Mirchi Bajji with Vamaku: టీ అండ్ మిర్చి బజ్జీ ఎప్పటికీ బోర్ కొట్టని కాంబినేషన్. ఈవెనింగ్ టైమ్‌లో టీ లేదా కాఫీతోపాటు ఓ నాలుగు మిర్చి బజ్జీలు తింటే కలిగే ఫీలింగ్ వేరే లెవల్. అందుకే రోడ్ సైడ్ బండ్ల మీద లభించే వీటిని వేడివేడిగా తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. సాధారణంగా బజ్జీలు చేయాలంటే మిర్చిల్లోకి స్టఫ్పింగ్ పెట్టాలి. ఆ స్టఫ్పింగ్ కోసం చింతపండు గుజ్జు, వాము, జీలకర్ర పొడి వంటివన్నీ ముందే ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ఇకపై ఆ అవసరం లేకుండా వామాకుతో మిరపకాయ బజ్జీలు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మరి లేట్ చేయకుండా ఈ వామాకు మిరపకాయ బజ్జీలు ఎలా చేయాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- బజ్జీ మిరపకాయలు - 15
- వామాకులు - 10
- శనగపిండి - 1 కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- బేకింగ్ సోడా - అర టీస్పూన్
- పసుపు - పావు టీస్పూన్

తయారీ విధానం:
- ముందుగా బజ్జీ మిరపకాయలను శుభ్రంగా కడిగి తుడవాలి. ఆ తర్వాత చివర్లు కొద్దిగా కట్ చేసి నిలువగా చీల్చి లోపలి గింజలు తీసేసుకోవాలి. ఇలా అన్నింటిని చేసుకోవాలి.
- వామాకును కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత వాటి కాడలు కట్ చేసి సన్నగా, పొడుగ్గా కట్ చేసుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
- ఇప్పుడు అందులోకి అర టీ స్పూన్ ఉప్పు, రెండు టీ స్పూన్ల శనగపిండి వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే స్టఫ్పింగ్ రెడీ.
- ఈ వామాకు స్టఫ్పింగ్ను బజ్జీ మిర్చిల్లో పెట్టి పక్కన ఉంచాలి.

- ఓ గిన్నెలోకి శనగపిండి, ఉప్పు, బేకింగ్ సోడా, పసుపు వేసి కలపాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని బజ్జీలు వేసుకునేందుకు అనువుగా కలుపుకోవాలి.
- నీళ్లు సరిపోయినవి అనుకున్న తర్వాత పిండిని ఒకే డైరక్షన్లో 5 నిమిషాల పాటు ఆపకుండా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల పిండి స్మూత్‌గా మారుతుంది.

- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్‌ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి.
- నూనె బాగా కాగిన తర్వాత మంటను సిమ్‌లో పెట్టి స్టఫ్ చేసిన మిరపకాయ ఒకటి తీసుకుని శనగపిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి.
- ఇలా కడాయికి సరిపడా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి.

- ఇలా కాలిన వాటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే నూనె ఏమైనా ఉన్నా పీల్చుకుంటుంది. ఇదే పద్ధతిలో మిగిలిన బజ్జీలను కూడా చేసుకోవాలి.
- ఇలా తయారు చేసుకున్న బజ్జీలను టమాట చట్నీ, ఉల్లిపాయతో సర్వ్ చేసుకుంటే వామాకుతో మిర్చి బజ్జీలు రెడీ. నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి.

టిప్స్:
- శనగపిండిలో కొద్దిగా బియ్యప్పిండి కలపడం వల్ల బజ్జీలు నూనె తక్కువ పీల్చడమే కాకుండా పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా వస్తాయి.
- తినేటప్పుడు వామాకు పంటికి తగులుతుంటే ఆ రుచి మరో లెవల్లో ఉంటుంది. కాబట్టి అందుకు సరిపడేలా వామాకును కట్ చేసుకోవాలి.
- వామాకులను శుభ్రం చేసిన తర్వాత పూర్తిగా ఆరబెట్టుకుని కట్ చేయాలి. తడి మీద కట్ చేస్తే వాటిలో నీరు ఊరి నూనెలో వేసినప్పుడు బజ్జీ పగిలిపోయే అవకాశం ఉంటుంది.
- పిండిలో కొద్దిగా వేడి నూనె వేయడం వల్ల బజ్జీలు మరింత పొంగి, కరకరలాడతాయి.
విలేజ్ స్టైల్ "మామిడికాయ ఎండు రొయ్యల కూర" - పుల్లగా, కారంగా నోటికి మస్తు ఉంటుంది!