Make Delicious Mango Idli at Home : వేసవి కాలం వచ్చిందంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేవి మామిడి పండ్లు. ఈ సీజనల్ ఫ్రూట్ కోసం ఏడాదంతా ఎదురుచూసే అభిమానులు లేకపోలేదు. అయితే, ఎండాకాలంలో విరివిగా లభించే ఈ మధుర ఫలాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా టేస్ట్ చేస్తుంటారు. ముఖ్యంగా ఎక్కువ మంది దీన్ని నేరుగా తినడమో, జ్యూస్ చేసుకొని తాగడమో చేస్తుంటారు. కానీ, చాలా మందికి తెలియని విషయమేమిటంటే అదే మామిడిపండ్లతో నోరూరించే తియ్యటి రుచికరమైన "ఇడ్లీలు" కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి సూపర్ సాఫ్ట్‌గా ఉండి తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. పైగా వీటి తయారీకి ఎక్కువ టైమ్ కేటాయించాల్సిన పని లేదు. ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తెల్లటి ఇడ్లీలు తినని పిల్లలకు ఓసారి ఇవి పెడితే ఎంతో ఇష్టంగా లాగిస్తారు. ఇంతకీ, మామిడి పండ్లతో ఇడ్లీలను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ :
- రెండు కప్పులు - మామిడి పండు గుజ్జు
- రెండు కప్పులు - ఇడ్లీ రవ్వ
- తగినంత - చక్కెర పొడి
- అర కప్పు - పెరుగు
- రెండు టేబుల్‌స్పూన్లు - నెయ్యి
- అర టీస్పూన్ - యాలకుల పొడి
- పావు టీస్పూన్ - మిరియాల పొడి
- అర కప్పు - పాలు
- రుచికి సరిపడా - ఉప్పు
- కొద్దిగా - జీడిపప్పు పలుకులు(గార్నిష్ కోసం)

మ్యాంగో ఇడ్లీలు సింపుల్‌గా చేసుకోండిలా :
- ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగి కాస్త వేడయ్యాక జీడిపప్పు పలుకులను వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచాలి.
- అనంతరం అదే నెయ్యిలో ఇడ్లీ రవ్వను వేసి లో ఫ్లేమ్ మీద కాసేపు వేయించి పక్కకు తీసుకోవాలి.
- ఇప్పుడు ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మామిడి పండు గుజ్జు, వేయించిన ఇడ్లీ రవ్వ, చక్కెర పొడి, ఉప్పు, పెరుగు, యాలకుల పొడి, మిరియాల పొడి వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత గిన్నెపై మూతపెట్టి రెండు గంటల పాటు అలా వదిలేయాలి.
- రెండు గంటల అనంతరం గిన్నెపై మూత తీసి ఈ పిండిలో కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ ఇడ్లీ పిండిలా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.

- అనంతరం స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో తగినన్ని నీరు పోసి మూతపెట్టి మరిగించుకోవాలి. ఆ నీరు కాస్త బాయిల్ అయ్యే లోపు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని అన్నింటికీ కాస్త నెయ్యి అప్లై చేసుకోవాలి.
- ఆ తర్వాత అన్ని గుంతల్లో ముందుగా ప్రిపర్ చేసుకున్న పిండిని చక్కగా నింపుకోవాలి. ఆపై ఇడ్లీ పిండి మీద దోరగా వేయించిన పలుకులను గార్నిష్ చేసుకోవాలి.
- అనంతరం వాటిని ఇడ్లీ పాత్రలో ఉంచి, మూతపెట్టి సాధారణ మంటపై 20 నిమిషాల ఉడించుకోవాలి.
- ఆవిధంగా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఐదు నిమిషాల తర్వాత ఇడ్లీలను బయటకు తీసి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, సూపర్ టేస్టీ "మామిడి పండు ఇడ్లీలు" రెడీ!

కందిపప్పు, చింతపండు లేకుండానే "హోటల్ స్టైల్ ఇడ్లీ సాంబార్" - ఈ కొలతలతో చేస్తే కిర్రాక్ టేస్ట్!
పప్పులు నానబెట్టడం, రుబ్బడం లేకుండా - ఈ "పొడి"తో అప్పటికప్పుడు దూది లాంటి మెత్తని ఇడ్లీలు!