Mango Rava Laddu Recipe : 'రవ్వ లడ్డూ' ఎక్కువ మంది ఇష్టపడే తీపి వంటకాలలో ఒకటి. పండగలు, ఫంక్షన్స్ టైమ్‌లో మెజార్టీ పీపుల్ ఏదైనా లడ్డూ చేసుకోవాలనుకున్నప్పుడు దీనికే మొదటి ఓటు వేస్తారు. ఎందుకంటే తక్కువ టైమ్‌లో ఈజీగా అవ్వడమే కాకుండా, రుచికరంగానూ ఉంటాయి. రవ్వ లడ్డూలను ఎప్పుడూ తినే విధంగా తినాలన్నా బోర్ కొడుతుంది. అందుకే పండ్లలో రారాజు అయిన మామిడిపండ్లతో రవ్వ లడ్డూలను చేసుకోండి.
ఈ లడ్డూ రెసిపీ సరికొత్త టేస్ట్‌తో భలే అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు, దీని తయారీకి ఎలాంటి పాకం పట్టాల్సిన పని కూడా లేదు! ఎవరైనా చాలా సింపుల్‌గా తక్కువ టైమ్‌లో రెడీ చేసుకోవచ్చు. ఇంతకీ, వీటి తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
- మామిడిపండు గుజ్జు - 1 కప్పు
- బొంబాయి రవ్వ - 1 కప్పు
- కొబ్బరి తురుము - అర కప్పు
- ఉప్పు - చిటికెడు
- నెయ్యి - తగినంత
- జీడిపప్పు - కొన్ని
- కిస్మిస్ - కొన్ని
- పంచదార - అర కప్పు
- యాలకులు - 4

తయారీ విధానం:
- మామిడి పండును శుభ్రంగా కడిగి పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను మిక్సీజార్‌లో వేసి, పావు కప్పు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఓ కప్పు కొలత ప్రకారం తీసి పక్కన ఉంచాలి.

- ఓ మిక్సింగ్ బౌల్లోకి బొంబాయి రవ్వ, పచ్చికొబ్బరి తురుము, మామిడి గుజ్జు, ఉప్పు వేసి బాగా కలిపి ఓ 5 నిమిషాలు పక్కన ఉంచాలి.
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. అందులోకి జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా ఫ్రై చేసుకుని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి.
- అదే పాన్‌లో మరికొంచెం నెయ్యి వేసి ముందుగానే కలుపుకున్న రవ్వ మిశ్రమం వేసి మీడియం ఫ్లేమ్‌లో పొడిపొడిగా అయ్యేంతవరకు కలుపుతూ వేయించుకోవాలి.

- రవ్వ మిశ్రమం పొడిపొడిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఓ ప్లేట్లోకి వేసుకుని చల్లారనివ్వాలి.
- ఈలోపు మిక్సీజార్‌లోకి పంచదార, యాలకులు వేసి మెత్తని పొడిలా చేయాలి.
- రవ్వ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసిన పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. చివరగా ఫ్రై చేసిన జీడిపప్పు, కిస్మిస్ వేసి కలిపి చేతికి నెయ్యి రాసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. అంతే ఎంతో కమ్మగా ఉండే మామిడి రవ్వ లడ్డూలు రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- బాగా పండిన మామిడికాయ తీసుకుంటే లడ్డూల రుచి బాగుంటుంది.
- ఇక్కడ పంచదారను మీరు తీసుకునే మామిడి తీపికి అనుగుణంగా కలుపుకోవాలి. అలాగే చక్కెర బదులు బెల్లం పొడి కూడా వేసి కలుపుకోవచ్చు.
- రవ్వ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే పంచదార పొడి కలుపుకోవాలి. వేడి మీద కలుపుకుంటే పంచదార కరిగి లడ్డూలు సరిగ్గా రావు.

గోధుమపిండితో అమ్మమ్మల నాటి "చిటిమీల పాయసం" - పాలు విరగకుండా, కమ్మగా తినేస్తారు!
పూరీ ప్రెస్‌తో చాలా ఈజీగా "జొన్న రొట్టెలు" చేసుకోండి - విరగకుండా గంటలపాటు సూపర్ సాఫ్ట్!