మంచి ఫ్లేవర్‌తో ఘుమాయించే "మైసూర్ రసం" - ఈ పొడి వేసి చేసుకోవడంలోనే సీక్రెట్ అంతా!
చల్లని వాతావరణంలో వేడివేడి అన్నంలోకి అద్దిరిపోయే రసం - ఇలా చేస్తే నాలుగు ముద్దలు ఎక్కువే లాగిస్తారు!

Published : May 28, 2025 at 12:30 PM IST
How to Make Mysore Rasam : వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చాలా మంది భోజనంలోకి ఘరంఘరంగా, కమ్మగా ఉండే చారు, రసం వంటివి ఇష్టపడుతుంటారు. అలాంటి వారికోసం ఎప్పుడు తినే టమాటా రసం, సాంబార్, పప్పుచారు వంటివి కాకుండా మంచి ఫ్లేవర్‌తో ఘుమాయించే ఒక రసం రెసిపీ ఉంది. అదే, 'మైసూర్ రసం'. ఒక స్పెషల్ మసాలా పొడిని చేసి వేసుకోవడం ద్వారా రెగ్యులర్‌గా చేసుకునే వాటికి కాస్త భిన్నమైన టేస్ట్‌తో, కమ్మటి వాసనతో నోరూరిస్తుంది. ఇది రుచికరంగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. పిల్లలైతే ఇలా చేసి పెడితే ఒక్క ముద్ద తినే దగ్గర మరో రెండు ముద్దలు అదనంగా లాగిస్తారు. మరి, ఈ సింపుల్ అండ్ హెల్దీ రసం రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :
స్పెషల్ మసాలా కోసం :
- నూనె - ఒక టేబుల్‌స్పూన్
- శనగపప్పు - 2 టీస్పూన్లు
- మిరియాలు - ఒక టీస్పూన్
- ధనియాలు - రెండు టేబుల్‌స్పూన్లు
- జీలకర్ర - ఒకటీస్పూన్
- ఎండుమిర్చి - రెండు
- కరివేపాకు - కొద్దిగా
- పచ్చికొబ్బరి తురుము - పావు కప్పు
ఈ పొడితో "టమాటా రసం" చేసుకోండి - కమ్మని రుచితో తినడమే కాదు గ్లాసుల్లో పోసుకుని తాగేస్తారు!

తయారీ విధానం :
- మైసూర్ స్టైల్ రసం తయారీ కోసం ముందుగా ప్రత్యేకమైన మసాలా పొడిని సిద్ధం చేసుకోవాలి.
- ఇందుకోసం స్టవ్ మీద పాన్‌లో ఆయిల్ వేసుకోవాలి. అది కొద్దిగా వేడయ్యాక శనగపప్పు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి తుంపలు వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి.
- అలా వేయించుకున్నాక అందులో కరివేపాకు, పచ్చికొబ్బరి తురుము వేసి మరో రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో వేయించాలి. ఆపై స్టవ్ ఆఫ్ చేసుకొని మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి.
- అనంతరం చల్లారిన ధనియాల మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మైసూర్ రసాన్ని ప్రిపేర్ చేసుకోవాలి.

రసం తయారీ కోసం :
- టమాటాలు - మూడు
- పచ్చిమిర్చి - రెండు
- కరివేపాకు - ఒక రెమ్మ
- పసుపు - అరటీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- చింతపండు - నిమ్మకాయ సైజంత
- కందిపప్పు - అర కప్పు
- బెల్లం - చిన్న ముక్క

- ఈ రసం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కుక్కర్లో కందికప్పుని తీసుకొని కడిగి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి.
- అది ఉడికేలోపు ఒక చిన్న గిన్నెలో చింతపండుని తీసుకొని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.
- అలాగే, రెసిపీలోకి కావాల్సిన టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా, పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద గిన్నెలో టమాటా ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, పసుపు, ఉప్పు ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని టమాటాలు మెత్తబడే వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి.
- తర్వాత అందులో నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన రసం, మెత్తగా ఉడికించిన అరకప్పు కందిపప్పు, చిన్న బెల్లం ముక్క వేసుకొని రసానికి సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలి.
- అలాగే, ముందుగా రెడీ చేసుకున్న ప్రత్యేకమైన మసాలా పొడిని కూడా వేసుకొని ఒకసారి కలిపి బాగా మరిగించుకోవాలి. ఇందుకోసం ఆరు నుంచి ఎనిమిది నిమిషాల వరకు టైమ్ పట్టొచ్చు.
- రసం బాగా మరిగిన తర్వాత ఉప్పు చెక్ చేసుకోవాలి. చివర్లో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు పెట్టుకోవాలి.
తాలింపు కోసం :
- నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు
- ఆవాలు - ఒకటీస్పూన్
- జీలకర్ర - ఒకటీస్పూన్
- ఎండుమిర్చి - రెండు
- ఇంగువ - పావుటీస్పూన్
- కరివేపాకు - కొద్దిగా

- పోపు కోసం స్టవ్ మీద చిన్న కడాయిలో నెయ్యి వేసుకోవాలి. అది కరిగి కాస్త వేడయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి తుంపలు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
- తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసంలో వేసి మిక్స్ చేసుకుంటే చాలు. అంతే, కమ్మటి ఫ్లేవర్‌తో ఘుమఘుమలాడే "మైసూర్ రసం" రెడీ!

టిప్స్ :
- ఈ రసం తయారీలో ఉల్లి, వెల్లుల్లి వంటివి వేయకుండానే చాలా రుచికరంగా వస్తుంది.
- అలాగే, ఇక్కడ తాలింపులో మీకు నెయ్యి వేసుకోవడం ఇష్టం లేకపోతే దాని ప్లేస్‌లో నూనెను వాడుకోవచ్చు.
పెళ్లి విందులోని "కల్యాణ రసం" - ఇలా ప్రిపేర్ చేస్తే పెళ్లి రోజులు గుర్తొస్తాయి!

