Murabba Recipe: ప్రస్తుతం మామిడికాయల సీజన్ నడుస్తోంది. మార్కెట్లో అధిక సంఖ్యలో ఇవి లభిస్తున్నాయి. ఇక పచ్చి మామిడి అంటే చాలా మందికి నిల్వ పచ్చడి గుర్తుకువస్తుంది. ఆ తర్వాత పులిహోర, డ్రింక్స్ అంటూ పలు రకాలు చేసుకుంటుంటారు. కానీ మామిడితో ఎంతో రుచికరంగా ఉండే మురబ్బా చేసుకోవచ్చు. చాలా మందికి అల్లం, ఉసిరితో చేసిన మురబ్బా తెలిసే ఉంటుంది. కానీ మామిడికాయతో కూడా సూపర్ టేస్టీగా చేసుకోవచ్చు. అతి తక్కువ పదార్థాలతో, ఎక్కువ సమయం లేకుండా చాలా ఈజీగా, మరింత రుచికరంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నం, చపాతీల్లోకి సూపర్ కాంబినేషన్. మరి లేట్ చేయకుండా మామిడి మురబ్బాను ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- మామిడి తురుము - 3 కప్పులు
- బెల్లం తురుము - 1 కప్పు
- పంచదార - ఒకటిన్నర కప్పులు
- వేయించిన జీలకర్ర పొడి - అర టీ స్పూన్
- బ్లాక్ సాల్ట్ - అర టీ స్పూన్
- కారం - అర టీ స్పూన్

తయారీ విధానం:
- మీడియం సైజ్‌లో ఉండే పచ్చి పుల్లటి మామిడికాయలు తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి పొట్టు తీసేసి తురుముకోవాలి. ఇలా తురుముకున్న మామిడి అనేది కొలతల ప్రకారం మూడు కప్పులు ఉండాలి.
- అడుగు మందంగా ఉండే గిన్నెలో మామిడి తురుము, బెల్లం తురుము, పంచదార వేసి కలుపుకోవాలి. ఇక్కడ మీరు పూర్తిగా బెల్లం లేదా పంచదారతో చేసుకోవచ్చు.
- స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెను పెట్టి మీడియం ఫ్లేమ్‌లో బెల్లం, పంచదార కరిగేలా కలుపుతూ ఉడికించుకోవాలి.
- బెల్లం, పంచదార కరిగిన మధ్యమధ్యలో కలుపుతూ ఓ 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేకపోతే రోజూ వాడే ఉప్పును వేసుకోవచ్చు.

- వీటన్నింటినీ బాగా కలిపిన తర్వాత లేత పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మిశ్రమం దగ్గరపడిన తర్వాత కొంచెం తీసుకుని లేత తీగ పాకం వచ్చిందేమో చూసుకోవాలి. ఒకవేళ మీకు పాకం పట్టడం రాకపోతే కొంచెం మామిడి మిశ్రమాన్ని తీసుకుని ప్లేట్లోకి వేసి ప్లేట్‌ను వంచాలి. ఆ మిశ్రమం అనేది జారకుండా అదే ప్లేస్‌లో ఉంటే మురబ్బా రెడీ అయినట్లే. అలా కాకుండా ఉంటే మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి.
- మిశ్రమం మొత్తం రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టకుండా మధ్యమధ్యలో కలుపుతూ చల్లారినివ్వాలి.
- ఇలా చల్లారిన మిశ్రమాన్ని ఓ గాజు జార్‌లోకి వేసుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం నిల్వ ఉండే మామిడి మురబ్బా రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

టిప్స్:
- మామిడి మురబ్బా మరింత రుచికరంగా ఉంచడానికి కొద్దిగా నిమ్మ లేదా అల్లం రసం యాడ్ చేసుకోవచ్చు.
- మామిడి మురబ్బాను తయారు చేయడానికి పుల్లగా ఉండే మామిడికాయలు అనుకూలంగా ఉంటాయి.
- మామిడి మురబ్బాను ఎక్కువ కాలం నిల్వ చేయాలనుకుంటే, కొద్దిగా వెనిగర్ కలుపుకోవచ్చు.
- అలాగే ఈ స్వీట్ పచ్చడిని స్టోర్ చేసుకోవడానికి గాజు జార్ లేదా జాడీలను మాత్రమే వాడాలు. ఎట్టి పరిస్థితులలో ప్లాస్టిక్, స్టీల్, అల్యూమినియం డబ్బాలు వాడకూడదు.

ఘుమఘుమలాడే తెలంగాణ స్టైల్ "కొర్రమీను చేపల పులుసు" - అద్దిరిపోయే రుచితో ప్లేట్లు నాకాల్సిందే!
మూడే మూడు ఉల్లిపాయలతో క్రంచీ "వడలు" - సాయంత్రానికి బెస్ట్ స్నాక్ - నిమిషాల్లో రెడీ!