సండే హెచ్చరిక : సినిమా హీరోల్లా మైనర్ల డ్రైవింగ్ - రోడ్డు మీద తొక్కేసిపోతున్న లారీలు! - ఇవి చేయకండి
- తల్లిదండ్రులూ జాగ్రత్తగా ఉండాల్సిందే - అలా చేయకపోతే కడుపుకోత తప్పదు!

Published : March 1, 2025 at 7:50 PM IST
Minor Rash Driving : టీనేజ్ కు అసలే హార్స్ పవర్ ఎక్కువ. శరవేగంగా చోటుచేసుకునే శారీరక, మానసిక మార్పులతో.. మూడ్ స్వింగ్స్ ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటాయి. మనసు వేల కిలోమీటర్ల వేగంతో రయ్య్ రయ్య్ మంటూ ఉంటుంది. అలాంటి టైమ్‌లో వాళ్లకి ఎక్సలేటర్ ఇస్తే ఎలా ఉంటుంది? ఇంత హైపర్తో ఉండే పిల్లలు బైకులు, కార్లతో రోడ్డుమీద ర్యాష్‌గా దూసుకెళ్తున్నారు. తెలిసీ తెలియక చేసే పొరపాట్లతో యాక్సిడెంట్లకు గురవుతున్నారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. మరి, ఈ ఘోరాలను ఎలా అడ్డుకోవాలి? ఇందుకు తల్లిదండ్రులు ఏం చేయాలి? అన్నది ఈ "సండే హెచ్చరిక"లో చూద్దాం.
తాజాగా ముగ్గురు :
ఇటీవల హైదరాబాద్ లో ముగ్గురు మైనర్లు ఒకే బైక్ మీద బహదూర్‌పుర నుంచి ఆరామ్‌ఘర్ వెళ్తున్నారు. సమయం అర్ధరాత్రి దాటింది. అతివేగంగా దూసుకెళ్తూ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. బైకు పల్టీలు కొడుతూ అల్లంత దూరం దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు బాలురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
పద్దెనిమిదేళ్లు కూడా నిండని పిల్లల చేతికి బైకులు ఇస్తే ఎలాంటి ఘోరాలు జరుగుతాయో చెప్పడానికి ఇదొక తాజా ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఘటనలు నిత్యం దేశవ్యాప్తంగా వందల్లో జరుగుతుంటాయి. కేవలం మన హైదరాబాద్‌లోనే మైనర్లు బైకులు, కార్లు నడుపుతూ ఎన్నో ప్రమాదాలకు కారణమవుతున్నారు.
జాయ్ జాయ్‌గా :
యుక్తవయసులో మనసు మితిమీరిన వేగాన్ని కోరుకుంటుంది. ఎంత వేగంగా వెళ్తే అంత అద్భుతంగా ఫీలవుతుంటారు. దానికితోడు సినిమాల్లో మాదిరిగా స్టంట్స్ కూడా చేస్తుంటారు. తెలిసీ తెలియని తనం, అనుభవ లేమి కారణంగా పట్టుతప్పుతున్నారు. అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారు. వారు ప్రాణాలు కోల్పోవడంతోపాటు ఏ పాపమూ తెలియని ఇతర వాహనదారుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు.
ఖాతరు చేయట్లేదు :
ఇంట్లో తల్లిదండ్రుల భయం లేకపోవడమో, తమను ఎవరూ ఏమీ చేయలేరనే అహంకారమో గానీ రోడ్డు మీద రూల్స్ బేఖాతరు చేస్తున్నారు. ఇష్టారీతిన వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఒక మట్టి రోడ్డులో బైక్ ఎలా నడపాలి? ఇసుక తోవలో ఎలా వెళ్లాలి? తారు రోడ్డు మీద ఎంత వేగంతో వెళ్లాలి? తారు రోడ్డు మీద ఇసుక ఉంటే బైక్‌ను ఎలా కంట్రోల్ చేయాలి? ఇవేవీ పూర్తిగా తెలియకుండానే అమిత వేగంతో దూసుకెళ్తున్నారు. ఊహించని రీతిలో ప్రమాదాలకు కారణం అవుతున్నారు.
మెజారిటీ తప్పు తల్లిదండ్రులదే! :
తాము పడ్డ కష్టాలు తమ పిల్లలు పడకూడదనే ధోరణిలో చాలా మంది తల్లిదండ్రులు ఉంటున్నారని, ఈ కారణంతోనే ఆర్థిక స్థోమత సరిగా లేకున్నా కూడా పిల్లలకు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఖరీదైన బైకులు కొనిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. పిల్లల కళ్లల్లో తాత్కాలిక సంతోషాలను చూస్తున్నారే తప్ప, రాబోయే ముప్పును మాత్రం పసిగట్ట లేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతిగారాబం చేస్తూ, పిల్లలు ప్రాణాల మీదకు తెచ్చుకోవడంలో పరోక్షంగా తాము కూడా కారణమవుతున్నారని చెబుతున్నారు.
మూడేళ్ల జైలు :
మోటారు వాహనా చట్టం ప్రకారం, 18 ఏళ్లు నిండని వారు వాహనాలు నడిపుతూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడితే కఠిన చర్యలు తప్పవు. వాహనం నడిపిన మైనర్‌తోపాటు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తారు. ఆ తర్వాత కోర్టుకు పంపిస్తారు. అక్కడ న్యాయమూర్తి పరిశీలించి, రూ.5వేల నుంచి 25వేల మధ్యన జరిమానా విధిస్తారు. లేదంటే మూడు సంవత్సరాల జైలుశిక్ష కూడా విధిస్తారు. ఒక్కోసారి రెండూ కూడా విధించవచ్చు.
తల్లిదండ్రులు ఇలా చేయాలి :
- ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్ల చేతికి వాహనం ఇవ్వ కూడదు. అంతగా బైక్ మీదనే వెళ్లాల్సి వస్తే మీరే తీసుకెళ్లండి.
- పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లేటప్పుడు చాలా మంది పేరెంట్స్ స్కూల్ బ్యాగులను బైక్ హ్యాండిల్‌కు తగిలిస్తుంటారు. దీనివల్ల రోడ్డు మలుపుల్లో హ్యాండిల్ తిరగకపోవచ్చు. అదే జరిగితే బైక్ కిందపడిపోతుంది. వెనక నుంచి వచ్చే వాహనాలు ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది.
- చాలా మంది ఆలస్యంగా బయల్దేరుతుంటారు. పాఠశాల టైమ్ దాటిపోతోందని వేగంగా వెళ్తుంటారు. రాంగ్‌రూట్‌లో కూడా పోతుంటారు. ఇలాంటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- పిల్లలు ఉన్నప్పుడు ఓవర్‌టేక్ చేయడం మానుకోండి. వేగం మానుకొని నిదానంగా వెళ్లండి.
- నాలుగేళ్ల లోపు పిల్లల్ని బైక్ వెనకాల అస్సలే కూర్చోబెట్ట కూడదు. సరిగా బ్యాలెన్స్ చేసుకోలేక కిందపడిపోయే ప్రమాదం ఉంటుంది.

