Multigrain flour : కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లు, మాల్స్ లో వేర్వేరు కంపెనీల పేరుతో మల్టీ గ్రెయిన్ పిండి దొరుకుతుంది. కానీ, అలాంటి పిండి ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటే చపాతీలు, దోసెలు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వేసుకోవచ్చు. అయితే, సోయా వేసుకోవడం వల్ల పిండి సరిగా ఉండడం లేదని చాలా మంది గృహిణులు వాపోతున్నారు. అలా కాకుండా సోయా బదులు వీటిని వేసి చూడండి చపాతీలు ఎంతో బాగుంటాయి.
హోటల్ చట్నీ టేస్ట్ సీక్రెట్ ఏమీ లేదు! - పల్లీలను ఇలా చేసి చూడండి చట్నీ కోసమే టిఫిన్ తినేస్తారు!

కావాల్సిన పదార్థాలు :
- గోధుమలు - 3 కిలోలు
- పచ్చ జొన్నలు - అర కిలో
- రాగులు - అరకిలో
- సజ్జలు - అరకిలో
- శనగలు - అరకిలో

తయారీ విధానం :
- మొత్తం 3 కిలోల గోధుమలతో కలిపి 5 కిలోల పిండి రెడీ అవుతుంది. ఇది నెలంతా సరిపోతుంది. వీటిలో పచ్చ జొన్నలకు బదులుగా మీరు తెల్ల జొన్నలు కూడా తీసుకోవచ్చు. రాగులు, సజ్జలు, శనగల్లో ఇసుక, వ్యర్థాలు లేకుండా కడిగి ఆ తర్వాత ఎండకు ఆరబెట్టుకోవాలి. ఎండ సరిగా లేకపోతే క్లాత్ పై పోసుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నా సరిపోతుంది.
- అయితే, కొంత మంది సోయా గింజలు వేసి పిండి పట్టిస్తుంటారు. కానీ, సోయాకు బదులు మంచి శనగలు వేసుకుంటే పిండి చక్కగా వస్తుంది. వీటన్నింటినీ పిండి పట్టించి వేడి తగ్గే వరకు ఆరనిచ్చి తర్వాత స్టోర్ చేసుకోవాలి.

చపాతీ కోసం
ఇపుడు చపాతీ కోసం 2 కప్పుల పిండి, 1 టేబుల్ స్పూన్ నూనె, గోరు వెచ్చని నీళ్లు కలుపుకొని గట్టిగా, సాఫ్ట్‌గా కాకుండా మధ్యస్థంగా కలిపి పెట్టుకోవాలి. అర గంట సేపు నానబెట్టుకుని ఆ తర్వాత మర్దనా చేసుకుంటూ కలపాలి. ఆ తర్వాత పొడి పిండి చల్లుకుంటూ చపాతీలు తయారు చేసుకోవాలి. పెనం వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి. ఓ వైపు కాల్చిన తర్వాత రెండో వైపు నూనె లేదా నెయ్యి వేసుకుని కాల్చుకుంటే సరిపోతుంది.

దోసెల కోసం
కప్పు పిండి, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. గరిటె జారుడుగా పిండి కలుపుకొని పెనం వేడి చేసుకుని దోసెలు వేసుకుంటే చాలు. ఈ దోసెలు రెగ్యులర్ గా తినే చట్నీతో తింటే చాలు. కొద్దిగా నూనె రాసుకుని రెండో వైపు కాల్చుకోవాలి. ఇవి మామూలు దోసెల కంటే చాలా సాఫ్ట్ గా ఉంటాయి.

హోటల్ దోసె పిండిలో వంట సోడా వేయరు - కానీ, కిటుకు అంతా అక్కడే!
కరకరలాడే "మసాలా చెక్కలు" - పిండిలో ఇవి కలిపి చేయండి -ఎన్ని తింటారో లెక్కే ఉండదు!