సూపర్ టేస్టీ "మొక్కజొన్న ఇడ్లీలు" - అప్పటికప్పుడు తక్కువ పదార్థాలతో రెడీ!
- రెగ్యులర్ ఇడ్లీలను మించిన టేస్ట్ - ఈ సీజన్లో తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ!

Published : September 15, 2025 at 1:55 PM IST
Mokkajonna Idli Recipe in Telugu : మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఆరోగ్యానికి మంచిదని, తేలికగా అవుతుందని అమ్మలంతా వారంలో మూడు నాలుగు రోజులు ఇడ్లీలను ప్రిపేర్ చేస్తుంటారు. అయితే, తెల్లని ఆ ఇడ్లీల్ని చూసి పిల్లలు మాత్రం మొహం మాడ్చుకుంటారు. అందుకే వాళ్లు ఇష్టంగా తినేలా చేసి పెట్టే ఒక అద్భుతమైన ఇన్స్టంట్ ఇడ్లీ రెసిపీ ఉంది. అదే, సూపర్ టేస్టీ "మొక్కజొన్న ఇడ్లీలు". వీటిని అప్పటికప్పుడు చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. రెగ్యులర్ చేసుకునే వాటితో పోల్చితే ఇవి సాఫ్ట్‌గా, మంచి రుచికరంగానూ ఉంటాయి. పిల్లలతో పాటు ఇడ్లీ అంటే నచ్చనివాళ్లూ ఇష్టంగా తింటారు. పైగా ప్రస్తుతం మొక్కజొన్నలు విరివిగా లభిస్తున్నాయి. అందుకే, మీరూ ఎప్పుడు చేసుకునే రొటీన్ ఇడ్లీలు కాకుండా ఓసారి ఈ వెరైటీ రెసిపీని ట్రై చేయండి.

కావాల్సిన పదార్థాలు :
- పావుకిలో - మొక్కజొన్నపిండి
- పావు లీటర్ - పెరుగు
- రెండు టీస్పూన్లు - నూనె
- రెండు టేబుల్‌స్పూన్లు - కొత్తిమీర తురుము
- రెండు రెబ్బలు - కరివేపాకు
- ఒక టీస్పూన్ - మినపప్పు
- ఒక టీస్పూన్ - శనగపప్పు
- అరటీస్పూన్ - ఆవాలు
- రెండు - పచ్చిమిర్చి
- ఒకటీస్పూన్ - అల్లం తురుము
- ముప్పావు టీస్పూన్ - బేకింగ్‌సోడా
- ఒక టీస్పూన్ - ఉప్పు
మిగిలిపోయిన ఇడ్లీలతో కమ్మని "స్నాక్" - పిల్లలైతే యమ్మీ యమ్మీ అంటూ తింటారు!

చిట్కాలు :
- ఒకవేళ మీ దగ్గర మొక్కజొన్న పిండి లేకపోతే మొక్కజొన్న పొత్తుల నుంచి గింజలను వేరు చేసుకుని శుభ్రంగా కడగాలి. ఆపై వాటిని వాటర్ లేకుండా వడకట్టి పొడి క్లాత్‌తో తుడిచి రెండు మూడు రోజుల పాటు బాగా ఎండబెట్టాలి.
- అవి పూర్తిగా ఎండిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకుని ఏదైనా డబ్బాలోకి జల్లించి తీసుకుంటే మొక్కజొన్న పిండి రెడీ అవుతుంది.
- మొక్కజొన్న పిండిని ఇంట్లో చేసుకునే టైమ్ లేకపోతే బయట అన్ని సూపర్ మార్కెట్స్‌లో అందుబాటులో ఉంటుంది.
- అలాగే, మీరు ఎక్కువ లేదా తక్కువ మొత్తంలో ఇడ్లీలు చేసుకోవాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ని అందుకు అనుగుణంగా అడ్జస్ట్ చేసుకుని తీసుకుంటే సరిపోతుంది.

తయారీ విధానం :
- మొక్కజొన్న ఇడ్లీ తయారీ కోసం ముందుగా పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లంను వీలైనంత సన్నగా తరుక్కొని రెడీగా ఉంచుకోవాలి. అలాగే, పెరుగుని కొన్ని వాటర్ పోసి కాస్త పలుచగా గిలకొట్టుకుని పక్కనుంచాలి.
- ఇప్పుడు స్టవ్ మీద పాన్‌లో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
- అవి వేగాక సన్నని అల్లం తురుము, పచ్చిమిర్చి తరుగు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి.

- అనంతరం అందులో మొక్కజొన్నపిండి యాడ్ చేసి రెండు నిమిషాల పాటు లో టూ మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ మాడిపోకుండా చక్కగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో వేయించి చల్లార్చుకున్న మొక్కజొన్నపిండి, గిలకొట్టిన పెరుగు, సన్నని కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి మిశ్రమం మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి.
- తర్వాత ఆ మిశ్రమంలో తగినన్ని నీళ్లు పోసి ఇడ్లీ పిండిలా ప్రిపేర్ చేసుకుని పది నిమిషాల పాటు పక్కన ఉంచాలి.

- పది నిమిషాల తర్వాత పిండి మిశ్రమంలో బేకింగ్‌సోడా వేసి మరోసారి బాగా కలుపుకోవాలి.
- అనంతరం ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ తీసుకుని స్టవ్ మీద ఉంచి బాయిల్ చేసుకోవాలి.
- ఆ వాటర్ వేడయ్యేలోపు ఇడ్లీ ప్లేట్స్కి కాస్త నెయ్యి రాసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని వేసుకోవాలి.
- తర్వాత వాటిని ఇడ్లీ కుక్కర్లో పెట్టి సుమారు పావుగంట పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి.
- ఇడ్లీలు మంచిగా ఉడికిన తర్వాత బయటకు తీసుకుని కొత్తిమీర లేదా కొబ్బరి చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలు. అంతే, సూపర్ టేస్టీగా ఉండే "మొక్కజొన్న ఇడ్లీలు" రెడీ!
- చట్నీతో కాకుండా నేరుగా తిన్నా ఈ ఇడ్లీలు మంచి రుచికరంగా ఉంటాయి!
పల్లీలతో చట్నీలే కాదు - ఇలా కరకరలాడే "వడలు" చేసుకోండి! - టేస్ట్ సూపర్!
మరమరాలతో "గుంత పొంగనాలు" - అప్పటికప్పుడు చేసుకోవచ్చు - ఇడ్లీ, దోశ పిండితో పనిలేదు!

