Oil less vada : వడలు అంటే చక్కటి రంగు వచ్చేలా డీప్ ఫ్రై కావాలి. అప్పుడే వాటిని తింటూ ఉంటే మజా. కానీ, ఆ టేస్ట్ మాటున అనేక ప్రమాదకరమైన రోగాలు దాగి ఉంటాయి. ఆయిల్ కారణంగా ఓవైపు బ్యాడ్ కొలెస్ట్రాల్ ముప్పు పొంచి ఉండగా, మరోవైపు వాడిన నూనె మళ్లీ మళ్లీ వాడితే క్యాన్సర్ ముప్పు పెంచే ఫ్రీరాడికల్స్ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు ఎప్పట్నుంచో హెచ్చరిస్తున్నారు. దీంతో ఇష్టమైన వడలు తినకుండా ఉండలేక, ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందనే భయంతో కావాల్సినన్ని తినలేక ఫుడ్ లవర్స్ ఇబ్బంది పడుతుంటారు.
అందుకే మీకోసం అద్దిరిపోయే వడల రెసిపీ తీసుకొచ్చాం. వీటి స్పెషాలిటీ ఏమంటే చుక్క ఆయిల్ వాడకుండానే అద్దిరిపోయే వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని తినేయొచ్చు. మరి, ఈ టేస్టీ అండ్ హెల్దీ వడలను ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలేంటి? అన్నది ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- అటుకులు కప్పు
- అర కప్పు ఉప్మా రవ్వ
- అర కప్పు పెరుగు
- పెద్ద ఆనియన్ ఒకటి
- నాలుగు పచ్చి మిర్చీ
- కొత్తిమీర కట్ట
- కరివేపాకు 2 రెమ్మలు
- జీలకర్ర ఒక స్పూన్
- రుచికి తగినంత ఉప్పు

తయారీ విధానం :
- ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అటుకులు వేసుకొని, రెండు మూడు సార్లు చక్కగా క్లీన్ చేసుకోవాలి.
- తర్వాత నీళ్లు పూర్తిగా వంపుకొని బౌల్ మీద మూతపెట్టి, 5 నిమిషాల సేపు పక్కన పెట్టాలి.
- ఆ తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని అందులో అటుకులు (నీటి చుక్క లేకుండా) వేసేయండి.
- అందులోనే ఉప్మా రవ్వ, పెరుగు వేసి మిక్సీ పట్టండి. ప్రత్యేకంగా వాటర్ వేయకూడదు. చేత్తో ముద్దలా పట్టుకుంటే చేతికి అంటకుండా ఉండాలి.
- తర్వాత ఆనియన్ చాలా సన్నగా కట్ చేసుకొని ఆ మిశ్రమంలో వేసుకోవాలి.
- సన్నగా కట్ చేసుకున్న పచ్చి మిర్చీ, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి.
- అందులోనే జీలకర్ర, ఉప్పు వేసుకున్న తర్వాత చేత్తో చక్కగా కలుపుకోవాలి.
- ఇప్పుడు ఒక చిన్న బౌల్ లో నీళ్లు తీసుకొని, అందులో చేతిని తడుపుతూ ఆ మిశ్రమంలోంచి చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకోవాలి.
- చేతిలోనే గుండ్రంగా తయారు చేసి, ఆ తర్వాత అర చేతిలో ఉంచి వడ షేప్ మాదిరిగా వత్తుకోండి. చుట్టూ క్రాక్స్ లేకుండా చూసుకోండి. అన్నీ ఇదేవిధంగా తయారు చేసుకున్న తర్వాత కుక్ చేసుకోవాలి.
- ఇందుకోసం ఇడ్లీ పాత్ర తీసుకొని, అందులో గ్లాసు నీళ్లు పోసుకోండి.
- అనంతరం వడలను ఇడ్లీ గుంతల్లో పెట్టి, 10 నిమిషాలపాటు కుక్ చేస్తే సరిపోతుంది.
- చుక్క కూడా ఆయిల్ లేకుండా ఎంతో హెల్దీ వడలు సిద్ధమైపోతాయి.
- నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.