Mamidikaya Turumu Vellulli Pachadi: మామిడికాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వేడివేడి అన్నంలో కూసింత పచ్చడి, కాస్త నెయ్యి దట్టించి తింటే అంతకు మించినది మరొకటి ఉండదు. అందుకే మామిడికాయలతో వీలైనన్ని రకాలుగా పచ్చళ్లు తయారు చేస్తుంటారు అమ్మలు. అందులో మామిడితురుము వెల్లుల్లి పచ్చడి ఒకటి. ఈ పచ్చడిని చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. కరెక్ట్ కొలతలతో పెడితే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. పైగా బూజు పట్టడం వంటి సమస్యే ఉండదు. మరి లేట్ చేయకుండా కమ్మని మామిడికాయ తురుము వెల్లుల్లి పచ్చడి ఎలా పెట్టాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
- మామిడికాయలు - 3
- మెంతులు - 1 టేబుల్‌స్పూన్(12 గ్రాములు)
- ఆవాలు - 2 టేబుల్‌స్పూన్లు(24 గ్రాములు)
- వెల్లుల్లి రెబ్బలు - 100 గ్రాములు
- కారం - అర కప్పు(60 గ్రాములు)
- ఉప్పు - పావు కప్పు(60 గ్రాములు)
- పసుపు - పావు టీస్పూన్

తాలింపు కోసం:
- పల్లీ నూనె - ఒకటింపావు కప్పు(300ml)
- మెంతులు - పావు టీస్పూన్
- ఆవాలు - 1 టీస్పూన్
- ఎండుమిర్చి - 4
- ఇంగువ - అర టీస్పూన్
- కరివేపాకు - గుప్పెడు
తయారీ విధానం:
- ముందుగా పచ్చి మామిడికాయలను నీళ్లలో వేసి ఓ అరగంట సేపు నాననివ్వాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి అస్సలు తడి లేకుండా తుడిచి ఆరబెట్టాలి.
- మామిడి పూర్తిగా ఆరిన తర్వాత పొట్టు తీసేసి తురిమి ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ తురుము ఎండలో అయితే ఒక గంట, ఫ్యాన్ కింద అయితే సుమారు 2 గంటల పాటు ఆరబెట్టాలి. అలాగే కరివేపాకు ఆకులను కూడా శుభ్రంగా కడిగి తడి లేకుండా ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలపై పొట్టు తీసేసి కొలత ప్రకారం తీసుకోవాలి.

- మామిడి తురుము ఎండిన తర్వాత ఇంట్లో సమానంగా ఉండే ఏదైనా గ్లాస్ లేదా కప్పు తీసుకుని కొలుచుకోవాలి. మామిడి తురుము కొలతను బట్టి కారం, ఉప్పు వేసుకోవాలి. కాబట్టి పైన చెప్పిన కొలతలన్నీ రెండు కప్పుల మామిడి తురుముకు సంబంధించినవి.
- ఇలా మామిడి తురుము కొలిచిన తర్వాత ఓ గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి మెంతులు వేసి వేగనివ్వాలి.
- మెంతులు సరిగా వేగిన తర్వాత ఆవాలు వేసి వాటిని వేయించి ఓ ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.

- ఈలోపు అదే స్టవ్ మీద కడాయి ఉంచి నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి. చివరగా ఆరబెట్టుకున్న కరివేపాకు వేసి ఫ్రై చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
- మిక్సీజార్‌లోకి వేయించి చల్లార్చిన ఆవాలు, మెంతులు వేసి మెత్తని పొడిలా చేసి పక్కన ఉంచాలి.
- కొలిచి పెట్టుకున్న మామిడి తురుము గిన్నెలో పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు, గ్రైండ్ చేసుకున్న ఆవ మెంతి పిండి, పసుపు వేసి బాగా కలుపుకోవాలి.

- ఈ మిశ్రమంలోకి చల్లారిన తాలింపు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడిని తడి లేని గాజు జాడీలో పెట్టి మూత గట్టిగా పెట్టి మూడు రోజుల పాటు ఊరనివ్వాలి.
- మూడు రోజుల తర్వాత జాడీపై మూత తీసి బాగా కలిపి కావాల్సినంత బయట ఉంచి, మిగతాది ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ఎంతో రుచికరంగా ఉండే మామిడితురుము వెల్లుల్లి పచ్చడి రెడీ. నచ్చితే మీరూ ఈ పద్ధతిలో ట్రై చేయండి.

చిట్కాలు:
- ఈ పచ్చడి కోసం బాగా పుల్లగా ఉన్న మామిడికాయలు అయితే బాగుంటాయి. చిన్న రసాలు, నీలాలు సూట్ అవుతాయి.
- మీరు తీసుకునే మామిడి కొలత ప్రకారమే ఉప్పు, కారం తీసుకోవాలి. అంటే రెండు కప్పుల మామిడి తురుముకు అర కప్పు కారం, పావు కప్పు ఉప్పు తీసుకోవాలి. ఒకవేళ పచ్చడి ఎక్కువ మొత్తంలో పెట్టుకోవాలంటే దాని ప్రకారం తీసుకోవాలి.
- పచ్చడిని ఎట్టి పరిస్థితులల్లో మూడు రోజుల పాటు ఊరనివ్వాలి. లేదంటే వెల్లుల్లి ఘాటు తినలేరు.
- పచ్చడిని ఎట్టి పరిస్థితులల్లో తడి గరిటెలు పెట్టి కలపడం, తడి చేతులతో పెట్టడం చేస్తే తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది.
ఇవి రెండూ వేసి "వంకాయ ఫ్రై కారం" చేసుకోండి - పొడిపొడిగా వస్తుంది - టేస్ట్ అద్దిరిపోతుంది!
మిక్సీ, రోలుతో పనిలేకుండా - అన్ని టిఫెన్స్లోకి సూపర్ "చట్నీ" - నిమిషాల్లోనే రెడీ!