Neem Flower Benefits Ugadi Pachadi in Telugu : ఆరు రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. తీపి, వగరు, పులుపు, కారం, చేదుతో పాటు ఉప్పు కలిపి చేస్తుంటారు. జీవితంలో వచ్చే కష్టసుఖాలను (అన్ని రుచులను) సమానంగా స్వీకరించాలన్న సందేశం అందరికీ అందించడమే ఈ పచ్చడి ప్రత్యేకత. ఉగాది పచ్చడిలో చేదు కోసం వేప పువ్వు ఎందుకు కలుపుతారో తెలుసా?!

మామిడి (Mango) :
మామిడి పిందెతో ఉగాది పచ్చడికి వగరు రుచి వస్తుంది. గాయాలు, వాటి కారణంగా జరిగే రక్తస్రావాన్ని నివారించడంలో మామిడి సహకరిస్తుంది. ఇక సమ్మర్లో వేడి వల్ల వడదెబ్బ తగలకుండా, డీహైడ్రేషన్ బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది. ఇక ఇందులోని విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది. గ్యాస్ట్రిక్, ఛాతీలో మంట వంటి పలు సమస్యల్ని తొలగించడంతో పాటు పొట్టను పరిశుభ్రంగా ఉంచడానికి మామిడిలోని పీచు పదార్థం సహకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

బెల్లం (Jaggery) :
ఉగాది పచ్చడిలో మనం ఉపయోగించే బెల్లం శరీరంలోని విషపదార్థాల్ని బయటికి పంపించడంలో తోడ్పడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, సెలీనియం, జింక్ వంటి పోషకాలు ఫ్రీరాడికల్ డ్యామేజ్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. ఇక ఇందులోని ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. దగ్గు, అజీర్తి, మలబద్ధకం వంటి పలు అనారోగ్య సమస్యలకు బెల్లం పరిష్కారం చూపుతుంది.
చింత పండు (Tamarind):
మనం తీసుకున్న ఆహారంలోని ఖనిజాల్ని శరీరం ఈజీగా గ్రహించేందుకు, అలాగే శరీరంలోని విష పదార్థాలను తొలగించేందుకు చింతపండు సహాయం చేస్తుంది. ఇక అజీర్తి వల్ల కలిగే అసౌకర్యానికి చెక్ పెట్టడంతో పాటు శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇక అందాన్ని పెంచే శక్తి కూడా చింతపండుకు ఉందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అందుకే దీన్ని వివిధ సౌందర్య ఉత్పత్తుల్లోనూ ఉపయోగిస్తుంటారు.
"విశ్వావసు" నామ సంవత్సరంలో "వీరే" హీరోలు - 'ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే'!
ఈ శ్లోకం చదివి ఉగాది పచ్చడి ఆరగించండి!
శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ
సర్వారిష్ట వినాశంచ నింబకందళ భక్షణమ్॥
కారం (Chilli Powder) :
చర్మ ఇన్ఫెక్షన్లతో పోరాడి రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు కారంలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే దీన్ని ఇమ్యూనిటీ బూస్టర్‌గా చెబుతుంటారు. అలాగే ఇందులో ఉండే క్యాప్సైచిన్ అనే పదార్థం నొప్పి నివారిణిగా పనిచేస్తుందని నిపుణులంటున్నారు. జీర్ణశక్తిని పెంచడం, బరువును తగ్గించడంతో పాటు ముక్కు దిబ్బడ నుంచి త్వరిత ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు.

ఉప్పు (Salt) :
వేసవిలో మన శరీరం డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం అధికంగా ఉంటుంది. ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే తగినంత సోడియంను శరీరానికి అందించడం చాలా అవసరం. ఉగాది పచ్చడిలోని ఉప్పు ఇందుకు సహాయం చేస్తుంది. అదేవిధంగా నీరసాన్ని తరిమికొట్టడంలో ఇది తోడ్పడుతుంది. అయితే ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదని నిపుణులు తెలిపారు.
వేప పువ్వు (Neem Flower) :
ఉగాది పచ్చడిలో చేదు కోసం వేపపువ్వును ఉపయోగిస్తారు. వేప పువ్వుకు వివిధ రకాల వ్యాధులతో పోరాడే శక్తి ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వేప పువ్వు శరీరంలోకి చేరి అనారోగ్యాలకు గురిచేసే క్రిములను నాశనం చేస్తుందని అంటున్నారు. అలాగే రక్తాన్ని శుద్ధి చేసి అనేక చర్మ వ్యాధులను నివారించడంలో సహాయం చేస్తుందని పేర్కొన్నారు. అలాగే వేప పువ్వు మధుమేహంతో బాధపడేవారికి చక్కటి ఔషధంలా పనిచేస్తుందని తెలిపారు. వేపపువ్వును చేదు రుచి కోసమే కాకుండా, ఋతువుల మార్పుల వచ్చే అనారోగ్యాలను నివారించడానికి, జీవితంలోని కష్టసుఖాలను సూచించడానికి కూడా ఉపయోగిస్తారు.
వేప చెట్టు ఆకులు, పువ్వులు, విత్తనాలు, పండ్లు, వేర్లు, బెరడు వంటివన్నీ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, ఇన్ఫెక్షన్లు, జ్వరం, చర్మ వ్యాధులు, దంత సమస్యలకు చికిత్సలో భాగంగా ఉపయోగిస్తున్నారు. ఈ విషయాన్ని National Institutes of Health (NIH) బృందం తెలిపింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ఉగాది పచ్చడి ఆరోగ్యదాయకం అయినప్పటికీ, ఎంత తింటే అంత మంచిదనుకుంటే పొరపాటే! ఎందుకంటే ఏదైనా మితంగా తీసుకుంటేనే దాని లాభాలు పొందచ్చంటున్నారు నిపుణులు.
గమనిక : ఉగాది, ఉగాది పచ్చడికి సంబంధించి పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
"శివుడికి ఇష్టమైన పువ్వులు ఏమిటో తెలుసా? - జిల్లేడు మాత్రం కాదు - వీటితో పూజిస్తే అష్టైశ్వర్యాలు"
మీరు ఎప్పుడైనా గమనించారా! - శివుడి తలపై చంద్రుడు ఎందుకు ఉంటాడో తెలుసా?