Masala Oats Khichdi Recipe : మధ్యాహ్న భోజనంలోకి ఎప్పుడూ ఒకే రకమైన భోజనం బోర్ కొడుతుంది. కూరలు, రసం, సాంబార్, పెరుగు కాకుండా ఇలాంటి హై న్యూట్రిషన్ ఫుడ్ వారంలో ఒకసారైనా ట్రై చేసి చూడండి. పెసరపప్పు, ఓట్స్, కూరగాయ ముక్కలతో చేసే ఈ రెసిపీ ఎంతో హెల్దీ. ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మీ చిన్నారులకు ఇలాంటి ఆహారం ఇవ్వడం వల్ల హెల్దీగా ఉంటారు. అంతే కాదు ఎంతో రుచికరమైన ఈ మసాలా ఓట్స్ కిచిడీ మనసుకూ సంతృప్తినిస్తుంది.
ఈ ఆదివారం "మృగశిర కార్తె" - చేపల పులుసులో 'ఈ మసాలా' వేస్తే గిన్నెలు ఖాళీ చేస్తారు!

కావల్సిన పదార్థాలు :
- నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
- పెసర పప్పు - ముప్పావు కప్పు
- ఓట్స్ - అర కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- జీలకర్ర - 1 టీ స్పూన్
- ఇంగువ - పావు టీ స్పూన్
- అల్లం - టేబుల్ స్పూన్
- కరివేపాకు - 1 రెమ్మ
- ఉల్లిగడ్డ - 1

- పచ్చి మిర్చి -3
- క్యారెట్ తరుగు - పావు కప్పు
- బ్రోకలీ - కొద్దిగా
- క్యాప్సికం -1
- గ్రీన్ బటానీ - 2 టేబుల్ స్పూన్లు
- స్వీట్ కార్న్ - 2 టేబుల్ స్పూన్లు
- టమోటా - 1
- పాలకూర - 1 కట్ట
- గరం మసాలా - అర స్పూన్
- కారం - అర టేబుల్ స్పూన్
- పసుపు - అర టీ స్పూన్

తయారీ విధానం :
- ముందుగా కుక్కర్ పొయ్యి మీద పెట్టుకుని అర టేబుల్ స్పూన్ నెయ్యి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించాలి. ఆ తర్వాత ముప్పావు కప్పు పెసర పప్పు లేదా పొట్టు పెసర పప్పు వేసుకుని సన్నటి మంటపై దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇపుడు అర కప్పు ఓట్స్ కూడా వేసుకుని మూడు నాలుగు నిమిషాల పాటు వేయించుకోవాిల. ఆ తర్వాత మూడున్నర కప్పుల నీరు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి కాస్త రుబ్బుకోవాలి.

- ఇపుడు కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకుని జీలకర్ర వేసి చిట్లించి ఇంగువ, అల్లం తరుగు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి వేగుతున్నపుడు ఉల్లిపాయ తరుగు, పచ్చి మిర్చి చీలికలు వేసుకోవాలి. ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత పావు కప్పు క్యారెట్ తరుగు, కొద్దిగా బ్రోకలీ, క్యాప్సికం ముక్కలు, గ్రీన్ బటానీ, తాజా స్వీట్ కార్న్ తోపాటు మీకు అందుబాటులో ఉన్న కూరగాయ ముక్కలు వేసుకోవచ్చు.

- మూడు నాలుగు నిమిషాలు మగ్గించిన తర్వాత అరకప్పు టమోటా తరుగు, సన్నగా తరిగిన పాలకూర, జీలకర్ర, గరం మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత కారం, పసుపు. ఉప్పు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. ఇపుడు ఉడికించుకున్న ఓట్స్, కప్పున్నర నీళ్లు పోసి కలుపుకొని ఉప్పు, కారం చూసుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగు, నెయ్యి వేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలు.

ఇలా చేస్తే జొన్న రొట్టె కూడా ఉ"ప్పొంగుతుంది" - రొట్టె చేయడం రాని వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు!
హోటల్ దోసె పిండిలో వంట సోడా వేయరు - కానీ, కిటుకు అంతా అక్కడే!