కమ్మని "మిరియాల తమలపాకు రసం" - వేడివేడిగా తింటే అద్దిరిపోతుంది, ప్రిపరేషన్ ఈజీ!
వేడివేడి అన్నంలోకి అద్దిరిపోయే రసం - ఒక్కసారి చేసుకుంటే మళ్లీ మళ్లీ చేసుకోవాలనుకునేంత బాగుంటుంది!

Published : August 10, 2025 at 5:29 PM IST
Miriyala Tamalapaku Rasam: వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడి అన్నంలోకి ఏదైనా రసం పోసుకుని తింటే కమ్మగా ఉంటుంది. అందుకే చాలా మంది టమాటాలతో చారు ప్రిపేర్ చేస్తుంటారు. అయితే ఎప్పుడూ టమాటాలతో కాకుండా ఓసారి ఇలా మిరియాలు, తమలపాకుతో రసం చేసుకోండి. ఘుమఘుమలాడే వాసన, ఘాటైన రుచితో సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. ఇక ఈ రసంలోకి సైడ్ డిష్‌గా వడియాలు, అప్పడాలు వంటివి ఉంటే ఆ ఫీలింగ్ గురించి చెప్పక్కర్లేదు. మరి లేట్ చేయకుండా కమ్మని, ఘాటైన మిరియాల తమలపాకు రసం ఎలా చేసుకోవాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
- చింతపండు - నిమ్మకాయ సైజ్
- ఉప్పు - సరిపడా
- పసుపు - పావు టీస్పూన్
- బెల్లం పొడి - 1 టీస్పూన్

మసాలా పొడి కోసం:
- శొంఠి - కొద్దిగా
- కందిపప్పు - 1 టీస్పూన్
- మిరియాలు - అర టీస్పూన్
- ధనియాలు - 1 టీస్పూన్
- జీలకర్ర - అర టీస్పూన్
- ఎండుమిర్చి - 5
- పిప్పళ్లు - 3

పేస్ట్ కోసం:
- కరివేపాకు - గుప్పెడు
- కొత్తిమీర కాడలు - 1 కట్ట
- తమలపాకులు - 7
తాలింపు కోసం:
- నెయ్యి - 3 టీస్పూన్లు
- ఆవాలు - అర టీస్పూన్
- ఎండుమిర్చి - 2
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఇంగువ - చిటికెడు

తయారీ విధానం:
- ముందుగా చింతపండును ఓ గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడిగి ఓ కప్పు వాటర్ పోసి నానబెట్టాలి. ఈలోపు కొత్తిమీర ఆకులను సన్నగా కట్ చేసుకుని కాడలు పక్కన పెట్టాలి. చారు కోసం కొత్తిమీర కాడలు వాడాలి. అలాగే తమలపాకులను సన్నగా కట్ చేసుకోవాలి.
- చింతపండు నానిన తర్వాత గుజ్జును సెపరేట్ చేసి రెడీగా పెట్టుకోవాలి.
- అడుగు మందంగా ఉన్న గిన్నెలో చింతపండు గుజ్జు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, బెల్లం పొడి వేసి కలుపుకోవాలి.

- ఆ తర్వాత ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్‌లో మరిగించుకోవాలి. ఈలోపు మరో స్టవ్ ఆన్ చేసి శొంఠి, కందిపప్పు, మిరియాలు వేసి లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి.
- ఇవి కాస్త వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి మరోసారి ఫ్రై చేయాలి. చివరగా పిప్పళ్లు వేసి ఓ నిమిషం వేయించి ఓ ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి.

- అదే పాన్‌లోకి కరివేపాకు, కొత్తిమీర కాడలు, తమలపాకు ఆకులు వేసి లో ఫ్లేమ్‌లోనే కొద్దిసేపు వేయించుకోవాలి.
- ఈ ఆకులు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ముందుగా మిక్సీజార్‌లోకి శొంఠి ధనియాల మిశ్రమం వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి.
- అదే మిక్సీజార్‌లోకి కరివేపాకు తమలపాకుల మిశ్రమం వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.
- మరుగుతున్న చింతపండు రసంలోకి గ్రైండ్ చేసి పొడి, పేస్ట్, మరికొన్ని నీళ్లు పోసి ఓ 5 నిమిషాలు మరిగించుకోవాలి.

- ఈలోపు మరో స్టవ్ మీద చిన్న పాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించి చారులో కలిపి స్టవ్ బంద్ చేయాలి.
- చివరగా చారులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి వేడేవేడిగా ఉన్నప్పుడే అన్నంలో పోసుకుని తింటే ఎంతో కమ్మగా ఉండే మిరియాల తమలపాకు రసం రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- తమలపాకులు ఎలాగూ ఘాటు ఉంటాయి కాబట్టి మిరియాలను కాస్త చూసి వేసుకోవాలి. ఎందుకంటే మరీ ఘాటు ఎక్కువైతే రసం తినలేరు.
- అలాగే చింతపండు పులుపుకు తగినట్లుగా వాటర్ పోసుకోవాలి. అదే విధంగా రసం పొడికి కావాల్సిన మసాలా దినుసులను కేవలం లో ఫ్లేమ్‌లో వేయిస్తేనే అవి మంచిగా వేగి రసం రుచికరంగా ఉంటుంది.
బేకరీ స్టైల్ "వెజ్ శాండ్విచ్" - నిమిషాల్లో రెడీ - పిల్లలకు స్నాక్స్‌గా పర్ఫెక్ట్!
కరకరలాడే "మొక్కజొన్న పకోడీలు" - సూపర్ టేస్టీగా ఉంటాయి - పది నిమిషాల్లో తయార్!

