ఎన్నడూ చేయని నయా స్టైల్ "వంకాయ కూర" - పల్లీ పొడితో ఇలా చేశారంటే టేస్ట్ అద్భుతం!
వంకాయతో నోరూరించే 'కర్రీ' - అన్నం, చపాతీ, రోటీల్లోకి అద్దిరిపోతుంది!

Published : September 2, 2025 at 12:05 PM IST
New Style Vankaya Curry Recipe : కూరగాయల్లో రారాజుగా చెప్పుకునే వంకాయతో ఎలాంటి వంటకాలు చేసినా అద్భుతమైన రుచితో నోరూరిస్తాయి. అయితే, నార్మల్‌గా చాలా మంది వంకాయతో గుత్తొంకాయ కర్రీ, పచ్చడి, పులుసు వంటివి ఎక్కువగా చేసుకుంటుంటారు. ఎంత ఇష్టమైనప్పటికీ వంకాయతో ఎప్పుడూ ఒకే రకమైన వంటలు తినాలంటే ఎవరికైనా బోరింగ్‌గానే అనిపిస్తుంది. అందుకే, మీకోసం ఒక నయా స్టైల్ రెసిపీని తీసుకొచ్చాం. అదే, పల్లీ మసాలా పొడితో నోరూరించే "వంకాయ కూర". ఈ పద్ధతిలో చేశారంటే ఇంటిల్లిపాదీ ఎన్నడూ తినని సరికొత్త రుచిని ఆస్వాదిస్తారు. ఈ కర్రీ పిల్లలతో పాటు వంకాయ అంటే నచ్చని వాళ్లకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇది వేడివేడి అన్నంతో పాటు చపాతీ, రోటీ ఇలా దేనిలోకైనా సూపర్ కాంబినేషన్‌గా నిలుస్తుంది. మరి, ఈ నోరూరించే కొత్తరకం వంకాయ కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :
- గుండ్రటి వంకాయలు - 10 నుంచి 12
- నూనె - తగినంత
- ఉల్లిపాయలు - మూడ్నాలుగు(చిన్న సైజ్‌వి)
- జీలకర్ర - ఒక టీస్పూన్
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక చెంచా
- కరివేపాకు - కొద్దిగా
- పచ్చిమిర్చి - నాలుగైదు
- పసుపు - అరటీస్పూన్
- ఉప్పు - రుచికి తగినంత
- చింతపండు గుజ్జు - కొద్దిగా
- కొత్తిమీర తరుగు - కొంచెం
పల్లీ మసాలా పొడి కోసం :
- పల్లీలు - కొన్ని
- కొబ్బరి తురుము - రెండు చెంచాలు
- ఆవాలు - పావు చెంచా
- జీలకర్ర - పావు చెంచా
- ధనియాలు - పావు చెంచా
- నువ్వులు - రెండు చెంచాలు
పచ్చికొబ్బరితో కమ్మని "దోశలు" - పప్పులు నానబెట్టాల్సిన పనే లేదు! - నిమిషాల్లోనే రెడీ!

తయారీ విధానం :
- ఈ నోరూరించే వంకాయ కర్రీ తయారీ కోసం ముందుగా పర్పుల్ కలర్ తాజా గుండ్రటి వంకాయలను తీసుకొని చాకుతో అక్కక్కడ గాట్లు పెట్టుకోవాలి.
- ఆపై ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో ఉప్పు, గాట్లు పెట్టిన వంకాయలను వేసి రెండు మూడు నిమిషాల పాటు ఉండనివ్వాలి.
- ఆలోపు రెసిపీలోకి అవసరమైన పల్లీ మసాలా పొడిని సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని పల్లీలను వేసి దోరగా వేయించాలి.
- అవి వేగిన తర్వాత అందులోనే కొబ్బరి తురుము, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, తెల్ల నువ్వులు వేసి లో ఫ్లేమ్‌లో అన్నింటినీ 5 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి.
- తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారిన పల్లీల మిశ్రమాన్ని వేసి మెత్తని పొడిలా మిక్సీ పట్టుకొని పక్కనుంచాలి.

- ఇప్పుడు స్టవ్ మీద కర్రీ తయారీ కోసం కడాయి పెట్టుకొని నాలుగైదు చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ లైట్‌గా హీట్ అయ్యాక గాట్లు పెట్టుకున్న వంకాయలను వేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం అదే పాన్‌లో మీడియం సైజ్‌లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వేయించాలి. ఆవిధంగా వేయించుకున్నాక వాటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టుకొని పక్కనుంచాలి.
ఈ పద్దతిలో "గోరుచిక్కుడు కొబ్బరికారం" చేయండి - ఇంటిల్లిపాదీకి చాలా బాగా నచ్చుతుంది!

- తర్వాత అదే కడాయిలో కర్రీ కోసం అదనంగా మరికొద్దిగా నూనె వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర, అల్లంవెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కాసేపు మగ్గనివ్వాలి.
- అవి మగ్గిన తర్వాత పసుపు, టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఆపై ముందుగా మిక్సీ పట్టుకొని పక్కనుంచిన ఉల్లిపాయ పేస్ట్, పల్లీ మసాలా పొడి మిశ్రమం, కొద్దిగా చింతపండు గుజ్జు యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
- ఇక్కడ చింతపండు గుజ్జుని మీరు తినే పలుపుని బట్టి ఎక్కువ లేదా తక్కువ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- మిశ్రమం మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసిన తర్వాత కలుపుతూ ఒక నిమిషం పాటు వేయించాలి.
- ఆ వేయించి పక్కన పెట్టుకున్న వంకాయలు, సన్నని కొత్తిమీర తరుగు వేసి మూడ్నాలుగు నిమిషాల పాటు సన్నని సెగపై ఉడికించుకొని దింపేసుకుంటే చాలు. అంతే, కమ్మని రుచితో నోరూరించే "వంకాయ కర్రీ" రెడీ అవుతుంది!
ఇడ్లీ, దోశల్లోకి రుచికరమైన "కొబ్బరి చట్నీ" - ఇలా చేస్తే పక్కా హోటల్ టేస్ట్!

