు మిర్చి - 4
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • ఇంగువ - పావు టీ స్పూన్​
  • పసుపు - పావు టీ స్పూన్​

తయారీ విధానం:

  • ముందుగా ఉల్లిపాయలు పొట్టు తీసి రెండు వైపులా చివర్లు కట్​ చేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి.
  • ఉల్లిపాయలు ఆరిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్​ చేసుకుని పక్కన పెట్టాలి. చింతపండును పిక్కలు, పీచు, గింజలు లేకుండా శుభ్రంగా చేసి ఉంచాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి మెంతులు వేసి దోరగా వేయించాలి. మెంతులు వేగుతున్నప్పుడు ఆవాలు కూడా వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించి ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు అదే పాన్​లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేయాలి. మీడియం ఫ్లేమ్​లో ఉల్లిపాయ ముక్కలు కలుపుతూ వేయించాలి.
  • ఉల్లిపాయలు మంచిగా వేగి లైట్​ గోల్డెన్​ కలర్​లోకి మారిన తర్వాత చింతపండు వేసి మరో 5 నిమిషాలు వేయించి స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • ఈలోపు ముందే వేయించుకున్న ఆవాలు, మెంతులను చిన్న మిక్సీ జార్​లో వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
  • ఉల్లిపాయ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత పెద్ద మిక్సీజార్​ తీసుకుని ఉల్లి, చింతపండు మిశ్రమం, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఓసారి గ్రైండ్​ చేయాలి.
  • ఇప్పుడు ఇందులోకి కారం, ఉప్పు, ఆవాలు మెంతి పిండి వేసి కలిపి మూత పెట్టి పదార్థాలన్నీ కలిసే విధంగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఈ స్టేజ్​లో ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్​ చేసి, ఏమైనా తక్కువ అనిపిస్తే అడ్జస్ట్​ చేసుకోవచ్చు.
  • ఈ పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి. అందుకోసం స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నువ్వుల నూనె పోసుకోవాలి. ఈ నూనె ప్లేస్​లో మీరు పల్లీ నూనె కూడా వాడుకోవచ్చు.
  • ఆయిల్​ కాగిన తర్వాత పచ్చి శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసి ఓ నిమిషం పాటు వేయించాలి. అనంతరం ఎండు మిర్చి, కరివేపాకు వేసి చిటపటలాడించాలి.
  • చివరగా పసుపు, ఇంగువ వేసి కలిపి మిక్సీ పట్టిన ఉల్లిపాయ పచ్చడి వేసి ఓ 5 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చడిని మగ్గించడం వల్ల ఉల్లిపాయలో ఇంకా ఏమైనా తేమ ఉంటే అది కూడా పోతుంది.
  • పచ్చడి మగ్గి నూనె పైకి తేలుతున్నప్పుడు స్టవ్​ ఆఫ్​ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన మిశ్రమాన్ని గాజు జార్​లోకి తీసుకుంటే సరి. ఎంతో రుచికరంగా ఉండే ఉల్లిపాయ నిల్వ పచ్చడి రెడీ.
  • ఈ పచ్చడిని బయట ఉంచితే నెల రోజులు, ఫ్రిజ్​లో పెడితే కనీసం ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది. నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి.

నెలల పాటు నిల్వ ఉండే "అల్లం పచ్చడి" - ఇలా చేస్తే టేస్ట్​ సూపర్​ - టిఫెన్స్​, అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్​!

కమ్మటి "గోంగూర పండుమిర్చి నిల్వ పచ్చడి" - ఈ లెక్కన పెడితే నిజంగా అమృతమే - ఏడాది నిల్వ!