Mullangi Kachori Recipe: ముల్లంగి అంటే చాలా మందికి నచ్చదు. దాన్ని ఆహారంలో భాగం చేసుకోవడానికి అంతగా ఇష్టపడరు. కారణం ఇది వెగటుగా ఉండటమే. ఇది నాణేనికి ఓ వైపు మాత్రమే కాదు. ఎందుకంటే చాలా మంది దీనిని తింటుంటారు. అంటే కూర, పచ్చడి, చారు రూపంలో తీసుకుంటుంటారు. అయితే కేవలం ఇవి మాత్రమే కాకుండా మరెన్నో వంటలు ముల్లంగితో చేయొచ్చు. అందులో కచోరీలు కూడా ఒకటి. వీటి టేస్ట్ సూపర్‌గా ఉంటాయి. పైగా చాలా తక్కువ సమయంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ముల్లంగి అంటే నచ్చనివారికి ఇలా కచోరీల రూపంలో పెడితే ఇష్టంగా తింటారు. మరి లేట్ చేయకుండా ముల్లంగి కచోరీలు ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- బియ్యప్పిండి - కప్పున్నర
- ముల్లంగి - పావు కిలో
- పసుపు - చిటికెడు
- ఉప్పు రుచికి - తగినంత
- కొత్తిమీర తరుగు - చారెడు
- నల్ల జీలకర్ర - చెంచా
- వాము - చెంచా
- అల్లం తరుగు - చెంచా
- వెల్లుల్లి తరుగు - చెంచా
- కారం - చెంచా
- నెయ్యి - చెంచా

తయారీ విధానం:
- ముందుగా ముల్లంగిని శుభ్రంగా కడిగి, పై పొట్టు తీసేసి సన్నగా తురుముకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కప్పు నీళ్లు పోయాలి. వాటర్ మరుగుతున్నప్పుడు తురిమిన ముల్లంగి వేసి ఓ రెండు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత బియ్యప్పిండి యాడ్ చేసి ఉండలు లేకుండా కలిపి మూత పెట్టి సిమ్‌లో 2 నిమిషాలు ఉడికించుకోవాలి.

- పిండి నీళ్లను పీల్చేసుకుని గట్టి ముద్దలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. బియ్యప్పిండి మిశ్రమం కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు దాంట్లో చెంచా నెయ్యి, కొత్తిమీర తరుగు, నల్ల జీలకర్ర, వాము, ఉప్పు, కారం, పసుపు, అల్లం, వెల్లుల్లి తరుగు వేసి బాగా కలపాలి.

- ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ చిన్న అప్పాల్లా ఒత్తుకుని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలానే చేసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న అప్పాలు వేసి మీడియం ఫ్లేమ్‌లో రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి.

- ఇవి వేగిన తర్వాత టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే వేడివేడి కచోరీలు తయారైపోతాయి.
- వీటిని టమాటా-బఠాణీల కూర లేదా బంగాళదుంప కర్రీతో తింటే సూపర్‌గా ఉంటుంది. అంతేకాకుండా రైతా, సాస్‌లతోనూ తినొచ్చు. నచ్చితే మీరూ ఒకసారి చేసి చూడండి.

టిప్స్:
- లేత ముల్లంగి అయితే ఈ కచోరీలు చేసుకోవడానికి బాగుంటాయి.
- బియ్యప్పిండిని నీటిలో వేసుకుని ముద్దలా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.

- వీటిని చిన్న చిన్న అప్పాల్లాగా చేసుకోవడం కష్టమనుకుంటే కొంచెం పెద్ద సైజ్‌లో పిండి ముద్దను తీసుకుని కాస్త మందంగా చపాతీల వత్తుకుని షార్ప్‌గా ఉండే చిన్న మూతతో కట్ చేసుకుంటే సరి.
- నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే కచోరీలు వేసి మీడియం ఫ్లేమ్‌లో రెండు వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి.

రుచికరమైన "సగ్గుబియ్యం పూరీలు" - పిండిని ఇలా కలిపితే బాగా పొంగుతాయి! - నూనె పీల్చవు!
ఇడ్లీ, దోశ పిండి లేనప్పుడు - అప్పటికప్పుడు వేసుకునే క్రిస్పీ అండ్ టేస్టీ "దోశలు"!