ETV Bharat / offbeat

రంగురంగుల బీట్​రూట్ "ఇడ్లీలు" - గుండె ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి!

- బీట్​రూట్​తో జ్యూస్ కాదు ఇలా ఇడ్లీలు చేసుకోండి!

Beetroot Idli
Beetroot Idli with Simple Steps (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 21, 2025 at 7:56 PM IST

4 Min Read
Choose ETV Bharat

Make Healthy Beetroot Idli with Simple Steps : దక్షిణాది రాష్ట్రాలలో దోశతోపాటు ఎక్కువ మంది ఇష్టపడే టిఫెన్లలో ఒకటి ఇడ్లీ. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే, వైద్యులు కూడా జ్వరం వచ్చినప్పుడు ఇడ్లీ తినమని సజెస్ట్ చేస్తుంటారు. అయితే, మనందరికీ ఎక్కువగా నార్మల్​గా మినపప్పు, రవ్వతో చేసే తెల్ల ఇడ్లీలే పరిచయం. ఈ మధ్య రాగి ఇడ్లీలు కూడా కొందరు టేస్ట్ చేస్తున్నారు. కానీ, ఎప్పుడైనా బీట్​రూట్ ఇడ్లీలను రుచి చూశారా?

బీట్​రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలుసు. కానీ, నేరుగా తినేందుకు అంతగా ఇష్టపడరు ఎక్కువ మంది. ఇక పిల్లలైతే వాటిని దగ్గరకు కూడా రానివ్వరు. అలాంటి వారికి ఇలా "బీట్​రూట్​ ఇడ్లీలు" చేసి పెట్టండి. కలర్​ఫుల్​గా ఉండే వీటిని ఎంతో ఇష్టంగా లాగిస్తారు. టేస్ట్​ కూడా చాలా బాగుంటాయి. గుండె ఆరోగ్యానికీ ఎంతో మంచివి. ఇన్​స్టంట్​గా చాలా తక్కువ సమయంలోనే వీటిని తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

Make Healthy Beetroot Idli with Simple Steps
Beetroot (Getty Images)

ఈ టిప్స్​తో మరింత రుచికరం :

  • ఎలాంటి పప్పులు నానబెట్టకుండా, పులియబెట్టకుండా చేసుకునే ఈ ఇడ్లీలు రుచికరంగా రావడం కోసం కాస్త పుల్లగా ఉండే పెరుగు యాడ్ చేసుకోవడం మంచిది.
  • బీట్​రూట్​ని వీలైనంత సన్నగా తరుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం బీట్​రూట్​ని గ్రైండ్ చేసుకోం. అలాగే, బీట్​రూట్ తురుము, ఇడ్లీ రవ్వను మరీ ఎక్కువగా వేయించకుండా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది.
  • ఈ రెసిపీలో వాడే జీడిపప్పు పలుకులు ఇడ్లీలకు అదనపు టేస్ట్​ని ఇస్తాయి.

కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :

  • ఇడ్లీ రవ్వ - ఒకటిం పావు కప్పు
  • బీట్​రూట్ తురుము - అర కప్పు
  • పచ్చిమిర్చి - 2
  • ఆయిల్ - 3 టేబుల్​స్పూన్లు
  • ఆవాలు - అర టీస్పూన్
  • మినపప్పు - 1 టీస్పూన్
  • కరివేపాకు - కొద్దిగా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • జీడిపప్పు పలుకులు - కొన్ని
  • అల్లం తరుగు - 1 టేబుల్​స్పూన్
  • పెరుగు - 1 కప్పు
  • ఈనో - 1 టీస్పూన్
  • నిమ్మరసం - 1 టీస్పూన్
  • నెయ్యి - కొద్దిగా(ఇడ్లీ ప్లేట్స్​కి అప్లై చేయడానికి)

ఎదిగే పిల్లలు, గర్భిణులకు చక్కటి "పిండి" - ఈ ఒక్క దాంతోనే టేస్టీ ఇడ్లీలు, దోశలు!

బీట్​రూట్ ఇడ్లీ చేసుకునే విధానం :

Beetroot Idli
Beetroot (Getty Images)
  • ఈ ఇడ్లీ రెసిపీ కోసం ముందుగా బీట్​రూట్​ని చెక్కు తీసుకొని, సన్నని తురుములా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నూనె కొద్దిగా వేడయ్యాక జీడిపప్పు పలుకులను వేసుకొని దోరగా వేయించి ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం అదే పాన్​లో మినపప్పు, ఆవాలు వేసుకొని కాసేపు వేయించుకోవాలి. అవి వేగాక సన్నగా తరుక్కున్న అల్లం, పచ్చిమిర్చి తరుగు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత కరివేపాకు, తరిగి పెట్టుకున్న బీట్​రూట్ తురుము వేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక ఆ మిశ్రమంలో ఇడ్లీ రవ్వను యాడ్ చేసుకొని మరో 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
  • అనంతరం ఆ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అది పూర్తిగా చల్లారాక అందులో రుచికి తగినంత ఉప్పు, పెరుగు వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.
  • పిండిని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్నాక ముప్పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని మరోసారి మిశ్రమం మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై మిక్సింగ్ బౌల్​పై మూత ఉంచి 20 నిమిషాల పాటు పక్కనుంచాలి.
  • 20 నిమిషాల తర్వాత మూత తీసి పిండి మిశ్రమాన్ని గరిటెతో కలియతిప్పుతూ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అలా కలిపాక ఈనో, నిమ్మరసం వేసుకొని ఇంకోసారి బీట్​రూట్ రవ్వ మిశ్రమం బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
Beetroot Idli
Curd (Getty Images)
  • ఇప్పుడు స్టౌపై ఇడ్లీ పాత్రలో తగినన్ని వాటర్ పోసుకొని మూతపెట్టి మరిగించుకోవాలి. వాటర్ కాస్త మరిగేలోపు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని అన్నింటికీ కాస్త నెయ్యి అప్లై చేసుకోవాలి.
  • ఆ తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకులను ఇడ్లీ ప్లేట్​ ఒక్కో గుంతలో ఒక్కొక్కటి పెట్టుకోవాలి. ఆపై కలిపి పెట్టుకున్న పిండిని వాటిల్లో చక్కగా నింపుకోవాలి.
  • అనంతరం వాటిని ఇడ్లీ పాత్రలో ఉంచి, మూతపెట్టి 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక స్టౌ ఆఫ్ చేసుకొని ఇడ్లీలను బయటకు తీసుకుంటే సరి. అంతే, ఎంతో టేస్టీగా, హెల్దీగా ఉండే "బీట్​రూట్ ఇడ్లీలు" మీ ముందు ఉంటాయి!
BEETROOT IDLI at Home
BEETROOT IDLI MAKING PROCESS (ETV Bharat)

వీటిలో ఉండే పోషకాలు :

బీట్​రూట్​లో ఆరోగ్యానికి కావాల్సిన ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా దీనిలో ఉండే బీటాసైయానిన్, బీటాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. అలాగే, ఫైబర్, విటమిన్ సి, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, ఐరన్ వంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, పోషకాలు పుష్కలంగా ఉండే వీటిని తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు నిపుణులు. బీట్‌రూట్‌లో నైట్రేట్ అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటు తగ్గడానికి తోడ్పడుతుందంటున్నారు.

రేషన్​ బియ్యంతో 'ఇడ్లీ రవ్వ' - ఇంట్లోనే ప్రిపేర్​ చేసుకోండిలా! - ఇడ్లీలు సాఫ్ట్​గా వస్తాయి!

పప్పు రుబ్బే పనిలేదు - చిటికెలో "సేమియా ఇడ్లీ" - టేస్ట్​ అద్దిరిపోతాయి!