కాల్చిన పచ్చిమామిడితో నోరూరించే "రోటి పచ్చడి" - ఇలా చేస్తే అన్నం ఓ ముద్ద ఎక్కువే తింటారు!
-మామిడికాయలతో ఎన్నడూ ట్రై చేయని అద్భుతమైన పచ్చడి - ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!

Published : June 1, 2025 at 4:39 PM IST
New Style Mango Pachadi Recipe : ప్రస్తుతం మామిడికాయల సీజన్ నడుస్తోంది. ఈ క్రమంలోనే చాలా మంది పచ్చిమామిడికాయలతో రకరకాల పచ్చళ్లు, పులిహోర, కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటుంటారు. అలాంటి వారికోసమే ఒక అద్దిరిపోయే రెసిపీని తీసుకొచ్చాం. అదే, కాల్చిన పచ్చిమామిడితో కమ్మని 'రోటి పచ్చడి'. నార్మల్‌గా చాలా మంది వంకాయలను కాల్చి పచ్చడి చేసుకోవడం చూస్తుంటాం. కానీ, ఓసారి మామిడికాయలతోనూ అలాంటి పచ్చడిని చేసుకొని చూడండి. ఊరగాయ పచ్చడి కంటే సూపర్ టేస్టీగా ఉండి తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది! పైగా దీన్ని చాలా తక్కువ టైమ్‌లో సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. మరి, ఈ పచ్చడి కోసం తీసుకోవాల్సిన పదార్థాలేంటి? ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- రెండు - పచ్చిమామిడికాయలు
- పెద్ద సైజ్ ఉల్లిపాయ - ఒకటి
- రుచికి సరిపడా - ఉప్పు
- రెండు టేబుల్‌స్పూన్లు - కారం
- రెండు చెంచాలు - కశ్మీరీ కారం
- అర కప్పు - కొత్తిమీర తరుగు
- ఆరు - పచ్చిమిర్చి
- వెల్లుల్లి - సగం పాయ
- అల్లం - అంగుళం ముక్క
"చింతచిగురు నిల్వ పచ్చడి" - ఈ కొలతలు, టిప్స్ పాటిస్తే సంవత్సరం వరకు పాడవదు - రుచి సూపర్ అంతే!

తయారీ విధానం :
- ఈ పచ్చడి తయారీ కోసం ముందుగా స్టవ్ మీద లో ఫ్లేమ్‌లో మామిడికాయలను పట్టుకారుతో పట్టుకొని నల్లగా అయ్యే వరకూ కాల్చుకోవాలి.
- ఆవిధంగా కాల్చుకున్నాక వాటిని చల్లటి నీళ్లలో కొద్దిసేపు ఉంచాలి. ఆపై అవి చల్లారాక పొట్టు తీసేసి మీకు కావాల్సిన పరిమాణంలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచాలి.
- అలాగే, ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొత్తిమీరను సన్నగా తరిగి పక్కనుంచాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, రుచికి తగినంత ఉప్పు, కారం, కశ్మీరీ చిల్లీ పౌడర్, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చిమిర్చి తుంపలు వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి.
- అనంతరం అందులో కట్ చేసి పక్కనుంచిన మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకొని కొన్ని క్షణాలు గ్రైండ్ చేసుకోవాలి.
- తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కట్ చేసి పెట్టుకున్న సన్నని కొత్తిమీర తరుగు యాడ్ చేసుకొని పక్కనుంచాలి.
- ఒకవేళ రోలు అందుబాటులో ఉన్నవారు అందులో ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ మరింత గొప్పగా ఉంటుంది.
- ఇప్పుడు పచ్చడిలోకి తాలింపుని సిద్ధం చేసుకోవాలి.

తాలింపు కోసం :
- రెండు టేబుల్‌స్పూన్లు - నూనె
- ఒక చెంచా - ఆవాలు
- ఒక చెంచా - శనగపప్పు
- ఒక చెంచా - మినప్పప్పు
- ఒక చెంచా - జీలకర్ర
- మూడు - ఎండుమిర్చి
- పావు చెంచా - ఇంగువ
- రెండు రెబ్బలు - కరివేపాకు

- ఇందుకోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడయ్యాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించుకోవాలి.
- ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు జీలకర్ర, ఎండుమిర్చి తుంపలు, కరివేపాకు, ఇంగువ యాడ్ చేసుకొని పోపుని చక్కగా వేయించాలి.
- తాలింపు మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసి ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, న్యూ స్టైల్లో ఘుమఘుమలాడే "పచ్చిమామిడికాయ రోటి పచ్చడి" రెడీ!
ఈ ముద్ద వేసి "చేపల పులుసు" చేయండి - నీచు వాసన లేకుండా కమ్మగా ఉంటుంది!
ఇదొక్కటి వేసి "టమటా కుర్మా" చేసుకోండి - వీకెండ్లో చికెన్, మటన్ కర్రీల కంటే అద్భుతంగా ఉంటుంది!

