No Tomato No Masala Egg Curry : పిల్లలు నుంచి పెద్దల వరకు కోడిగుడ్డుతో ఎలాంటి వంటకాలు చేసినా ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, చాలా మంది త్వరగా అయిపోతుందని ఎగ్స్‌తో ఆమ్లెట్ వేసుకోవడం, ఎగ్ బుర్జీ వంటి కర్రీలు చేసుకుంటుంటారు. అదే గుడ్డు పులుసు విషయానికొస్తే కాస్త టైమ్ పడుతుందని అంతగా ఇంట్రెస్ట్ చూపించరు.
అలాంటి వారికోసం ఎలాంటి మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడకుండా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునే ఒక సూపర్ ఎగ్ కర్రీ తీసుకొచ్చాం. అదే, పాతకాలం నాటి కమ్మని "కోడిగుడ్డు పులుసు". టమాటాలు కూడా వాడకుండా తయారు చేసే ఈ కర్రీ ఎంతో రుచికరంగా ఉండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. దీన్ని వంటరాని వాళ్లు, బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. మరి, ఈ సూపర్ టేస్టీ అమ్మమ్మల కాలం నాటి గుడ్డు కూరను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ :
- నూనె - తగినంత
- ఉడికించిన కోడిగుడ్లు - 6
- ఆవాలు - ఒక టీస్పూన్
- కరివేపాకు - కొద్దిగా
- పెద్ద సైజ్ ఉల్లిపాయలు - ఐదు
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - పావుటీస్పూన్
- కారం - రుచికి తగినంత
- చింతపండు - నిమ్మకాయ సైజంత
- పచ్చిమిర్చి - నాలుగైదు
- బెల్లం - చిన్న ముక్క
తయారీ విధానం :
- ఈ సింపుల్ అండ్ టేస్టీ గుడ్డు పులుసు కోసం ముందుగా ఒక గిన్నెలో చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి.
- అలాగే, కోడిగుడ్లను ఉడికించుకొని పొట్టు తీసి అక్కడక్కడ గాట్లు పెట్టుకొని పక్కనుంచాలి. అదేవిధంగా ఉల్లిపాయలను వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిలను చీలికలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద కడాయి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా ఒక స్పూన్ నూనె వేసి వేడెక్కనివ్వాలి.
- ఇలా చేయడం ద్వారా కడాయి నాన్‌స్టిక్ పాన్‌లా మారి గుడ్లు వేయించేటప్పుడు అంటుకోకుండా ఉంటాయి.
- తర్వాత కర్రీకి సరిపడా నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉడికించి గాట్లు పెట్టుకున్న ఎగ్స్ వేసి 10 సెకన్ల పాటు అలాగే ఉంచాలి.
- ఆపై వాటిని గరిటెతో తిప్పుకుంటూ అన్ని వైపులా చక్కగా వేయించుకోవాలి. తర్వాత వేగిన గుడ్లను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం అదే నూనెలో ఆవాలు, కరివేపాకు వేసి చిటపటలాడేవరకు వేయించాలి. ఆ తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ తరుగు, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి.
- ఆపై మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి గరిటెతో కలుపుతూ ఆనియన్స్ సాఫ్ట్‌గా మారి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి.
- అలా వేయించుకున్నాక అందులో పసుప, కారం వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించాలి.
- ఆ తర్వాత కూర ఉడకడానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని కలిపి మూతపెట్టి లో ఫ్లేమ్‌లో నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి.
- ఈ స్టేజ్‌లో నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన రసాన్ని పోసుకోవాలి. అలాగే, పచ్చిమిర్చి చీలికలు, బెల్లం ముక్క వేసి కలిపి మళ్లీ మూతపెట్టి మరొక పది నిమిషాల పాటు స్టవ్‌ను లో ఫ్లేమ్‌లోనే ఉంచి ఉడకనివ్వాలి.
- కూర చక్కగా మగ్గి నూనె సెపరేట్ అవుతున్నప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లను వేసుకోవాలి.
- తర్వాత మరో రెండుమూడు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ చేసుకుంటే చాలు. అంతే, ఘుమఘుమలాడే రుచికరమైన పాతకాలం నాటి "గుడ్డు పులుసు" రెడీ!
- దీన్ని వేడి వేడిగా అన్నం, చపాతీ, రోటీ ఇలా దేనిలోకి తిన్నా ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం నచ్చితే మీరూ ఈ వీకెండ్ ఓసారి ట్రై చేయండి.
టిప్స్ :
- ఈ కర్రీ టేస్ట్ మొత్తం ఉల్లిపాయలను వేయించుకోవడంలోనే ఉంటుంది. కాబట్టి, ఆనియన్స్‌ను పచ్చిదనం లేకుండా చక్కగా వేయించుకోవాలి.
- ఈ రెసిపీ రుచిని పెంచే సూపర్ ఇంగ్రీడియంట్ చిన్న బెల్లం ముక్క. ఇది వేసుకోవడం ద్వారా పులుపు, కారం బ్యాలెన్స్ అయి కర్రీ టేస్ట్ మరింతగా బాగుంటుంది.
వేసవిలో ఒంటికి చలువ చేసే "టిఫెన్" - బరువు తగ్గాలనుకునేవారు, షుగర్ ఉన్నోళ్లు హాయిగా తినొచ్చు!
పాతకాలం నాటి "వట్టి తునకల కూర" - ఇలా చేస్తే గరం మసాలా అవసరం లేదు - బాలింతలు, పెద్దలకు చాలా మంచిది!