Crispy Chicken Fried Rice Recipe : సండే వచ్చిందంటే చాలు మెజార్టీ పీపుల్ ఫ్యామిలీతో రెస్టారెంట్, దాబా, ప్రముఖ హోటల్స్‌కి వెళ్లి నచ్చిన డిష్‌ని ఎంజాయ్ చేస్తుంటారు. మరికొందరు మాత్రం ఇంట్లోనే చికెన్, మటన్, చేపలు వంటి వాటితో బిర్యానీ, కర్రీలు అంటూ రకరకాల వెరైటీలు చేసుకొని ఆస్వాదిస్తుంటారు. అయితే, ఎప్పుడూ బిర్యానీనే తినాలంటే పిల్లలకే కాదు పెద్దల వాళ్లకు కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. అందుకే, ఈ ఆదివారం రొటీన్ వంటకాలు కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఇలా "చికెన్ ఫ్రైడ్ రైస్" చేసుకొని చూడండి. స్ట్రీట్ స్టైల్‌ని మించిన టేస్ట్‌తో భలే అద్భుతంగా ఉంటుంది. కరకరలాడే చికెన్ ముక్కలు, వేయించిన పల్లీలు అక్కడక్కడ తగులుతూ తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. కొంచెం కారం, కొంచెం తీపి కలయికతో స్పైసీగా అద్దిపోతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మరి, ఈ సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీ చికెన్ ఫ్రైడ్ రైస్‌కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
మారినేషన్ కోసం :
- బోన్‌లెస్ చికెన్ - 250గ్రాములు
- గరంమసాలా - ఒకటీస్పూన్
- ధనియాల పొడి - అరటీస్పూన్
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - అరటీస్పూన్
- ఉప్పు - రుచికి తగినంత
- వేయించిన జీలకర్ర పొడి - అరటీస్పూన్
- కారం - ఒక టీస్పూన్
- కార్న్‌ఫ్లోర్ - రెండుటీస్పూన్లు

ఫ్రైడ్ రైస్ కోసం :
- నూనె - 1/3 కప్పు
- ఎగ్స్ - రెండు
- సన్నని అల్లం తరుగు - ఒకటీస్పూన్
- కరివేపాకు - ఒక రెమ్మ
- సన్నని బీన్స్ తరుగు - పావుకప్పు
- సన్నని క్యారెట్ ముక్కలు - పావుకప్పు
- స్వీట్ కార్న్ - రెండు టేబుల్‌స్పూన్లు
- క్యాప్సికం తరుగు - పావుకప్పు
- క్యాబేజీ తరుగు - అరకప్పు
- ఉప్పు - కొద్దిగా
- మిరియాల పొడి - ఒకటీస్పూన్
- ఉడికించిన బాస్మతి రైస్ - ఒకటిన్నర కప్పులు
- రెడ్ చిల్లీ సాస్ - ఒక టేబుల్‌స్పూన్
- స్వీట్ చిల్లీ సాస్ - రెండు టేబుల్‌స్పూన్లు
- డార్క్ సోయా సాస్ - ఒక టేబుల్‌స్పూన్
- వైట్ పెప్పర్ పౌడర్ - అరటీస్పూన్
- వేయించిన పల్లీల పలుకులు - కొన్ని
- స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు - కొద్దిగా

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసిన బోన్‌లెస్ చికెన్‌ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
- ఆపై అందులో గరంమసాలా, ధనియాల పొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, కారం వేసుకొని అవన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలపాలి.
- ఆ తర్వాత కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకొని అది చికెన్ ముక్కలకు బాగా కోట్ అయ్యేలా కలిపి అరగంటపాటు పక్కనుంచాలి.
- ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసి మూడునాలుగు నిమిషాల పాటు కదపకుండా వదిలేయాలి.
- ఇలా చేయడం ద్వారా చికెన్‌పై కోటింగ్ ఊడదు. అలాగే, చికెన్ ఆయిల్లో చక్కగా మగ్గుతుంది.
- ఆ తర్వాత గరిటెతో కలుపుతూ చికెన్ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందుకోసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు టైమ్ పట్టొచ్చు.
- ఆవిధంగా వేయించుకున్నాక మంటను పెంచి మరో రెండు నిమిషాలు వేయించి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచాలి.
- పైన చెప్పినవిధంగా చికెన్ ముక్కలు వేయించుకున్నట్లయితే అవి లోపలిదాకా మంచిగా ఉడకడమే కాకుండా బయట క్రిస్పీగా తయారవుతాయి.

- ఇప్పుడు ఒక గిన్నెలో ఎగ్స్ పగులగొట్టి పోసుకొని బాగా బీట్ చేసి కడాయిలో వేడవుతున్న నూనెలో పోసుకుంటే అది చక్కగా పొంగుతుంది.
- అప్పుడు దాన్ని నెమ్మదిగా ఫ్లిప్ చేసి గరిటెతో కలుపుతూ పెద్ద పెద్ద ముక్కలుగా బ్రేక్ చేసుకోవాలి. ఎగ్ చక్కగా వేగిందనుకున్నాక దాన్ని గరిటెతో వన్సైడ్కి అని సన్నని అల్లం తరుగు వేసి హై ఫ్లైమ్లో కాసేపు టాస్ చేయాలి.
- ఆ తర్వాత కరివేపాకు వేసి 30 సెకన్ల పాటు వేయించుకోవాలి. ఆపై అందులో సన్నని బీన్స్ తరుగు, సన్నని క్యారెట్ ముక్కలు, స్వీట్ కార్న్, సన్నని క్యాప్సికం తరుగు, క్యాబేజీ తరుగు వేసి హై ఫ్లేమ్‌లో ఒక నిమిషం పాటు వేయంచుకోవాలి.
- ఆపై అందులో ఉప్పు, అరటీస్పూన్ మిరియాల పొడి వేసుకొని అవి వెజిటబుల్స్‌కి పట్టేలా కాసేపు టాస్ చేయాలి.

- అనంతరం ఆ మిశ్రమంలో పొడిపొడిగా ఉడికించుకున్న బాస్మతి రైస్, మరో అరటీస్పూన్ మిరియాల పొడి, రెడ్ చిల్లీ సాస్, స్వీట్ చిల్లీ సాస్, డార్క్ సోయా సాస్, వైట్ పెప్పర్ పౌడర్, వేయించి పొట్టు తీసుకున్న పల్లీల పలుకులు, మరికాస్త ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్‌లో అట్లకాడతో అన్నీ చక్కగా కలిసేలా కొద్దిసేపు బాగా టాస్ చేసుకోవాలి.
- ఆఖర్లో వేయించి పక్కనపెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకొని మరోసారి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి.
- ఇక దింపేముందు సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. అంతే, మంచి ఫ్లేవర్‌తో ఘుమఘుమలాడే "చికెన్ ఫ్రైడ్ రైస్" ఇంట్లోనే రెడీ!

చిట్కాలు :
- వెజిటబుల్స్ తరుగు వేసుకున్నాక ఎక్కువసేపు వేయించకుండా కొద్దిసేపు మాత్రమే టాస్ చేసుకోవాలి. లేదంటే వాటికుండే క్రంచీనెస్ పోతుంది.
- ఇక్కడ బాస్మతి బియ్యాన్ని ఒక కప్పు(సుమారు 185గ్రాములు) పరిమాణంలో తీసుకుని కాస్త ఉప్పు వేసి ముందుగానే పొడిపొడిగా వండుకోవాలి. అది ఉడికినట్లయితే ఒకటిన్నర కప్పులు అవుతుంది.
- అలాగే, మీ దగ్గర బాస్మతి బియ్యం లేకపోతే వాటి ప్లేస్‌లో నార్మల్ రైస్‌తో కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు.
- ఈ రెసిపీలోకి కావాల్సిన సాస్‌లు అన్ని బయట మార్కెట్స్, ఆన్లైన్లో దొరుకుతాయి.
ఈ "గుడ్డు కారం" తిన్నారంటే వెరీ గుడ్డు అంటారు! - అంతా ఈ మసాలాలోనే ఉంది! - నోటికి పండగే