"మటన్ కర్రీ" ఎప్పుడూ ఒకేలా తిని బోర్ కొట్టిందా? - ఇలా వెరైటీగా చేస్తే ఇంటిల్లిపాదీ ఫుల్ ఖుష్!
-దాబా స్టైల్లో నోరూరించే 'మటన్ కర్రీ' - ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

Published : September 14, 2025 at 1:16 PM IST
Dhaba Style Mutton Curry Recipe : మాంసాహార ప్రియులకు ఆదివారం వచ్చిందంటే చాలు ఇంట్లో నాన్‌వెజ్ ఘుమఘుమలు ఉండాల్సిందే. ఈ క్రమంలోనే చికెన్, మటన్, చేప వంటి వాటిల్లో ఏదో ఒకటి తెచ్చుకుని సండేను ఎంజాయ్ చేస్తుంటారు. అందులోనూ కొంతమంది మటన్‌ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే, ప్రతి సండే ఒకే రకమైన పద్ధతిలో మటన్ కర్రీ తినాలన్నా బోరింగ్‌గా ఉంటుంది. అందుకే, మీకోసం ఒక స్పెషల్ రెసిపీని తీసుకొచ్చాం. అదే, నోరూరించే దాబా స్టైల్ "మటన్ కర్రీ". ఈ పద్ధతిలో చేశారంటే ముక్క మెత్తగా ఉడకడమే కాకుండా మంచి రుచికరంగా ఉంటుంది. మొదటిసారి చేసేవారైనా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఘాటు ఘాటుగా ఘుమాయించే ఈ రెసిపీ అన్నంతో పాటు చపాతీ, రోటీ, పులావ్, బగారా రైస్ వంటి వాటిల్లోకి కిర్రాక్‌గా ఉంటుంది. మరి, ఈ ఘుమఘుమలాడే దాబా స్టైల్ మటన్ కర్రీని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
మ్యారినేషన్ కోసం :
- అరకిలో - మటన్
- నాలుగు చెంచాలు - పెరుగు
- పావు చెంచా - ఉప్పు
- చెంచా - కారం
- అర చెంచా - పసుపు

కర్రీ కోసం :
- అరకప్పు - టమాటా ముక్కలు
- అరకప్పు - ఉల్లిపాయ తరుగు
- ఒక టేబుల్‌స్పూన్ - పచ్చిమిర్చి తరుగు
- మూడు చెంచాలు - నూనె
- ఒక చెంచా - ధనియాల పొడి
- కారం, ఉప్పు - రుచికి తగినంత
- ఒక చెంచా - జీలకర్ర
- ఒక చెంచా - గరంమసాలా
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక చెంచా
- ఒక చెంచా - జీలకర్ర పొడి
- అర చెంచా - పసుపు
- ఒకటిన్నర చెంచా - వెల్లుల్లి తరుగు
- నాలుగు రెబ్బలు - కరివేపాకు
- రెండు - ఎండుమిర్చి
- చారెడు - కొత్తిమీర తరుగు
సండే స్పెషల్ : పిల్లల కోసం సూపర్ "స్నాక్" - కూల్ వెదర్లో కమ్మగా కరకరలాడుతాయి!

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా మటన్‌ను మ్యారినేట్ చేసుకోవాలి. ఇందుకోసం ఒక గిన్నెలో మటన్ తీసుకుని శుభ్రంగా కడిగి, వాటర్ వడకట్టాలి.
- ఆపై అందులో పెరుగు, కారం, పసుపు, ఉప్పు వేసి మటన్ ముక్కలకు పట్టేలా బాగా కలిపి అరగంట పాటు పక్కనుంచాలి.
- ఆలోపు రెసిపీలోకి అవసరమైన పరిమాణంలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు, టమాటా ముక్కలను కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. అలాగే, వెల్లుల్లి, కొత్తిమీర తరుగును ప్రిపేర్ చేసుకోవాలి.

- ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకుని అందులో మ్యారినేట్ చేసి అరగంటపాటు పక్కనుంచిన మటన్ మిశ్రమం, అది ఉడకడానికి తగినన్ని నీళ్లు, రుచికి తగినంత కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలి.
- అలాగే, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరంమసాలా వేసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపి మూతపెట్టి మటన్ మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి.
- అనంతరం స్టవ్ మీద కర్రీ కోసం అందుకు అనుగుణంగా ఉండే పాన్ పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి.
- ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, వెల్లుల్లి తరుగు, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వేయించాలి.
ఈజీగా రెస్టారెంట్ స్టైల్ "గార్లిక్ చికెన్ రోస్ట్" - అన్నం, చపాతీ, పులావ్‌లోకి అదుర్స్!

- ఆపై ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు జత చేసి ఆనియన్స్ గోధుమ రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి.
- ఆవిధంగా వేయించాక టమాటా ముక్కలు యాడ్ చేసి అవి మెత్తగా అయ్యే వరకూ మగ్గించాలి.
- తర్వాత ఆ మిశ్రమంలో మసాలాతో మెత్తగా ఉడికించిన మటన్ మిశ్రమాన్ని యాడ్ చేసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలపాలి.
- ఆపై లో ఫ్లేమ్‌లో అందులో నుంచి ఆయిల్ తేలే వరకు పావు గంట పాటు ఉడికించాలి. ఆవిధంగా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- అనంతరం పాన్‌ను దింపి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోండి. అంతే, దాబా స్టైల్లో ఘుమఘుమలాడే "మటన్ కర్రీ" మీ ముందు ఉంటుంది!

ఘుమాయించే "చికెన్ కర్రీ" - చల్లని వేళ వేడివేడి అన్నంలోకి అదుర్స్!

